గురువారం 04 జూన్ 2020
Karimnagar - May 03, 2020 , 02:54:30

వడ్లు పడుదాం.. తాలు తీసేద్దాం

వడ్లు పడుదాం.. తాలు తీసేద్దాం

  • నాణ్యమైన ధాన్యం కోసం ప్యాడీ క్లీనర్‌ యంత్రాలు
  • కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 127 మిషన్లు 
  • సద్వినియోగం చేసుకుంటున్న రైతులు

శంకరపట్నం : ధాన్యం కొనుగోళ్ల వేళ ‘తాలు తొలగింపు’ ఇబ్బందిగా మారుతున్నది. కొందరు రైతులు గాలి వాటంగా ఎత్తి పోస్తుంటే, మరికొందరు ఎడ్లబండికి ఫ్యాన్‌ ఏర్పాటు చేసి తూర్పారబట్టడం కనిపిస్తున్నది. ఈ ప్రక్రియ భారమవుతుండడంతో అన్నదాతలు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఈ ఇక్కట్లను తొలగించేందుకు రాష్ట్ర సర్కారు మార్కెట్‌ కమిటీల ద్వారా ప్యాడీ క్లీనర్‌ మిషన్లను సమకూరుస్తున్నది. 50 వేల నుంచి 60 వేల వరకు ధర ఉండే ఈ యంత్రాలు కరీంనగర్‌ జిల్లాకు గతంలోనే 73 రాగా, ప్రస్తుతం మరో 54 వచ్చాయి. ఈ యంత్రాలను జిల్లా అంతటా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేస్తుండడంతో తాలు కష్టాలు తీరుతున్నాయి. సులభంగా తాలు పోతుండడం, గంటకు 15 క్వింటాళ్ల ధాన్యం పట్టే అవకాశముండడంతో రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం శంకరపట్నం మండలంలో ఐకేపీతోపాటు తాడికల్‌, మెట్‌పల్లి,  గద్దపాక విండోల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఐదు ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేయగా, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొద్దిగ కష్టపడితె పాయిదా..

మునుపు తాలు పేరిట ఇష్టారీతిన కటింగ్‌ చేసెటోళ్లు. దాంతో రైతులే ఎక్కువ నష్టపోయెటోళ్లు. నేను వానాకాలంల వడ్లు మిల్లుకు కొంటవోతే తాలు ఎక్కువున్నది, తీసుకోనని మిల్లరు సాకు వెట్టిండు. దండంబెట్టి బతిమాలితె తరుగు తీసి, కొన్నడు. అప్పుడు మస్తు నష్టపోయిన.  ఈ సారి మాత్రం అట్లగాలె. మా కొనుగోలు కేంద్రంలనే ప్యాడీ క్లీనర్‌ పెట్టిన్రు. ముగ్గురం మనుషులం తాలు వట్టినం. 10 ట్రిప్పుల వడ్లకు 4 సంచుల తాలు పోయింది. ఈ సారి కొంచెం కష్టపడినందుకు మాకు పాయిదా అయింది. 

- కాసర్ల శంకర్‌, రైతు (మొలంగూర్‌)


రైతులకు మేలు..

మాకు 10 రోజుల కింద ప్యాడీ క్లీనర్‌ పంపిన్రు.     మా సెంటర్ల ఇప్పటి వరకు మొత్తం 3,867 క్వింటాళ్ల వడ్లు తూకం వేసినం. ప్యాడీ క్లీనర్‌ పెట్టినంక 1,500 క్వింటాళ్ల వడ్లు పట్టినం. కేవలం 133 క్వింటాళ్లు మాత్రమే  ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయలేదు. కొద్దిగ కష్టపడి పట్టుకుంటే రైతులకే మేలు జరుగుతది. ఇద్దరు, ముగ్గురు మనుషులు కలిసి గంటకు 15 క్వింటాళ్ల వడ్లు పట్టచ్చు. కొనుగోలు విషయంలో మిల్లర్ల నుంచి సమస్య ఉండదు.

- గాజుల శ్రీనివాస్‌, ఇన్‌చార్జి (మొలంగూర్‌ కొనుగోలు కేంద్రం)logo