గురువారం 04 జూన్ 2020
Karimnagar - Apr 30, 2020 , 02:57:30

పరిశీలిస్తూ.. భరోసానిస్తూ..

పరిశీలిస్తూ.. భరోసానిస్తూ..

  • అకాలవర్షంతో నష్టపోయిన రైతులకు ప్రజాప్రతినిధుల అభయం
  • దెబ్బతిన్న పంటలు, తడిసిన ధాన్యం పరిశీలన 
  • ప్రభుత్వం ఆదుకుంటుందని బాధితులకు హామీ

అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భరోసా ఇస్తున్నారు. వ్యవసాయ అధికారులతో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి, దెబ్బతిన్న మామిడి, వరి, మక్క పంటలతోపాటు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఆయాచోట్ల బాధితులను పరామర్శించారు. ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని అభయమిచ్చారు. నష్ట పరిహారం చెల్లిస్తుందని, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నెట్‌వర్క్‌: జిల్లాలో వరి, మక్కపై పెద్దగా ప్రభావం లేదు. ధాన్యం అక్కడక్కడా పాక్షికంగా తడిసింది. 830 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. గన్నేరువరం మండలంలో 308 ఎకరాలు, మానకొండూర్‌లో 240, తిమ్మాపూర్‌ మండలంలో 145, గంగాధర మండలంలో 115 ఎకరాలు, కొత్తపల్లి మండలంలో 22 ఎకరాల్లో మామిడికి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో తడిసిన ధాన్యాన్ని ఎంపీపీ రవీందర్‌ పరిశీలించారు. ఆయాచోట్ల నేలరాలిన కాయలను అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు. కొత్తపల్లి మండలంలోని ఎలగందుల, నాగులమల్యాల, శ్రీరాముల పల్లి, కమాన్‌పూర్‌ గ్రామాల్లో తడిసిన ధాన్యం, దెబ్బతిన్న వరి, మక్కను వ్యవసాయ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు మహేశ్‌ గౌడ్‌, రవీందర్‌తో కలిసి ఎంపీపీ పిల్లి శ్రీలత పరిశీలించారు. పంట నష్టాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ దృష్టికి తీసుకెళ్లి, రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

జగిత్యాల జిల్లాలో మామిడికి భారీ నష్టం..

జిల్లాలో 34 వేల ఎకరాల్లో మామిడి తోటలుండగా, 12మండలాల్లోని 12,914 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. 1500 ఎకరాల నుంచి 3వేల టన్నుల మామిడి కాయలను మాత్రమే రైతులు తెంపి మార్కెట్‌కు తరలించినట్లు వివరించారు. రాయికల్‌ మండలంలో 3,200 ఎకరాల్లో, మేడిపల్లి మండలంలో 2,927, గొల్లపల్లి మండలంలో 1,555, మల్లాపూర్‌ 1428, కోరుట్ల 1235, కథలాపూర్‌ 942, మల్యాల 558, పెగడపల్లి 368, సారంగాపూర్‌ 217, జగిత్యాల రూరల్‌ 208, బుగ్గారం 200, ధర్మపురి మండలంలో 80 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. బుధవారం పంటల నష్టాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. మేడిపల్లి మండలం కట్లకుంట, భీమారంలో దెబ్బతిన్న మామిడి తోటలు, వరి పొలాలు, కల్లాలు, కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు పరిశీలించి స్థానిక రైతులకు భరోసానిచ్చారు. వారి వెంట ఎంపీపీ దొనకంటి ఉమాదేవి, తహసిల్దార్‌ రాజేశ్వర్‌, ఎంపీడీవో పద్మజ, ఏవో త్రివేదిక ఉన్నారు. కోరుట్ల మండలం మాదాపూర్‌లో దెబ్బతిన్న మామిడితోటను జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, డివిజనల్‌ హార్టికల్చర్‌ అధికారి శ్యాంప్రసాద్‌ పరిశీలించారు. సర్పంచ్‌ దారిశెట్టి రాజేశ్‌ తదితరులున్నారు. మల్లాపూర్‌తోపాటు రేగుంటలో దెబ్బతిన్న మామిడి, బొప్పాయి తోటలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఉద్యానవన శాఖ అధికారి రాజేశ్‌ పరిశీలించారు. పెగడపల్లి మండలంలో 368 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం కలిగిందని ఉద్యానవన శాఖ అధికారి వంశీకృష్ణ తెలిపారు. సుద్దపల్లి, ఐతుపల్లిలో సర్వే చేశారు. సుద్దపల్లిలో 232, ఐతుపల్లిలో 136 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు చెప్పారు.  

సిరిసిల్ల జిల్లా..

జిల్లాలో 1814 ఎకరాల్లో వరి, 423 ఎకరాల్లో మక్క దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వేములవాడ పట్టణంలోని బాలనగర్‌లో కొనుగోలు కేంద్రాన్ని, మున్నూరుకాపు సత్రం వెనుక వరి పొలాలను జడ్పీ అధ్యక్షురాలు అరుణ పరిశీలించారు. జిల్లాలో దాదాపు 3,500ఎకరాల్లో పంట నష్టం వాటిలినట్లు అంచనా వేస్తున్నామని, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వేములవాడ రూరల్‌ మండలం బాలరాజుపల్లి, వెంకటాంపల్లి, నూకలమర్రి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌తో కలిసి ఆమె పరిశీలించారు. తర్వాత శాత్రాజుపల్లి, బాలనగర్‌లో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. వారి వెంట వేములవాడ మున్సిపల్‌ అధ్యక్షురాలు మాధవి, జడ్పీటీసీ యేస వాణి, సీనియర్‌ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, ఎంపీపీ మల్లేశం, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, ఏడీఏ భాస్కర్‌, ఏవో చంద్రన్‌కుమార్‌ ఉన్నారు. రుద్రంగి కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని జడ్పీటీసీ మీనయ్య, తహసిల్దార్‌ మహ్మద్‌ తఫాజుల్‌ హుస్సేన్‌, ఎంపీడీవో శంకర్‌తో కలిసి ఎంపీపీ స్వరూపారాణి, చందుర్తి మండలం నర్సింగాపూర్‌లో దెబ్బతిన్న పంటలను పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మల్లిక్‌తో కలిసి ఎంపీపీ లావణ్య పరిశీలించారు.

రైతులూ అధైర్య పడద్దు: ఎమ్మెల్యే సంజయ్‌  

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు అధైర్యపడద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. రాయికల్‌ మండలం అయోధ్యలో తడిసిన ధాన్యాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మిల్లర్ల ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తెలుపగా వెంటనే పౌర సరఫరాల శాఖ ఏవోకు ఫోన్‌ చేసి నిబంధనలను పాటించని మిల్లర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలన్నారు. సారంగాపూర్‌ తహసిల్దార్‌ కార్యాలయంలో 31మందికి 31,03,596 విలువ గల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 15మంది ఎస్సీలు, 15మంది ఎస్టీలు, ఓ మైనార్టీకి చెక్కులతో పాటు చీరలను బహుమతిగా అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు కోల జమున, లావుడ్య సంధ్య, వైస్‌ ఎంపీపీ సురేందర్‌, జడ్పీటీసీ జాదవ్‌ అశ్విని, తహసిల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో పుల్లయ్య పాల్గొన్నారు. ఇటీవల గాయపడి జగిత్యాలలో ఓంసాయి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తక్కళ్లపెల్లి కారోబార్‌ ప్రసాద్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు. 

అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే సుంకె

ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ భరోసా ఇచ్చారు. చొప్పదండి మండలం తొగురుమామిడిపల్లెలో రైస్‌మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని, బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌, విలాసాగర్‌, వెంకట్రావ్‌పల్లి, రత్నంపేట కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్నాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. బాధిత రైతులెవరూ ఆందోళన చెందవద్దని, తడిసిన, రంగు మారిన ధాన్యాన్నీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని, ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. నర్సింగాపూర్‌, విలాసాగర్‌ గ్రామాల్లో ఇద్దరికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా 72,500 మంజూరు కాగా, సదురు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఆయాచోట్ల ఆయన వెంట కరీంనగర్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత జోగినపల్లి ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీపీ వేణుగోపాల్‌, నాయకుడు కత్తెరపాక కొండయ్య, చొప్పదండి సింగిల్‌విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, గుమ్లాపూర్‌ సర్పంచ్‌ సౌజన్య, తదితరులున్నారు. 

ప్రతి గింజనూ కొంటాం: ఎమ్మెల్యే రసమయి 

అకాల వర్షంతో తడిసిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ హామీ ఇచ్చారు. ఇల్లంతకుంట మండలం రేపాక కొనుగోలు కేంద్రంలో వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం పత్తికుంటపల్లిలో మార్క్‌ఫెడ్‌ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, మాట్లాడారు. రైతులు పండించిన చివరి గింజనూ ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట జడ్పీ వైస్‌ చైర్మన్‌ వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ ఐలయ్య, ఏఎంసీ చైర్మన్‌ వేణురావు, వైస్‌ఎంపీపీ శ్రీనాథ్‌గౌడ్‌, ప్యాక్స్‌ చైర్మన్లు టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తిరుపతి ఉన్నారు. గన్నేరువరం, మైలారం గ్రామాల్లో నిరుపేదలకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చేతుల మీదుగా మాజీ జడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్‌రావు, తోట కోటేశ్వర్‌ నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ అల్వాల కోటి, తదితరులున్నారు.


logo