బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Apr 26, 2020 , 03:13:23

సర్కారు వైద్యమే బెటర్‌

సర్కారు వైద్యమే బెటర్‌

  • అందరి చూపూ ప్రభుత్వ దవాఖానలవైపు
  • లాక్‌డౌన్‌తో అంతటా జోరుగా చర్చ
  • కరోనా నేపథ్యంలో అందిస్తున్న సేవలపై సంతృప్తి
  • ప్రైవేట్‌ హాస్పిటళ్ల తీరుపై అసంతృప్తి
  • ఆపత్కాలంలో మూసివేతపై విమర్శలు 
  • వైరస్‌ను సాకుగా చూపడంపై అసహనం  
  • మనసుంటే మార్గముంటుందంటున్న ప్రజలు

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యంపై విస్తృత చర్చ జరుగుతున్నది.నాడు ప్రజలు చిన్నచూపు చూసిన సర్కారు దవాఖానలే ఇప్పుడు ఆదుకోవడంపై ప్రశంసలు కురుస్తుండగా, నిన్నామొన్నటి దాకా కిటకిటలాడిన ప్రైవేట్‌ హాస్పిటళ్లు ఈ ఆపత్కాలంలో మూతపడడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మెజార్టీ చోట్ల ఓపీ సైతం చూడకపోవడం, ఏళ్ల తరబడి వచ్చే రెగ్యులర్‌ పేషంట్లకు ప్రత్యామ్నాయం చూపకపోవడం, కనీసం ఫోన్‌ సేవలూ అందుబాటులోకి తేకపోవడంపై అసహనం వ్యక్తమవుతున్నది. అక్కడక్కడా కొన్ని తెరిచి ఉంచినా అవి పేరుకేనన్న అభిప్రాయాలు వస్తున్నాయి. మనసుంటే మార్గముంటదన్నట్లు సేవలందించడానికి ఎన్నో మార్గాలున్నా, మహమ్మారిని సాకుగా చూపడం సరికాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నాచితకా వ్యాధి నుంచి మొదలు.. కరోనా మహమ్మారి వరకు సర్కారు వైద్యులే సవాలుగా తీసుకొని.. రోగులకు విశేష సేవలందిస్తున్న తీరుపై ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

- కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కరీంనగర్‌హెల్త్‌ 


మార్గాలు అనేకం.. కనిపించని సేవాభావం?

ఐఎంఏ, అప్నా లెక్కల ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో 1150కి పైగా ప్రైవేట్‌ దవాఖానలున్నాయి. ఒక అంచనా మేరకు గతంలో రోజుకు మూడు నుంచి ఐదు వేల మంది వివిధ ప్రైవేట్‌ వైద్యశాలల్లో చూపించుకునేవారు. సీజన్లలో మాత్రం ఈ సంఖ్య రెట్టింపు ఉండేది. దక్షిణ భారత దేశంలోనే అత్యధిక మందుల విక్రయాలు ఉమ్మడి జిల్లాలోనే జరుగుతున్నట్లుగా గతంలో అనేక సర్వేల్లో తేలింది. అంటే ప్రైవేట్‌ వైద్యశాలల తీరు ఎలా ఉందో.. ఇక్కడి రోగులు ఏ విధంగా మందులు వాడుతున్నారో.. మనం అర్థం చేసుకోవచ్చు. గతాన్ని పక్కన పెడితే.. కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ దవాఖానలు, వైద్యులు అందించిన సేవలు ఏమిటి? ఏళ్ల తరబడిగా ఒకే వైద్యశాలను నమ్ముకొన్న పేషంట్లకైనా సదరు వైద్యులు ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్నారా? ఒకవేళ కరోనా భయముంటే.. వైద్యులు తమ ఫోన్‌ నంబర్లు ఇచ్చి, సదరు పేషంట్లకు వైద్య సలహాలు ఇచ్చారా? అత్యవసమైతే తమకు ఫోన్‌ లేదా వాట్సాప్‌ కాల్‌ చేయవచ్చని ఏ డాక్టర్‌ అయినా వారి దవాఖాన ఎదుట బోర్డులు పెట్టారా? చిన్న చిన్న ఆపరేషన్లు చేస్తేనే మేం విజయం సాధించామని చెప్పుకునే దవాఖానలు.. డాక్టర్లు, ఈ కరోనా సమయంలో ‘మేం సేవకు సిద్ధం. మా సేవలను వినియోగించుకోండి’ అంటూ ఏమైనా ప్రకటనలు జారీ చేశారా? సాధారణంగా ఒక రోగికి ప్రిస్క్రిప్షన్‌ రాసినప్పుడు 10 లేదా 15 రోజులకు మందులు రాస్తారు. అలాంటి పేషంట్ల ప్రిస్క్రిప్షన్లను వాట్సాప్‌ ద్వారా తెప్పించుకొని, వారికి కావాల్సిన మందులను సూచించారా? కనీసం ఆ పేషంట్లతో మాట్లాడేందుకు ఆసక్తి చూపారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ‘నో’ అనే సమాధానమే వినిపిస్తున్నది. కొవిడ్‌-19 భయంతో పేషంట్లను నేరుగా చూసేందుకు విముఖత చూపినా.. పరోక్షంగా సేవలందించడానికి ఎన్నో మార్గాలున్నాయి. వినియోగించుకోవడానికి కావాల్సినంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. అయినా ప్రైవేట్‌ వైద్యులు ఎందుకు తమ సేవలను అందించలేకపోయారు? సేవ చేయడం వల్ల తమకు వచ్చే లాభం ఏమీ లేదనా? లేక ఇష్టం లేకనా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒకరిద్దరు మినహా 90 శాతానికిపైగా వైద్యులు సేవలకు దూరంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. అన్ని జిల్లాల కలెక్టర్లు సైతం సేవలందించడానికి ముందుకు రావాలని వైద్యులకు విజ్ఞప్తి చేసినా పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు ఒకవేళ అత్యవసరమైతే మీ వైద్య శాలలను క్వారంటైన్‌ కోసం వినియోగించుకునేందుకు ఎన్ని బెడ్స్‌ ఉన్నాయో వివరాలు ఇవ్వాలని పదే పదే కోరినా ఆ దిశగా స్పందించ లేదు. ప్రతిమ, చల్మెడ మెడికల్‌ కళాశాలలు మాత్రం అడిగిన దానికంటే ఎక్కువగా బెడ్స్‌ ఇవ్వడానికి ముందుకొచ్చి వాటి ఉదారతను చాటుకున్నాయి. కానీ, జిల్లాల్లోని నర్సింగ్‌హోంలు, ఇతర ప్రముఖ వైద్యశాలలు మాత్రం విముఖత చూపించాయి. ప్రస్తుతం ఏదైనా గ్రామానికి వైద్యులు, లేదా వారి సిబ్బందిని పంపి సర్వేలు చేయవచ్చు.. సేవలు కూడా అందించవచ్చు. కానీ, ఈ మార్గాన్ని సైతం ఎవరూ అనుసరించలేదు. ఇదే విషయంపై కొంత మంది ప్రైవేట్‌ వైద్యులు మాట్లాడుతూ.. రవాణా సౌకర్యం లేదని, రోగులు రావడం లేదని, అందుకు ఓపీలు చూడడం లేదన్న సమాధానాలు చెబుతున్నారు. అయితే ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సేవలందిచ్చవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా పట్టించుకునే వారు లేరు. 

అడుగడుగునా అంకిత భావం.. 

కరోనా నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలోని వైద్యుల నుంచి పీహెచ్‌సీల్లో పనిచేసే నర్సుల వరకు ప్రతి ఒక్కరిలోనూ అంకిత భావం కనిపిస్తున్నది. మచ్చుకు చూస్తే.. ఉమ్మడి జిల్లా మొత్తం మీద నెలకు 4వేల ప్రసవాలు జరగుతున్నాయి. ఇందులో కేసీఆర్‌ కిట్‌ అమల్లోకి వచ్చిన తర్వాత 70 శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే అవుతున్నాయి. అయితే మిగిలిన 30 శాతం మందికి కూడా చికిత్స అందించకుండా పలు ప్రైవేట్‌ దవాఖానలు కరోనాను సాకుగా చూపాయి. దీంతో ప్రభుత్వ వైద్యశాలలపై భారం మరింత పెరిగింది. అయినా ఎక్కడా వెనక్కితగ్గకుండా పని చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండి, వచ్చిన రోగులకు సాధ్యమైన మేరకు సేవలందిస్తున్నారు. అంతేకాదు, గ్రామాల్లో నర్సులు ఇంటింటికీ తిరిగి సర్వేలు చేసి, వృద్ధులు, చిన్న పిల్లలకు కావాల్సిన సేవలందిస్తున్నారు. కరోనా పరిస్థితులను అర్థం చేసుకున్న కలెక్టర్లు.. పలు జిల్లాల్లో టెలీ మెడిసిన్‌ కేంద్రాలను వినియోగంలోకి తెచ్చారు. మానసిక రుగ్మతల చికిత్స కోసం ‘భరోసా’ కేంద్రాన్ని సైతం ప్రారంభించారు. టోల్‌ ఫ్రీనంబర్లు ఇచ్చారు. ఇలా వైద్య పరంగా అనేక ఆలోచలు చేసి వినూత్న పద్ధతుల్లో సేవలందిస్తున్నారు. వీటికి విశేష స్పందన ఉంది. అయితే ఇలాంటి విధానాలను ప్రైవేట్‌ దవాఖానలు ఎందుకు అమలు చేయలేక పోయాయన్న విమర్శలు వస్తున్నాయి. నిజంగా ఈ తరహా టెలీ మెడిసిన్‌ సెంటర్లు పెట్టే సామర్థ్యం లేకనా..? లేక పెట్టడం వల్ల తమకు ఏమీ ప్రయోజనం లేదనా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రైవేట్‌ వైద్యులు, వారి అసోసియేషన్లు ఏం చేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ముందుకు వస్తేనే ప్రజలకు మేలు.. 

మనసు ఉంటే మార్గం ఉంటుంది. ప్రైవేట్‌ వైద్యులు, వైద్యశాలల యాజమాన్యాలు సేవ చేయాలనుకుంటే దారులెన్నో ఉన్నాయి. ప్రస్తుతం ముందుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. టెలీ మెడిసిన్‌ లాంటి సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తే.. కష్ట కాలంలో రోగులకు అండగా నిలిచినట్లవుతుంది. సిబ్బందిని పల్లెలకు పంపించి, పరీక్షలు చేసి, చిన్న చిన్న వ్యాధులకు చికిత్స చేయవచ్చు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రతి కుటుంబం ఆర్థిక ప్రభావానికి లోనవుతున్నది. ఈ నేపథ్యంలో మానవీయ కోణంలో ఆలోచన చేసి.. ప్రస్తుతం ఉన్న ఓపీ ఫీజును కొంతైనా తగ్గించాల్సిన అవసరం ఉందన్న సూచనలు వస్తున్నాయి. ఇవేకాదు, స్కానింగ్‌లు, ఇతరత్రా పరీక్షలకు కొన్నాళ్లపాటు.. ప్రస్తుతం వడ్డిస్తున్న చార్జీలను కొంతైనా తగ్గిస్తే రోగులకు సహకరించిన వారవుతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఇటు ఐఎంఏ, అప్నా లాంటి అసోసియేషన్‌ నేతలు చొరవచూపితే.. ప్రజలకు మేలవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా సమయం మించి పోలేదని, ఇప్పటికైనా వైద్యులు సేవలందించడానికి ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రైవేట్ల జూత్తలేరు..

షుగర్‌, మోకాళ్ల నొప్పుల గోలీలు నాలుగేండ్ల సంది మింగుతున్న. ప్రైవేట్‌ దవాఖాన్ల ప్రతి నెలా పరీచ్చలు జేపిచ్చుకొని మందులు వాడేదాన్ని. కరోనా వైరస్‌ వస్తున్నదని గిప్పుడు సిరిసిల్లలున్న ప్రైవేటు దవాఖానోళ్లు జూత్తలేరు. పోతే తిప్పిపంపిన్రు. గౌర్మెంట్‌ దవాఖానకు వోయి సూపెట్టుకున్న. అక్కడిచ్చిన మందులే ఏసుకుంటున్న. గీ టైంల సర్కారు దవాఖాన లేకపోయుంటే పరిస్థితి ఏమయ్యేదో. 

- పరకాల ఉమ, పెద్దబజార్‌ (సిరిసిల్ల టౌన్‌)

సర్కారు గోలీలు వాడుతున్న.. 

నాకు శానేండ్ల సంది బీపీ, శెక్కర బీమారి, కీళ్ల నొప్పులున్నయ్‌. నెల నెలా ప్రైవేట్‌ దవాఖాన్ల చూపెట్టుకుని డాక్టరిచ్చే మందులు ఏసుకునేదాన్ని. కరోనా వైరస్‌ అని ప్రైవేటు దవాఖానల్లో ఇప్పడు జూత్తలేరు. పోయిన్నెల తెచ్చిన మందులైపోయినయ్‌. రెండ్రోజుల కింద సిరిసిల్ల సర్కారు దవాఖాన్లకు పోతె డాక్టర్‌ సారు చూసి మందులిచ్చిండు. ఆపద కాలంల సర్కారు దవాఖానే దిక్కయింది.

- మల్యాల భాగ్యలక్ష్మి, రెడ్డివాడ (సిరిసిల్ల టౌన్‌)

ఓపీ తగ్గించుకున్నం.. 

లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి మా హాస్పిటల్‌లో ఎప్పటిలాగే పని చేస్తున్నం. కాకపోతే ఓపీ తగ్గించుకున్నం. రోజుకు పది మందికి మించి ఓపీ చూడ లేక పోతున్నం. అత్యవసరమైన శస్త్ర చికిత్సలు చేస్తున్నం. రిసెప్షన్‌, ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్‌లో ఉండే సిబ్బందికి అవసరమైన మాస్కులు, పీపీఈలు, క్యాప్‌ కవర్లు అందిస్తున్నం. సిబ్బందితో రోజుకు 6 గంటలు మాత్రమే పనిచేయిస్తున్నం. పేషంట్లతో ఒక్కరిని మాత్రమే అనుమతిస్తున్నం. ముందుగానే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకుంటున్నం. గోదావరిఖని, మంథనిలోని మా బ్రాంచ్‌ల ద్వారా ఆన్‌లైన్‌ సేవలు కూడా అందిస్తున్నం.  

- బంగారి స్వామి (రెనే ప్రైవేట్‌ దవాఖాన వ్యవస్థాపకుడు)

వెనకడుగు వేయకుండా పనిచేస్తున్నం.. 

ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది ఎప్పటిలాగే సేవలు అందిస్తున్నరు. కరోనా క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వార్డుల్లో కూడా మా వైద్యులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నరు. రాష్ట్రంలో ఎక్కడా కేసులు లేని సమయంలో మన దగ్గర కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనయ్‌. అయినా వెనకడుగు వేయకుండా సేవలందించినం. కరీంనగర్‌ ప్రధాన ప్రభుత్వ దవాఖానలో గతంలో 600 నుంచి 700 మందికి ఓపీ చూసేవాళ్లం. కనీసం 300 మంది చికిత్స పొందేటోళ్లు. ఇపుడు లాక్‌డౌన్‌తో ఓపీ కాస్త తగ్గింది. దీనికి బదులు కరోనా క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వార్డుల్లో సిబ్బంది ఎక్కువగా పనిచేస్తున్నరు. ఇప్పుడు అక్కడ కూడా తీవ్రత తగ్గడంలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది కృషి, విధి నిర్వహణలో ఉన్న చిత్తశుద్ధే కారణం. 

- డాక్టర్‌ అజయ్‌కుమార్‌, కరీంనగర్‌ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌

దండేపల్లి నుంచి వచ్చినం.. 

మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి. లాక్‌డౌన్‌కు ముందే నా కాలు విరిగింది. అప్పుడు ఆపరేషన్‌ చేసిన్రు. మళ్లీ పరీక్షలకు కరీంనగర్‌కు బైక్‌పైన వచ్చినం. అక్కడ ఇంత మంచిగ చూడరు. అందుకే ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నం. లాక్‌డౌన్‌లో వైద్య సేవలు పొందడం చాలా కష్టమని పించింది. అంత దూరం నుంచి ఇక్కడికి రావడం ఇబ్బంది అయింది. ఇప్పట్లో బస్సులు నడిచే పరిస్థితి లేనందున తప్పనిసరి పరిస్థితుల్లో రావల్సి వచ్చింది.

- కే అరుణ, దండేపల్లి

మేం వీడియోకాల్‌తో సేవలందిస్తున్నం..

లాక్‌డౌన్‌తో పల్లెల నుంచి రోగులు రావడం తగ్గింది. అత్యవసర కేసులైతే 24గంటల పాటు సేవలందిస్తున్నం. ప్రసవాలు చేస్తున్నం. కొన్ని శస్త్ర చికిత్సలు మాత్రం నిలిపివేసినం. భవిష్యత్తులో రోగులకు ఇబ్బందులు రావద్దనే ఈ నిర్ణయం తీసుకున్నం. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నం. గ్రామీణ ప్రాంతాల వారు ఫోన్‌లోనే సమస్య చెబుతున్నరు. వారికి అవసరమైన మందులను సూచిస్తున్నం. మేం వీడియో కాల్స్‌లో పిల్లలను చూసి వైద్య సాయం చేస్తున్నం. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వైద్యానికి ప్రాధాన్యత పెరిగింది. అయితే ప్రైవేట్‌ వైద్యం విఫలమైందనడం సరికాదు. 

-జీ వేణుగోపాల్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణుడు, ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షుడు

సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగింది.. 

తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగింది. ఇప్పటి వరకు ప్రసవాల్లో ఎంత దోపిడీ జరిగిందో అందరికీ తెలుసు. ప్రభుత్వ వైద్యశాలల్లో డెలివరీల వల్ల ప్రజలకు పెద్ద బరువు తగ్గింది. ప్రైవేట్‌ వైద్యం పూర్తిగా వ్యాపారమైంది. అత్యవసర సమయాల్లో అధిక ఫీజులు గుంజి, ప్రజలను భయపెట్టడంలో ప్రైవేట్‌ వైద్యులు సిద్ధహస్తులు. వైద్యసేవల విషయంలో సందేహం లేదు గానీ, రోగికి ఉన్న దాని కంటే ఎక్కువ చెప్పి, వీలైనంత డబ్బు గుంజుతారన్న భయం మాత్రం అందరికీ ఉన్నది. కీలకమైన అన్ని వైద్య విభాగాలను ప్రభుత్వ దవాఖానల్లోనే అందుబాటులో ఉండేలా చూడాలి. 

-వంగళ దేవ కిషన్‌logo