బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Apr 23, 2020 , 03:17:59

పేదలకు అండగా గంగుల

పేదలకు అండగా గంగుల

  • దాతల నుంచి భారీగా విరాళాలు సేకరణ 
  • నేడు మరో 2,500 మందికి నిత్యావసరాల పంపిణీ 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కార్పొరేషన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఔదార్యం చాటుతున్నారు. తను సాయం చేయడమే కాకుండా, దాతల సహకారంతో పేదలకు బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ చల్మెడ రాజేశ్వర్‌ రావు సమకూర్చిన భారీ విరాళంతో నగరంలో 3 వేల మంది ఆటో డ్రైవర్లు, పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి సరుకులు పంపిణీ చేశారు. మంత్రి పిలుపునందుకుని దాతలు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకువస్తున్నారు. తాజాగా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు చిట్టిమల్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 12.50 లక్షలు, తీగలగుట్టపల్లికి చెందిన నూతి చందు, నూతి వెంకటేశ్‌ అందించిన మరో 2 లక్షలు కలిపి మొత్తం 14.50 లక్షలతో నగరంలోని పాన్‌ షాపులు, కార్పెంటర్లు, టూవీలర్‌ మెకానిక్‌లు, నాయీ బ్రాహ్మణ వర్గానికి చెందిన 2,500 కుటుంబాలకు సాయం చేయాలని మంత్రి నిర్ణయించారు. గురువారం నుంచి ఒక్కో కుటుంబానికి 500 నగదుతో పాటు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కార్పొరేటర్‌ వీ రాజేందర్‌రావు, నాయకులు శ్రీనివాస్‌, పెద్ది రమేశ్‌, గౌరిశెట్టి మునీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

దాతలు ముందుకు రావాలి.. 

కరోనాను నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ పాటిస్తున్నాం. దీంతో ఎందరో పేదలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. వారికి కొంతైనా సాయం అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అనేక మంది దాతల సాయంతో నగరంలోని నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాం. మరికొంత దాతల ఆర్థిక సహాయంతో గురువారం మరికొన్ని వర్గాలకు నిత్యావసరాలు, నగదు అందించాలని నిర్ణయించాం. ఇంకా మరింత మంది దాతలు ముందుకురావాలి. విరివిగా విరాళాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలి. ఎంతో ఉదారతతో, సహృదయంతో ముందుకు వస్తున్న దాతలకు నా కృతజ్ఞతలు.  

- మంత్రి గంగుల కమలాకర్‌ logo