బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Apr 21, 2020 , 02:58:55

ఆయకట్టుకు అదనపు తడి

ఆయకట్టుకు అదనపు తడి

  • ఎస్సారెస్పీ పరిధిలో ఆలస్యంగా వేసిన పంటలకు జీవం
  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నీటి విడుదల
  • ఉమ్మడి జిల్లాలో ఆఖరి దశలో ఉన్న వేలాది ఎకరాలకు ప్రయోజనం
  • ఇప్పటికే వారబందీ పద్ధతిన పుష్కలంగా అందిన జలాలు  
  • హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) ఆయకట్టు రైతన్నకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. ఇప్పటికే వారబందీ పద్ధతిన పుష్కలంగా నీరందించి సిరుల పంట పండించగా, ఇప్పుడు ఆలస్యంగా వేసిన పంటలకూ జీవం పోస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆలస్యంగా సాగై, చివరిదశలో వేలాది ఎకరాల్లో ఉన్న వరి పైరును కాపాడాలనే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో తాజాగా ఆయకట్టుకు అదనపు తడి ఇస్తున్నది. ఈ నెల 16వతేదీనే నీటిని విడుదల చేయగా, ఇప్పుడిప్పుడే పొలాలకు చేరుతున్న నీటిని చూసి కర్షకలోకం మురిసిపోతున్నది. కష్టకాలంలోనూ తమ మేలు కోరి అదనపు తడి ఇస్తున్న కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నది.    - (ధర్మారం)

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) కింద లక్షలాది ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో పెద్దపల్లి జిల్లాలోనే 2.8 లక్షల ఎకరాలు ఉంది. ఎస్సారెస్పీ ప్రధాన కాలువ కాకతీయ కెనాల్‌ నుంచి వచ్చే డీ-83 కింద జిల్లాలోని ధర్మారం, జూలపల్లి, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, కాల్వశ్రీరాంపూర్‌, రామగుండం, మంథని, ముత్తారం, కమాన్‌పూర్‌, పాలకుర్తి, అంతర్గాం, రామగిరి, ఎలిగేడు మండలాల్లోని 1.22 లక్షల ఎకరాలు, డీ-86 కాలువ కింద జూలపల్లి, ఎలిగేడు, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల్లో మరో 86వేల ఎకరాలు సాగవుతుంది.

ఆలస్యంగా వేసిన పంటలకు జీవం

పెద్దపల్లి జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఈ యాసంగిలో సర్కారు అనుకున్న దానికంటే అధికంగానే నీటిని విడుదల చేసింది. ఎనిమిది రోజులు ఆన్‌.. ఏడు రోజులు ఆఫ్‌(వారబందీ) పద్ధతిన గత డిసెంబర్‌ నుంచి డీ-83, డీ-86 కాలువల ద్వారా నీటిని పుష్కలంగా ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆయకట్టు చివరి భూములకూ నీరు చేరడంతో దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది. కోతలు కూడా మొదలు కాగా, ఇప్పటికే పలువురు విక్రయాలు చేపడుతున్నారు. అయితే పలు కారణాల రీత్యా చాలా మంది రైతులు ఆలస్యంగా పంటలు వేశారు. ప్రధానంగా వరితోపాటు పలుచోట్ల మక్క కూడా సాగుచేశారు. అందులోనూ ఎలాంటి నీటి ఆధారం లేకుండా కాలువ నీటినే నమ్ముకొని వేసిన పంటలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 70వేల ఎకరాలు చివరి దశలో ఉన్నాయి. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 30 వేల ఎకరాలు ఉండడంతో నీటి విడుదల చేయాలని నిర్ణయించారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జలాలు

ఎస్సారెస్పీ ఆయకట్టుకు పుష్కలంగా నీరందించినప్పటికీ ఆలస్యంగా, కాలువ నీరే ఆధారంగా సాగైన పంటలు వేలాది ఎకరాలల్లో ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ నెల 11న మంత్రివర్గ సమావేశంలోనూ చర్చకు రాగా, వెంటనే అదనపు తడి అందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో 16వ తేదీ నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయగా రైతులు సంబుర పడిపోతున్నారు. వారబందీ గడువు ముగిసిందని, ఇక కాలువ నీటిని చూడలేమనుకుంటున్న తరుణంలో చివరి దశలో ఉన్న పంటలకు నీటిని విడుదల చేయించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెబుతున్నారు.

పాణమచ్చినట్లయింది..

నేను ధర్మారంల మూడెకరాలల్ల అరి ఏసిన. బాయి ఉన్నా నీళ్లు సాలయి. కాలువ నీళ్లే దిక్కు.  నాట్లు ఏసుడు లేటై గిప్పుడే ఆఖరికచ్చింది. నీళ్లిచ్చుడు బందైనంక ఏం జేయాలె. ఎట్ల అని రందివడ్డ. కానీ.. కేసీఆర్‌ సార్‌ మా పరిస్థితిని తెలుసుకొని నీళ్లిత్తండు అని తెలిసినంక నాకు పాణమచ్చి నట్లయింది. నాయే కాదు ఎనుక, ముందు ఏసిన పొలాలన్నీ పండుతయ్‌. 

- నార రవీందర్‌, రైతు, ధర్మారం 

దిగుబడి తగ్గేది..

నాది ధర్మారం. నాకు ఎస్సారెస్పీ కాలువ కింద భూమి ఉంది. కొంత బాయి, మరి కొంత కాలువ నీటి ఆధారంగా వరి పండిస్తున్న. మొన్నటిదాకా వారబందీ కింద ఇచ్చిన నీళ్లు పారించిన. ఇంకా పొలం పచ్చగనే ఉంది. మళ్లోసారి నీళ్లిస్తే మంచిగుండు అనుకున్న. మేం ఆశ్చర్య పడేలా కాలువకు నీళ్లు ఇడిసిన్రు. అదనపు తడి రాకుంటే దిగుబడి తగ్గి పోయేది. సీఎం సార్‌కు కృతజ్ఞతలు.

- గంధం రాజయ్య, రైతు, ధర్మారం 

మస్తు రందివడ్డ.. 

నాది ధర్మారం మండలం నంది మేడారం గ్రామం. నేను డీ-83 పరిధిలోని 7ఆర్‌ కెనాల్‌ కింద ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి వేసిన. మొన్నటిదాకా వారబందీ పద్ధతిన నీళ్లిత్తే పెట్టిన. నాట్లు ఆలస్యమై ధాన్యం ఇంకా కంకి దశలోనే ఉంది. నీళ్లు ఎట్ల పెట్టాలని మస్తు రందివడ్డ. గప్పుడే ముఖ్యమంత్రి సార్‌ అదనపు తడికి నీరు ఇప్పిస్తున్నడని తెలియంగనే సంబురపడ్డ. నీళ్లు రాంగనే పారిచ్చిన.

- కట్ట భీమయ్య రైతు,నంది మేడారం


logo