గురువారం 28 మే 2020
Karimnagar - Apr 21, 2020 , 03:01:25

కరోనా కట్టడిలో బల్దియా

కరోనా కట్టడిలో బల్దియా

  • మహమ్మారి నియంత్రణకు పకడ్బందీగా యంత్రాంగం
  • మేయర్‌, కమిషనర్‌ నిరంతర పర్యవేక్షణ
  • కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో కట్టుదిట్టమైన చర్యలు
  • ఆధునిక యంత్రాలతో ముమ్మరంగా శానిటైజేషన్‌
  • ఇండ్ల వద్దకే నిత్యావసరాలు, కూరగాయలు
  • ప్రజలు ఇండ్ల నుంచి రాకుండా సూచనలు
  • కాలనీల్లో అందుబాటులో మార్కెట్లు
  • సంఘాలకు ఉపాధి మార్గాలు

కరీంనగరంలో కరోనా కట్టడిలో నగరపాలక సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ముఖ్యంగా మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి నిరంతర పర్యవేక్షణలో యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. పకడ్బందీ వ్యూహం, కట్టుదిట్టమైన చర్యలతో అదుపులోకి తెస్తున్నది.

- కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ


నగరంలో పర్యటించిన ఇండోనేషియా వాసులకు 17,18 తేదీల్లో కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లాయంత్రాంగం రంగంలోకి దిగి, శరవేగంగా నివారణ చర్యలు చేపట్టింది. వీరితోపాటే నగరపాలక సంస్థ యంత్రాంగం కీలకంగా వ్యవహరించింది. జిల్లా అధికారులతో కలిసి బల్దియా అధికారులు కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో పకడ్బందీగా వ్యవహరించారు. ముకరంపుర, కశ్మీర్‌గడ్డ ప్రాంతాల్లో వైరస్‌ నివారణపై అవగాహన కల్పించారు. కలెక్టర్‌ శశాంకతోపాటు మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి క్షేత్రస్థాయిలో పర్యటించి, భరోసా కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, ముందుకుసాగారు. అంతే కాకుండా, ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా సూచనలు చేశారు. ఇదే సమయంలో అందుబాటులో ఉండేలా 14 కూరగాయల మార్కెట్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. రద్దీగా ఉండే వేంకటేశ్వర ఆలయం సమీపంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌ను తొలగించి, బస్టాండ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మార్కెట్లు, షాపుల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. 

శానిటైజేషన్‌లో నూతన పద్ధతులు

ఒకేసారి పది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు. పారిశుధ్య సిబ్బందికి అవసరమైన గ్లౌజులు, మాస్కులు, ఇతర రక్షణ పరికరాలను కూడా అందించారు. ఎక్కడా లేని విధంగా ఆధునిక యంత్రాలన్నింటినీ వినియోగంలోకి తెచ్చారు. అగ్నిమాపక శాఖ వాహనాలు, డ్రోన్లు, పత్తి పంటకు మందు కొట్టే ప్రొటెక్టర్‌ 600, పవర్‌ స్ప్రే యంత్రాలు, ట్రాక్టర్‌తో స్ప్రే చేయించారు. ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లతోపాటు, ఇళ్లకు కూడా రసాయనాలను, నగరంలోని 60 డివిజన్లలో లిక్విడ్‌ బ్లీచింగ్‌ స్ప్రే చేయించారు. నగరపాలక సంస్థ కార్యాలయం, బస్టాండ్‌ కూరగాయల మార్కెట్‌ వద్ద డిసిన్‌ఫెక్షన్‌ చాంబర్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే, బల్దియా కార్యాలయంలో హ్యాండ్‌ వాష్‌ బేసిన్‌ను కూడా ఏర్పాటు చేశారు. 

పేదలకు ఆపన్నహస్తం

ఓ వైపు వైరస్‌ నియంత్రణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో నిత్యావసర సరుకులు ఇళ్ల వద్దకే వెళ్లి అందిస్తున్నారు. మూడు రోజులకోసారి కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. ఇదే సమయంలో లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలు, పారిశుధ్య కార్మికులను ఆదుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. సర్కారు తరఫున బియ్యం, నగదు పంపిణీ చేయడంతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిత్యావసరాలు అందజేశారు. పెద్ద ఎత్తున అన్నదానాలు చేయడంతోపాటు కూరగాయలు అందజేశారు. 60 డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లు, దాతల సహకారంతో ఈ కార్యక్రమాలను నిరంతరంగా సాగిస్తున్నారు. కార్మికులకు కరీంనగర్‌ డెయిరీ సహకారంతో మధ్యాహ్న సమయంలో మజ్జిగ ప్యాకెట్లు పంచుతున్నారు. చల్లని మినరల్‌ వాటర్‌ అందించడంతోపాటు రోగనిరోధక శక్తి పెంచే పంచతులసి, ఇతర ఆయుర్వేద మూలికలను ఎస్‌ఆర్‌ఆర్‌ సంస్థ సహకారంతో అందిస్తున్నారు.

ఉపాధి మార్గాలు

నగరంలోని ప్రజలందరికీ మాస్కులు అందించాలన్న ఆలోచనతో మేయర్‌ 10కి పైగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మాస్కులను కుట్టించే పనులు చేపట్టారు. వీటి మార్కెటింగ్‌కు కూడా పూర్తిస్థాయిలో సహకారం అందించడమే కాకుండా, ఏకంగా బల్దియా కార్యాలయం లో అమ్మకాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 15 మంది మహిళలకు శానిటైజర్స్‌ బాటిల్స్‌ తయారు చేసే విధానంపై ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చిన ట్రైనర్స్‌తో శిక్షణ ఇప్పించారు. కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తూ, అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారు. కేసుల సంఖ్యను తగ్గించి, కరీంనగర్‌ బల్దియాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపారు.

అన్ని చర్యలూ తీసుకుంటున్నాం

కరీంనగర్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌ సూచనలు, సహకారంతో అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ముఖ్యంగా జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పనులు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిస్థాయి శానిటైజేషన్‌, ఇతర పారిశుధ్య పనులు చేపట్టే విషయంలో ఉన్న అవకాశాలను వినియోగిస్తున్నాం. నగరపాలక కమిషనర్‌, అధికారులు ఎప్పటికప్పుడు స్పందించి పనులు చేస్తున్నారు. మరోవైపు మంచినీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, తదితర పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు అన్ని ప్రాంతాల్లోనూ పనులు చేస్తున్నారు. అన్ని డివిజన్లలోనూ పేదలు, వలసకూలీలు, పారిశుధ్య కార్మికులను ఆదుకునేందుకు కార్పొరేటర్లు, స్థానిక దాతలు ముందుకు రావడం సంతోషంగా ఉంది.

          - మేయర్‌ వై.సునీల్‌రావు


logo