గురువారం 28 మే 2020
Karimnagar - Apr 25, 2020 , 03:08:50

దేశంలోనే ఆదర్శంగా కొనుగోళ్లు

దేశంలోనే ఆదర్శంగా కొనుగోళ్లు

  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నా ముఖ్యమంత్రి చొరవ  
  • రైతులు దైవంగా భావించే పంటలను దహనం చేసుకోవద్దు 
  • పనికి రాని ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దు 
  • ఎంపీ సంజయ్‌కి అవగాహన లేదు.. దీక్షతో ఒరిగేదేమీలేదు
  • రైతులూ ఆందోళన వద్దు.. ప్రభుత్వమే ప్రతి గింజా కొంటుంది
  • కరోనా ఆర్థిక సాయం అందని వారికి సోమవారం నుంచి పంపిణీ
  • రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్రం ఆర్థిక పరంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో పండించిన ప్రతి గింజనూ కొంటున్నామని, దేశంలో ఆదర్శంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల స్పష్టం చేశారు. తాలు పేరిట మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని సిరిసిల్లలో ఒకరిద్దరు రైతులు ధాన్యం కుప్పలు దహనం చేసుకోవడం విచారకరమని, దైవంగా భావించే పంటలను దహనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రం కూడా పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనేందుకు ముందుకు రాలేదని, మన రాష్ట్రంలో సీఎం చొరవతో ప్రతి గింజనూ కొంటామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత ధాన్యం ఎన్నడూ రాలేదని, ఇంత పెద్ద సంఖ్యలో కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేయలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6,524 కేంద్రాలు ఏర్పాటు చేసి, 70 నుంచి 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు 5,187 కేంద్రాలు ప్రారంభించి 1,67,150 మంది రైతుల నుంచి 12 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశామని వివరించారు. ఇప్పటికే 52 శాతం కోతలు పూర్తయ్యాయని, ఇంకా కోతలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో చిక్కుకు పోయిన వలస కూలీలను కొనుగోళ్లకు వినియోగించుకునే ఆలోచనలో ఉన్నామని, వీరందరి ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నామని తెలిపారు.

ఉపవాస దీక్షతో ఒరిగేదేమీలేదు..

కొనుగోళ్లపై కొందరు నాయకులు సెంటర్ల వద్ద రాజకీయ దుకాణాలు తెరిచి రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఇప్పుడు తాలు పేరిట మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. రైతులు సాగు చేసే పంటలకు నీళ్లెక్కడి నుంచి వస్తున్నాయి? విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? పెట్టుబడులు ఎవరిస్తున్నారు? అనే విషయాలను ఆయన మరిచిపోతున్నారన్నారు. పాడి పంటలను దైవంగా భావించే రైతులు తమ ధాన్యాన్ని దహనం చేసుకుంటే వారిని వారించి, కష్టాన్ని తెలుసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత ఎంపీగా ఆయనకు లేదా? అని నిలదీశారు. పక్క రాష్ర్టాల్లో ఒక్కో రైతు నుంచి కేవలం 15 క్వింటాళ్లు మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి మిగతా ధాన్యాన్ని 800, వెయ్యికి మాత్రమే కొంటున్నారనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. కొనుగోళ్లపై ఆయనకు అసలు అవగాహనే లేదని దుయ్యబట్టారు. కేంద్రం ఆధీనంలో ఉండే ఎఫ్‌సీఐ నిర్ణయించిన కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి తిరిగి అదే సంస్థకు అప్పగిస్తుందని, ఈ సంస్థనే ఎఫ్‌ఏక్యూ నిబంధనలు విధిస్తుందన్నారు. తాలు, తేమ, పెల్ల వంటి వ్యర్థాల శాతాన్ని నిర్ణయించేది ఎఫ్‌సీఐ అని, ఇది కేంద్రం చేతిలోనే ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. ఎంపీ హైదరాబాద్‌లో ఒక రోజు ఉపవాస దీక్ష చేస్తే లాభమేంటని, అదే ఢిల్లీలోని ఎఫ్‌సీఐ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని దెప్పిపొడిచారు. కొనుగోళ్లపై రైతుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. రాష్ట్ర రైతుల మీద నిజంగానే ప్రేమ ఉంటే బీహార్‌ నుంచి హమాలీలను తెప్పించాలని, కేంద్రం చేతిలో ఉన్న గన్నీ బ్యాగులు తెప్పించాలని ఎంపీ సంజయ్‌కి సూచించారు. గన్నీ సంచుల కోసం అనేక సార్లు కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్ను స్వయంగా కోరినా స్పందించడం లేదని, ఆ గన్నీ బ్యాగులైనా తెప్పిస్తే సగం సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. ఇలాంటి సమస్యలపై కాకుండా తాలు పేరిట రాజకీయాలు చేయడం ఎందుకో అర్థం కావడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు.  దేశంలో అనేక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు కనీస మద్దతు ధరతో కొనుగోళ్లు చేయడం లేదని, ఉత్తర ప్రదేశ్‌ విషయాన్నే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చని చెప్పిన మంత్రి, అక్కడి రైతుల గురించి ఎంపీ దీక్ష చేపడతారా? అని ప్రశ్నించారు. 

ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దు..

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో చూస్తే 342 కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించి, ఇప్పటి వరకు 334 కేంద్రాలు ప్రారంభించి 35,710 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసినపుడు ఎక్కడో ఒకట్రెండు చోట్ల సమస్యలు రావడం సాధారణమని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో అగ్గితెగులు, మెడవిరుపు వచ్చి వరిలో కొంత శాతం తాలు వచ్చిందని, దీని వల్ల మిల్లర్లు ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవమని, అంత మాత్రాన రాజకీయాలు చేయడం ఎంత వరకు సబబని మంత్రి ప్రశ్నించారు. అసలు మిల్లర్లకు, రైతులకు మధ్య వారధిగా ప్రభు త్వం ఉంటుందని, మిల్లర్లకు రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని, అవగాహన లేకుండా మాట్లాడి పరువు తీసుకోవద్దని ఎంపీ సంజయ్‌కి హితవు పలికారు. రైతుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తప్ప ఎవరూ పరిష్కరించ లేరని, రైతులు ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పంజాబ్‌లో 4 వేల ప్యాడీ క్లీనర్లకు ఆర్డర్‌ ఇచ్చామని, త్వరలో అవి పీపీసీ కేంద్రాలకు అందుతాయన్నారు. 

సోమవారం నుంచి అర్హులందరికీ కరోనా సాయం..

కరోనా ఆర్థిక సహాయం అందని కార్డుదారులు ఆందోళన చెందాల్సిన పని లేదని, వారికి ఆన్‌లైన్‌, పోస్టల్‌ లేదా పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరీంనగర్‌ జిల్లాలో బ్యాంకు ఖాతాల్లో జమకాని వారు 9,812 మంది ఉన్నట్లు గుర్తించామని, వీరికి వచ్చే సోమవారం నుంచి 1,500 నగదు అందజేస్తామన్నారు. కరీంనగర్‌లో ప్రతి రోజూ నీటి సరఫరా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశామని, ఈ నెల మొదటి వారంలోనే ట్రయల్‌ రన్‌ చేయాల్సి ఉండగా కరోనా ప్రభావంతో వాయిదా వేశామని చెప్పారు. జిల్లాలో వచ్చే నెల 7 వరకు కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో నగర మేయర్‌ వై సునీల్‌ రావు, కరీంనగర్‌ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య ఉన్నారు.

రైతులూ ఆందోళన వద్దు

కరీంనగర్‌ రూరల్‌: యాసంగిలో పండిన చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హమాలీలు మిల్లులోకి వచ్చేందుకు పోలీసుల నుంచి అడ్డంకులు లేకుండా చూడాలని స్థానిక ‘చాణిక్య’ రైస్‌ మిల్లు యజమాని గుండారావు విన్నవించగా, మంత్రి స్పందించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైస్‌ మిల్లులు, కొనుగోలు కేంద్రాల్లో పని చేసే హమాలీలకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, సీపీకి సూచించినట్లు తెలిపారు. ఇదే సందర్భంలో గ్రామానికి చెందిన రైతు మల్లన్నతో నాటి రోజులను గుర్తు చేశారు. ‘ఓ మల్లన్నా.. గీ కాలంలో ఎప్పుడైన గీ మల్లన్న చెరువులో గిన్ని నీళ్లు ఉన్నాయే.. మన తెలంగాణ వచ్చిన తర్వాత చూడు ఎన్ని నీళ్లున్నాయో’ అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. ఆ తర్వాత గ్రామస్తులకు తడి, పొడి చెత్తబుట్టలు పంపిణీ చేశారు. ఇక్కడ అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురుమల్ల లలిత, సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌, విండో చైర్మన్లు పెండ్యా ల శ్యాంసుందర్‌ రెడ్డి, బల్మూరి ఆనందరావు ఉన్నారు.


logo