శనివారం 30 మే 2020
Karimnagar - Apr 22, 2020 , 02:20:33

కరోనా కట్టడిలో.. మహిళా అధికారులు

కరోనా కట్టడిలో.. మహిళా అధికారులు

కరోనా కట్టడికి మహిళా అధికారులు యుద్ధం చేస్తున్నారు.ఉన్నతాధికారుల నుంచి మొదలు కిందిస్థాయిలో ఏఎన్‌ఎం,ఆశ వర్కర్ల వరకు నిరంతరం శ్రమిస్తున్నారు. కంటైన్‌మెంట్‌ ఏరియాల్లోనూ ఎలాంటి జంకు లేకుండా విధులను నిర్వర్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నివారణ చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు.  

కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం

లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో మే 7 వరకు పట్టణంలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం. ఎవరైనా ఆషామాషీగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్‌ చేస్తాం. ఉన్నతాధికారులు జారీ చేసిన పాసులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. నిత్యం కర్ఫ్యూ టైంలో గస్తీని ముమ్మరం చేసి బందోబస్తు చేపడుతున్నాం. కరోనా వ్యాప్తి చెందకుండా ఉన్నతాధికారుల ఉత్తర్వులను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఎవరైనా విందులు, వినోదాలు సామూహికంగా చేసుకున్నా, గుంపులు గుంపులుగా సంచరించినా, ముఖానికి మాస్క్‌ లేకుండా బయటకు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. అత్యవసరమైతే 100కు కాల్‌ చేసి సమస్య చెప్పుకోవాలి. 

- వీ మాధవి, హుజూరాబాద్‌టౌన్‌ సీఐ


అనుక్షణం అప్రమత్తం.. 

గత నెల 17, 18తేదీల్లో ఇండోనేషియా వాసులకు పాజిటివ్‌ రాగా, మొదటి కేసు నుంచే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తున్నారు.  వైద్యులు, సిబ్బందిని డీఎంఅండ్‌హెచ్‌వో సుజాత ముందుండి నడిపిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖానతోపాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులను అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇటు ప్రభుత్వ, హోం క్వారంటైన్‌లో ఉన్న వారి వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ, ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్షలు, టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లకు హాజరవుతున్నారు. హుజూరాబాద్‌లోనూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మరింత అప్రమత్తమయ్యారు. అధికారులు, సిబ్బందిని అలర్ట్‌ చేసి ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నారు. 


సిబ్బంది సహకారంతోనే..

సిబ్బంది సహకారంతోనే కరోనాను కట్టడి చేశాం. ఇండోనేషియా నుంచి వచ్చిన పది మంది కరోనా బారిన పడడంతో జిల్లా ప్రజలను అప్రమత్తం చేశాం. మార్చి 18 నుంచి జిల్లాలో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్‌ సర్వేలు నిర్వహించాం. అనుమానిత ప్రాంతాలను కంటైన్‌మెంట్‌లుగా ప్రకటించాం. అక్కడ ప్రతి ఇంటిని క్షుణ్నంగా పరిశీలించి అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరించాం. వైద్య సిబ్బందితో ప్రజలకు జాగ్రత్తలు వివరించాం. ఇప్పటికైతే జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు ఉంది. 19 మంది కరోనా బాధితులు కాగా, అందులో 17 మంది డిశ్చార్జి అయ్యారు. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచాం. మిగిలింది ఇద్దరే. 

- డాక్టర్‌ సుజాత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి 


నిరంతరం విధులు..

కొవిడ్‌-19 నియంత్రణలో పోలీసుల పాత్ర ఎనలేనిది. అందులో మహిళా పోలీస్‌ అధికారుల కృషి సైతం అభినందనీయం. అలాంటి వారిలో హుజూరాబాద్‌ సీఐ మాధవి ఒకరు. స్థానికంగా వైరస్‌ ప్రభావం చూపినప్పటి నుంచి ఆమె అలుపెరగకుండా పని చేస్తున్నారు. ఎక్కడ నలుగురైదుగురు కనిపించినా జాగ్రత్తలను వివరిస్తున్నారు. తనతో పని చేసే పోలీస్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మాస్కులు అందించడంతోపాటు సామాజిక దూరం ప్రాధాన్యతను వివరిస్తున్నారు. హుజూరాబాద్‌లో లాక్‌డౌన్‌ అత్యంత పకడ్బందీగా అమలయ్యేలా ఆమె  కృషి చేస్తున్నారు. రాత్రనకా, పగలనకా ఆమె రోడ్ల మీదనే గడుపుతున్నారు. అంతేకాకుండా ఒంటరి మహిళలు, నిరుపేదలకు సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ మనసున్న పోలీసుగా మన్ననలు అందుకుంటున్నారు


వెరవని ధైర్యం.. 

వైరస్‌ నివారణ చర్యల్లో కింది స్థాయి ఉద్యోగులూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎందరో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు నిరంతరంగా సేవలందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అనుమానితులను సైతం కుటుంబ సభ్యులుగా భావించి వారిలో ధైర్యాన్ని నూరిపోస్తున్న ఏఎన్‌ఎంలలో పద్మ ఒకరు . చెల్పూర్‌ పీహెచ్‌సీలో హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నది. హుజూరాబాద్‌ కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో నిర్భయంగా విధులు నిర్వర్తిస్తున్నది. ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నది. ఈ ప్రాంతానికి చెందిన 40 మంది విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉండగా, రోజుకు రెండు, మూడుసార్లు వీరి ఇండ్లకు వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నది. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నది. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయటికి వచ్చి రాత్రి 8 గంటల వరకు తనకు కేటాయించిన ఏరియాలోనే అంకితభావంతో పనిచేస్తున్నది. కాకతీయకాలనీలో ఈ నెల 2న ఒకరికి కరోనా పాజిటివ్‌ రాగా, కాలనీలోని 1,500 కుటుంబాల్లో పది వేల మందికి వారం రోజుల్లో వైద్య పరీక్షలు పూర్తి చేయడంలో పద్మ కృషి ఎంతో ఉన్నది. ఇప్పుడీ ప్రాంతంలోని 90 శాతం మందికి పద్మ అంటే ఇట్టే తెలిసిపోతుంది. 


నిత్యం పర్యవేక్షణ..

ఉన్నతాధికారులు, కలెక్టర్‌ శశాంక ఆదేశాలు, సూచనల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో సమాలోచనలు చేసి, అమలు చేస్తున్నారు. బల్దియా పరిధిలో పలు విభాగాల అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులతో సమీక్షించి, దిశానిర్దేశం చేస్తున్నారు. నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, వైరస్‌ నియంత్రణ చర్యలను పరిశీలిస్తున్నారు. వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో కలియ తిరుగుతున్నారు. వైద్య సిబ్బంది చేస్తున్న పరీక్షలు, సర్వేలను పర్యవేక్షిస్తున్నారు. ఇటు అన్ని డివిజన్లలో హైపో క్లోరైట్‌, లిక్విడ్‌ బ్లీచింగ్‌ స్ప్రే చేయించి వైరస్‌ వ్యాప్తిని అరికడుతున్నారు. కూరగాయల మార్కెట్లను సందర్శించి, సామాజిక దూరాన్ని పాటించేలా చూస్తున్నారు. logo