సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Apr 23, 2020 , 03:16:37

అర్హులందరికీ రూ. 1500

అర్హులందరికీ రూ. 1500

  • ఖాతాలు అనుసంధానం కాని తెల్ల రేషన్‌కార్డుదారులకు నేరుగా అందజేత
  • త్వరలోనే పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు 
  • ఇప్పటికే వివరాల సేకరణ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెల్ల రేషన్‌ కార్డు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 1500 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. ఇప్పటికే ఆధార్‌ నంబర్‌ అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో నగదు పడుతుండగా, ఖాతాల్లేని వారికి పోస్టాఫీసుల్లో చెల్లించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.

- కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ నెల రోజులుగా కొనసాగుతున్నది. దీంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. మొదటగా వలస కూలీలకు బియ్యం, నగదు అందించింది. ఆ తర్వాత తెల్ల రేషన్‌ కార్డుదారులకు సాయం చేసింది. కార్డుదారుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఇవ్వడంతోపాటు పది రోజుల నుంచి ఒక్కో కార్డుకు 1500 చొప్పున అందిస్తున్నది. ఆధార్‌ నంబర్‌తో అనుసంధానమైన ఖాతాల్లో మాత్ర మే నగదును జమ చేస్తున్నది. అయితే కొందరికి ఖాతాల్లేక పోవడం, మరికొందరికి అకౌంట్లు ఉన్నా ఆధార్‌ అనుసంధానం కాకపోవడంతో డబ్బులు పడడం లేదు. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ సాయం అందించేందుకు రాష్ట్ర సర్కారు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. ఖాతాలు లేని వారికి, మూడు నెలలుగా లావాదేవీలు జరగని ఖాతాలున్న వారికి నేరుగా పోస్టాఫీసుల ద్వారా నగదు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 

పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు..

పోస్టాఫీసుల ద్వారా ఇప్పటికే ఉపాధి కూలీలకు చెల్లింపులు, కొన్ని ఆసరా పింఛన్ల పంపిణీ వంటివి జరుగుతున్నాయి. అదే విధంగా ఇప్పుడు కరోనా ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అందుకు సరిపడా పాయింట్‌ ఆఫ్‌ టర్మినల్‌ డివైజ్‌ (పీవోటీడీ) మిషన్లను సమకూర్చుకుంటున్నారు. అవి అన్ని పోస్టాఫీసులకు అందుబాటులోకి రాగానే పంపిణీ ప్రారంభిస్తామని తపాలా అధికారులు చెబుతున్నారు. కాగా పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం సంబంధిత శాఖ వెబ్‌సైట్‌లో అర్హుల వివరాలను సేకరించి పెట్టారు. నగదు జమకాని కార్డుదారులు తమ రేషన్‌కార్డు నంబర్‌తో ఆ సైట్‌లో పరిశీలిస్తే పోస్టాఫీసుకు బదిలీ చేసినట్లు చూపుతుందని చెబుతున్నారు. అన్ని మండలాల తాసిల్దార్ల కార్యాలయాలకు కూడా వారి వివరాలు పంపినట్లు కరీంనగర్‌ డీఎస్‌వో సురేశ్‌రెడ్డి తెలిపారు. పోస్టాఫీసులకు నగదు కోసం వచ్చే లబ్ధిదారులు తమ వెంట రేషన్‌ కార్డు నంబరుతోపాటు ఆధార్‌ కార్డు తీసుకుని మాత్రమే వెళ్లాలని వివరించారు.  

కొద్ది రోజుల్లోనే పంపిణీ చేస్తాం.. 

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఖాతాలు లేని వారి వివరాలు పూర్తి స్థాయిలో అందాల్సి ఉంది. పంపిణీకి అవసరమైన పీఓటీడీ మిషన్లు రావాల్సి ఉంది. మరో వారంలో లేదంటే అంతకు ముందే పంపిణీ ప్రారంభిస్తాం. కరీంనగర్‌ డివిజనల్‌ తపాలా కార్యాలయం పరిధిలోని కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాతోపాటు పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల పరిధిలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లోని మా తపాలా డివిజన్‌ పరిధిలో 20 వేలకు పైగా బ్యాంకుల్లో ఖాతాలు లేని వారు ఉన్నట్లు తెలుస్తున్నది. వారందరికీ పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తాం. 

- మహ్మద్‌ అబ్దుల్‌ అలీం, సూపరింటెండెంట్‌  (కరీంనగర్‌ తపాలా డివిజన్‌) logo