మంగళవారం 26 మే 2020
Karimnagar - Apr 25, 2020 , 03:08:01

నేనున్నా.. మీకోసమే వచ్చా..

నేనున్నా.. మీకోసమే వచ్చా..

  • అధైర్యపడద్దు.. అన్నివిధాలా అండగా ఉంటా.. 
  • బద్దెనపల్లిలో హోంగార్డు దేవయ్య కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ భరోసా
  • వ్యక్తిగతంగా 5లక్షల ఆర్థిక సాయం 
  • కూతురుకు ఉద్యోగం.. ఇల్లు కట్టిస్తామని హామీ
  • చందుర్తిలో రైతు కుటుంబానికీ అభయం
  • 5లక్షల రైతుబీమా ప్రొసీడింగ్‌ పత్రాలు, 25వేల చెక్కు అందజేత
  • కోనరావుపేట, వీర్నపల్లిలో అకాలవర్షంతో దెబ్బతిన్న పంటల పరిశీలన 
  • నష్టపోయిన రైతులకు ధైర్యం

“అధైర్యపడద్దు. నేనున్నా.. అన్నివిధాలా మీకు అండగా ఉంట. మీకోసమే.. మిమ్ముల కలవాలనే ఇక్కడకు వచ్చిన” అంటూ ఆప్తులను కోల్పోయిన బాధితులకు.. వర్షంతో నష్టపోయిన రైతులకు మంత్రి కేటీఆర్‌ భరోసానిచ్చారు. శుక్రవారం స్వయంగా వారిని కలిసి అక్కున చేర్చుకున్నారు. ‘నేనున్నా’నంటూ ధైర్యం చెప్పారు. పలువురికి ఆర్థిక సాయం అందజేసి పెద్దమనుసును చాటుకున్నారు. 

సిరిసిల్ల. నమస్తే తెలంగాణ/ సిరిసిల్ల రూరల్‌/ చందుర్తి/కోనరావుపేట/వీర్నపల్లి: రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి ఔదార్యం చాటుకున్నారు. లాక్‌డౌన్‌ అమలులో భాగంగా విధులను నిర్వర్తిస్తూ వడదెబ్బతో హఠాన్మరణం చెందిన తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన హోంగార్డు సిలువేరి దేవయ్య కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నారు. శుక్రవారం స్వయంగా దేవయ్య ఇంటికి వెళ్లి, మొదట చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేవయ్య భార్యాపిల్లలను పరామర్శించారు. ‘నేనున్నా’నంటూ ధైర్యం చెప్పారు.  వ్యక్తిగతంగా 5లక్షల ఆర్థిక సాయాన్ని అందించి, పెద్ద మనుసును చాటుకున్నారు. బీఈడీ చదివిన దేవయ్య కూతురు నవ్యకు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇవ్వడమేగాక, ఆ బాధత్యను అక్కడే ఉన్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు అప్పగించారు. ఇల్లు కూడా స్వయంగా కట్టిస్తామని, పింఛన్‌తోపాటు వైద్యం, ఇతర సహాయ సహకారాలు అందేలా చూస్తామని చెప్పారు. 

కంటికిరెప్పలా కాపాడుకుంటాం..

అనంతరం బద్దెనపల్లిలోని ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్‌ సందర్శించారు. రైతులు, సెంటర్‌ నిర్వాహకులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైస్‌మిల్లర్లతో మాట్లాడి, ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమస్యలుంటే చెప్పుకోవాలని, కష్టపడి పండించిన ధాన్యాన్ని తగలబెట్టుకోవడం సబబు కాదని సూచించారు. అక్కడి నుంచి సిరిసిల్ల క్యాంపు కార్యాలయానికి చేరుకుని అభివృద్ధి పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై సమీక్షించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కోనరావుపేట మండలం నాగారంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా రైతు కొమ్ము సుశీల ‘పొలంలో గింజ లేకుండా రాలిపోయింది సారూ’ అంటూ రోదించగా, చలించిపోయిన మంత్రి “అధైర్య పడద్దు. మీ బాధలు తెలుసుకునేందుకు వచ్చానమ్మ. నీకు తగిన న్యాయం చేస్త” అంటూ ఓదార్చారు. వ్యవసాయాధికారులతో మాట్లాడి నష్టపోయిన పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మిల్లు యజమానులతో త్వరలో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, వడ్లలో వచ్చే పొల్లుతో రైతులు నష్టపోకుండా చూస్తామన్నారు. రాలిన వడ్లకు నష్టపరిహారం ఇవ్వడంతోపాటు కొనుగోళ్లలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా కల్పించారు. అక్కడి నుంచి మంత్రి చందుర్తికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన రైతు పల్లా శ్రీనివాస్‌ ఈనెల 19న పిడుగుపడి మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. శ్రీనివాస్‌ కుటుంబానికి 5లక్షల రైతుబీమా ప్రొసీడింగ్‌ పత్రాలను అందించారు. కుటుంబపరంగా ఏవైనా ఇబ్బందులుంటే చెప్పాలని, వాటిని పరిష్కరిస్తానని హామీనిచ్చారు. వ్యవసాయ సిబ్బంది తమ వంతుగా మృతుడి కుటుంబానికి 25 వేల చెక్కును అందించారు. అక్కడి నుంచి వీర్నపల్లి మండలంలోని అడవిపదిరకు చేరుకుని, అకాల వర్షానికి దెబ్బతిన్న ఎడ్ల దేవవ్వ పొలాన్ని పరిశీలించారు. అండగా ఉంటామని, పరిహారం అందిస్తామని హామీనిచ్చారు. ఆయన వెంట కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే, అదనపు కలెక్టర్‌ అంజయ్య, జడ్పీ అధ్యక్షురాలు అరుణ, సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో శ్రీనివాసరావు, సెస్‌ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, ఎంపీపీలు మానస, బైరగోని లావణ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, సింగిల్‌విండో చైర్మన్‌ దేవదాస్‌, జవహర్‌రెడ్డి, ఎంపీటీసీ ప్రసూన, నర్సయ్య, చిరంజీవి, ప్రేమ్‌, వెంకటరాములు, పోచయ్య, తదితరులున్నారు.


logo