బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Apr 23, 2020 , 03:13:37

అలుపెరగని సైనికులు

అలుపెరగని సైనికులు

  • కరోనా కట్టడిలో పోలీస్‌శాఖ
  • లాక్‌డౌన్‌ మరింత కట్టుదిట్టం 
  • నిరంతరం శ్రమిస్తున్న వేలాది మంది పోలీసులు
  • రాత్రివేళల్లో ఆకస్మిక గస్తీలు  
  • డ్రోన్‌ కెమెరాలు, మొబైల్‌ కమాండ్‌ కంట్రోల్‌ వాహనం ద్వారా నిఘా  
  • అవసరం లేకుండా రోడ్లపైకి వస్తున్నవారి వాహనాలు సీజ్‌

విద్రోహశక్తులతో దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడేది సైనికులయితే, దేశంలోపల కంటికి కనిపించని కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు పోలీసులు. వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మే 7వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కుటుంబాలను వీడి.. నిద్రాహారాలు మాని.. నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎవరూ అనవసరంగా రోడ్లపైకి రాకుండా కట్టడి చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ.. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. 

- కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగాణ

మరింత కట్టుదిట్టం 

కరోనా కట్టడి కోసం మే 7 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 19న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. సూర్యపేటలో ఒక వ్యక్తి నుంచి 80 మందికి కరోనా సోకినట్లు వార్తలు వెలువడడం.. దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు పెరగడం.. వంటి వాటిని పరిగణలోకి తీసుకొని, అత్యవసరమైతే తప్ప ప్రజలను బయటకు రానివ్వకుండా నియంత్రిస్తున్నారు. అందుకు డ్రోన్‌ కెమెరాలు, మొబైల్‌ కమాండ్‌ కంట్రోల్‌ వాహనాలు, సీసీ కెమెరాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. కూరగాయలు, సూపర్‌ మార్కెట్ల వద్ద సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు. కట్టడికి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పర్యవేక్షిస్తున్నారు. రాత్రీపగలు అన్న తేడా లేకుండా వచ్చి పోయే వాహనాలు, రోడ్లపైకి వచ్చే జనాల విషయంలో ఆరా తీస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా తెలిసినా.. వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో వాహనాలు సీజ్‌ చేశారు. చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా పెట్టారు. కంటైన్‌మెంట్‌ జోన్ల వద్ద నిరంతరం కాపలా కాస్తున్నారు. రాత్రి పూట ఆకస్మిక గస్తీ తిరుగుతున్నారు. ఉక్కపోత, దోమల మధ్య చాలా మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో వారి కుటుంబ రక్షణ కన్నా, కట్టడి కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ గుణవంత్‌సింగ్‌ను ఎక్స్‌కవేటర్‌ ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. రేకుర్తి చెక్‌పోస్టు వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డ ఓ హోంగార్డును, సకాలంలో దవాఖానకు తరలించడంతో ప్రాణాలతో బతికి బయట పడ్డాడు. ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సిబ్బంది ప్రయాణిస్తున్న పెట్రో కార్‌ను ఓ కారు ఢీ కొట్టడంతో సిబ్బంది గాయపడ్డారు. అదృష్టవశాత్తూ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఇలాంటి సంఘటనలను లెక్కచేయకుండా పోలీసులు నిర్భయంగా సేవలందిస్తున్నారు. 

నిత్యం గస్తీలో వేలాది మంది.. 

కరీంనగర్‌, రామగుండం కమిషనరేట్లతోపాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో పోలీసులే కాకుండా సీఆర్‌పీఎఫ్‌, ఆర్ముడ్‌ రిజర్వ్‌, టాస్క్‌పోర్సు విభాగాలకు చెందిన వారూ పనిచేస్తున్నారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో 750 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కదిద్దేందుకు సీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశారు. డ్రోన్‌ కెమెరాలు, మొబైల్‌ కమాండ్‌ కంట్రోల్‌ వాహనాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 650 మంది, జగిత్యాలలో 700మందికిపైగా, రామగుండం కమిషనరేట్‌ పరిధిలో వివిధ బలగాలను కలుపుకొని 1800 మందికిపైగా, ఆసిఫాబాద్‌ జిల్లాలో 600 మంది విధుల్లో నిమగ్నమయ్యారు. లాక్‌డౌన్‌ అమలుకు నిత్యం వేలాది మంది రేయింబవళ్ల్లూ పనిచేస్తున్నారు.

కట్టడియే లక్ష్యం.. 

కొవిడ్‌ 19కు ఇప్పటి వరకు మందు లేదు. అది ఎప్పుడు ఏ రూపంలో వచ్చి పడుతుందో తెలియదు. అందుకే సామాజిక దూరం పాటించేలా చూడడం, ఇళ్ల నుంచి బయటకు రాకుండా, వీధుల్లో గుంపులుగా ముచ్చట్లు పెట్టకుండా, అనవసరంగా రోడ్లపై వాహనాల్లో తిరగకుండా.. మాస్కులు లేకుండా బయటకు రాకుండా చూడడం వంటి అనేక అంశాలపై ప్రధానంగా దృష్టిపెడుతున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకున్నప్పుడు కొంత మందికి బాధనిపించినా.. అది సదరు వ్యక్తితోపాటు వారి కుటుంబం, అలాగే సమాజ క్షేమానికే అన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. నిబంధనల ఉల్లంఘన విషయంలో ఉదారంగా వ్యవహరిస్తే అది పెనుముప్పుగా మారుతుంది. సమాజమే ఇబ్బంది పడే ప్రమాదముంటుంది. అందుకే సాధ్యమైనంత మేర ప్రజలకు ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. అయితే తెలిసి కూడా కొంత మంది నిర్లక్ష్యంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరోలా ఉంటుంది. మారుతున్న పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకొని సంపూర్ణంగా సహకరిస్తే మహమ్మారిని తరిమేయడానికి ఆస్కారం ఉంటుంది.   

   - వీబీ కమలాసన్‌రెడ్డి, కరీంనగర్‌ సీపీlogo