శనివారం 06 జూన్ 2020
Karimnagar - Apr 25, 2020 , 03:09:12

రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

  • అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈశ్వర్‌

ధర్మపురి,నమస్తేతెలంగాణ : ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులను రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కోరారు. శుక్రవా రం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి జగిత్యాల కలెక్టర్‌ రవి, జగిత్యాల, కో రుట్ల, చొప్పదండి, వేములవాడ ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్‌, విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్‌, రమేశ్‌బాబు, జడ్పీ అధ్యక్షురాలు వసంత, అదనపు కలెక్టర్‌ రాజేశం, డీఏవో, డీఎస్‌వో, పీఏసీఎస్‌ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మొత్తం 50 మందితో ఒకేసారి దాదాపు గంటసేపు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సీజన్‌లో మెడవిరుపు, అగ్గితెగులుతో ధాన్యం నాణ్యత తగ్గిందని, 1153, 1156, బతుకమ్మ రకం విత్తనాలు వేయడం వల్ల గట్టితప్ప, తాలు ఎక్కువగా వచ్చిందని చెప్పారు. ఇటువంటి ధాన్యాన్ని కూడా కొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు, రైస్‌మిల్లర్లకు నచ్చజెప్పి సకాలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయించాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో మిల్లర్లు వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో కొనుగోళ్లు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతోనే పంట దిగుబడులు పెరిగాయన్నారు. కొనుగోళ్ల కోసం క్లిష్ట పరిస్థితుల్లో కూడా 30వేల కోట్లు సమకూర్చడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. రైతులు కూడా ధాన్యంలో తేమ, తాలు, తప్ప విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని కోరారు. ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశామన్నారు. 

విపత్కర పరిస్థితుల్లో చిల్లర రాజకీయాలు తగవు

తెలంగాణ సర్కారు ఓ వైపు కరోనా పరిస్థితులను అధిగమిస్తూనే మరో వైపు రైతు సంక్షేమం కోసం ఆలోచిస్తూ వారికి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు తలాతోక లేకుండా, అర్థరహితంగా మాట్లాడడం సరికాదని మంత్రి హితవు పలికారు. ఇంత విపత్కర సమయంలో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడడం, ఎంపీ బండి సంజయ్‌ దీక్షల పేరుతో రైతులను తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. 


logo