శనివారం 30 మే 2020
Karimnagar - Apr 28, 2020 , 02:54:47

నిరాడంబురం.. గులాబీ సంబురం

నిరాడంబురం.. గులాబీ సంబురం

  • సాదాసీదాగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు
  • నియోజకవర్గాల్లో జెండాలు ఎగురవేసిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు
  • ముమ్మరంగా సేవా కార్యక్రమాలు
  • పెద్దెత్తున రక్తదాన శిబిరాలు 

తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ వేడుకలను సోమవారం ఆరు జిల్లాల్లో నిరాడంబరంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచనల మేరకు నాయకులు, కార్యకర్తలు ఆర్భాటాలకు పోకుండా సాదాసీదాగా చేసుకున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీ జెండాలను ఎగురవేశారు. లాక్‌డౌన్‌వేళ పేదలను ఆదుకునేందుకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. అలాగే యువసారథి రామన్న పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు పెద్దెత్తున రక్తదానం చేశారు. పలుచోట్ల మాస్కులు కూడా పంపిణీ చేశారు. 

నమస్తే తెలంగాణ యంత్రాంగం : హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంపై మంత్రి గంగుల కమలాకర్‌ గులాబీ జెండాను ఎగురేశారు. తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌పై టీఆర్‌ఎస్‌ జెండాను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఆవిష్కరించారు. నగరంలోని మంత్రి గంగుల మీ సేవా కార్యాలయం ఎదుట మేయర్‌ సునీల్‌రావు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 20 మంది టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆయా చోట్ల జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎంఎఫ్‌సీ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్‌, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణిహరిశంకర్‌, తదితరులు పాల్గొన్నారు. మానకొండూర్‌ నియోజకవర్గంలోని ఎల్‌ఎండీ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ జెండాను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు రక్తదానం చేశారు. మానకొండూర్‌, శంకరపట్నంలో పలువురు పేదలకు ఎమ్మెల్యే రసమయి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. చొప్పదండి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, తదితరులు రక్తదానం చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని సిర్సపల్లిలో సింగిల్‌ విండో చైర్మన్‌ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి తన ధాన్యరాశిపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేశారు. జమ్మికుంటలో పలుచోట్ల జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జడ్పీ అధ్యక్షురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. 

జగిత్యాల జిల్లా..

జగిత్యాల పట్టణం మోతెరోడ్డులోని టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సంజ య్‌ కుమార్‌ గులాబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే, జడ్పీ అధ్యక్షురాలు వసంత, మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి నివాళులర్పించి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. మెట్‌పల్లిలోని పార్టీ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు జెండాను ఎగురవేశారు. ఆయన తనయుడు, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి ప్రభుత్వ దవాఖాన సిబ్బందికి, పోలీస్‌, హోంగార్డులకు, మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు మొత్తం 530 మందికి గాను 500 విలువ చేసే బియ్యం సహా తొమ్మిది రకాల సరుకులను పంపిణీ చేయగా కలెక్టర్‌ రవి హాజరయ్యారు. మెట్‌పల్లి మండలం మారుతీనగర్‌లో జడ్పీ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేశారు. కథలాపూర్‌లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి పాల్గొన్నారు. 

సిరిసిల్ల జిల్లా..

కోనరావుపేట మండలం నిజామాబాద్‌ చాంద్‌నగర్‌లో జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి, పాత బస్టాండ్‌లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. 3వ వార్డులో మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ, తన ఇంటిపై ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ నర్సయ్య పార్టీ జెండాను ఎగురవేశారు. వేడుకల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, గ్రంథాలయ చైర్మన్‌ శంకరయ్య, టీఆర్‌ఎస్‌ వేములవాడ పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు, మున్సిపల్‌ అధ్యక్షురాలు మాధవి, వైస్‌ చైర్మన్‌ మధు రాజేందర్‌, ఏనుగు మనోహర్‌రెడ్డి, ఎల్లారెడ్టిపేటలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ముస్తాబాద్‌లో జడ్పీటీసీ నర్సయ్య, ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ గోపాల్‌రావు, సెస్‌ డైరెక్టర్‌ విజయరామారావు పాల్గొన్నారు. ఎంపీపీ శరత్‌రావు ముస్తాబాద్‌లో రక్తదానం చేశారు. ఇల్లంతకుంటలో జడ్పీ వైస్‌చైర్మన్‌ సిద్ధం వేణు, బోయినపల్లిలో ఎంపీపీ వేణుగోపాల్‌, కొండయ్య, తంగళ్లపల్లిలో సీనియర్‌ నేత చిక్కాల రామారావు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా..

మంథనిలో జడ్పీ అధ్యక్షుడు పుట్ట మధూకర్‌, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఆయాచోట్ల టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మాస్కులను పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజా సేవే పరమావధిగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌, అనేక ఉద్యమాలు, పోరాటాలతో స్వరాష్ర్టాన్ని సాధించిందని, బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్‌ విండో చైర్మన్లు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా..

మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఎగురవేశారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గాదె సత్యంతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైటెక్‌కాలనీలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే అందించారు. తాండూర్‌ మండలం మాదారం టౌన్‌షిప్‌, బెల్లంపల్లిలోని టీబీజీకేఎస్‌ కార్యాలయాల వద్ద జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌తో కలిసి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాండూర్‌ మండలంలోని 250 గిరిజన కుటుంబాలకు ఇంటికి 10 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. ఆ తర్వాత బెజ్జాల గ్రామంలో గిరిజనులతో కలిసి భోజనం చేశారు.

ఆసిఫాబాద్‌ జిల్లా..

జిల్లా కేంద్రంలో జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద, తెలంగాణ తల్లి, జయశంకర్‌ సార్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మంగళవారం నుంచి వారం పాటు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని జడ్పీ అధ్యక్షురాలు తెలిపారు. తిర్యాణి మండలంలోని మంగి, గుండాల, ముల్కల మంద, హస్కూట్‌, కిటగాం, గోపెర గ్రామాల్లో 1000 గిరిజన కుటుంబాలకు జడ్పీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ సరుకులను పంపిణీ చేశారు. కాగజ్‌నగర్‌లో క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ జెండాను సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆవిష్కరించారు. 


logo