బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Apr 26, 2020 , 03:14:48

రైతులకు అండగా సర్కారు

రైతులకు అండగా సర్కారు

  • ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ధాన్యం కొనుగోళ్లు
  • ఆపత్కాలంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి
  • ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలి
  • రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

జగిత్యాల/ధర్మపురి, నమస్తే తెలంగాణ/ జగిత్యాల రూరల్‌ : రైతులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి జగిత్యాల మండలం అనంతారం, గుట్రాజ్‌పల్లిలో కొనుగోలు కేంద్రాలను, ధర్మపురి మండలం నేరెళ్ల, రామయ్యపల్లిలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో సెంటర్లను శనివారం ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పండిన ప్రతి గింజనూ కొంటామని భరోసానిచ్చారు. విపత్కర పరిస్థితుల్లో రైతులను ఇబ్బంది పెట్టవద్దని మిల్లర్లకు సూచించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఉమాశంకర్‌ గార్డెన్‌లో 21వ వార్డుకు చెందిన సుమారు 130 మంది నిరుపేదలకు, ఆటో డ్రైవర్ల యూనియన్‌ సభ్యులకు దాతల ద్వారా నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే సంజయ్‌, మున్సిపల్‌ అధ్యక్షురాలు శ్రావణితో కలిసి పంపిణీ చేశారు. ఆపత్కాలంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని, పేదలను ఆదుకోవాలని కోరారు. కరోనా నివారణ చర్యల కోసం జిల్లా కేంద్రానికి చెందిన ఎర్ర సురేందర్‌, ముక్క గంగాధర్‌ 50వేల చెక్కును మంత్రి ఈశ్వర్‌ చేతుల మీదుగా ఎమ్మెల్యేకు అందజేశారు. నేరెళ్లలో 150 మంది నిరుపేద కుటుంబాలకు 10రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. గ్రామంలోని పలువీధుల్లో పర్యటించి ప్రతి ఒక్కరూ ఇండ్లలోనే ఉండాలని సూచించారు. వీధుల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని మంత్రి స్ప్రే చేశారు. జగిత్యాలలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కమిషనర్‌ జయంత్‌ కుమార్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్‌, ఆటో యూనియన్‌ నాయకుడు శ్రీను, అనంతారం, గుట్రాజ్‌పల్లిలో ఎంపీపీ గంగారాం గౌడ్‌, వైస్‌ ఎంపీపీ రాజు, కల్లెడ పీఏసీఎస్‌ చైర్మన్‌ సందీప్‌రావు, నేరెళ్ల, రామయ్యపల్లిలో డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీ బాధినేని రాజేందర్‌, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరి రాజేశ్‌, తదితరులు పాల్గొన్నారు.


logo