శనివారం 30 మే 2020
Karimnagar - Apr 20, 2020 , 02:31:42

ఆపత్కాలంలో భరోసా

ఆపత్కాలంలో భరోసా

  • పేదలపై పెద్ద మనసు చాటుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • ప్రజారోగ్య శ్రేయస్సు కోసం మే 7 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు 
  • 5,200 మంది పోలీసులకు అందనున్న ప్రోత్సాహకం
  • పరిశ్రమలకు రెండు నెలల విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలు వాయిదా 
  • ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలన్న నిర్ణయంతో 1.50 లక్షల కుటుంబాలకు ఊరట
  • ఇంటి అద్దె మూడు నెలలు అడుగద్దు

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి కట్టడి కోసం మే 7 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో పలు వర్గాలకు ఆపన్నహస్తం అందించారు. ఆర్థిక ఇబ్బందులున్నా అధైర్యపడొద్దని భరోసా కల్పిస్తూనే.. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని వెల్లడించారు. మరోవైపు.. గతంలో వైద్యులకు, సఫాయి కార్మికులకు ఇచ్చిన ప్రభుత్వ ప్రోత్సాహకాలను యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. కొత్తగా పోలీసులకు వారి మూల వేతనంపై 10 శాతాన్ని ప్రభుత్వ ప్రోత్సాహకం కింద అందిస్తామని తెలిపారు. లాక్‌డౌన్‌తో ప్రతి కుటుంబం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. ప్రైవేట్‌ పాఠశాలల ఫీజులపై ప్రత్యేక నియంత్రణ విధిస్తున్నట్లు ప్రకటించడం తల్లిదండ్రులకు ఊరట లభించినట్లు అయింది. పెన్షనర్లకు ఏప్రిల్‌లో 75 శాతం వేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. అనేక వర్గాలకు ‘మేం ఉన్నాం’ అనే భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

11 వేల మంది పింఛన్‌దారులకు ఆసరా

పింఛన్‌దారులకు గత మార్చిలో 50 శాతం వేతనాలు ఇచ్చిన సర్కారు.. సదరు వర్గాల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఏప్రిల్‌ మాసానికి సంబంధించి 75 శాతం వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ పెన్షనర్ల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సుమారు 11 వేల మందికి లబ్ధి  చేకూరనుంది.

5,200 మంది పోలీసులకు ప్రయోజనం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు రాత్రనక, పగలనకా విధులు నిర్వహిస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన సర్కారు మూలవేతనంపై పది శాతం కలిపి ఏప్రిల్‌ మాసంలో జీతం  చెల్లించనున్నట్లుగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కేబినెట్‌తో తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి జిల్లాలో 5,200 మంది పోలీసులకు ప్రయోజనం చేకూరనుంది. సేవలను గుర్తించడం, అదనపు ప్రోత్సాహకం ఇవ్వడంతో పోలీసు వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అలాగే విద్యత్‌ శాఖలో ఆపరేషన్‌ మెయింటనెన్స్‌ సిబ్బందికి ఈనెల 75 శాతం వేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీని వల్ల సుమారు 3 వేలకు పైగా సిబ్బంది సహాయ పడినట్లనయింది. ఇంత విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న విద్యుత్‌ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి గుర్తించినట్లు అయింది.

1.55 లక్షల కుటుంబాలకు లబ్ధి

సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నిర్ణయాల్లో కీలకమైంది ప్రైవేట్‌ విద్యాసంస్థలు కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలనే నిబంధన పెడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ ఇతర విద్యా సంస్థలన్నీ కలిపి 1200కు పైగా ఉన్నాయి. ఇందులో 1.50 లక్షల కుటుంబాలకు చెందిన 2.50 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. యేటా ట్యూషన్‌ ఫీజుతోపాటు పలు విద్యాసంస్థలు స్పెషల్‌, టర్మ్‌, ఎగ్జామ్‌, స్పోర్ట్స్‌, లైబ్రరీ, అడ్మిషన్‌, డొనేషన్‌ ఫీజులు వసూలు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రతి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని గ్రహించి 2020-21 విద్యా సంవత్సరానికి కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి భిన్నంగా ఏ మాత్రం అదనపు ఫీజులు వసూలు చేసినా.. సదరు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన తీరుపై తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి జిల్లాలో సుమారు 1.50 లక్షల కుటుంబాలకు మేలు జరగనుంది. అలాగే మార్చి, ఏప్రిల్‌, మే నెలల ఇంటిఅద్దెలను యజమానులు ప్రస్తుతం అడుగొద్దని విజ్ఞప్తి చేశారు. తదుపరి నెలవారీగా వాయిదా పద్ధతిలో తీసుకోవాలని సూచించడంతో లక్షలాది మంది అద్దెవాసులకు ఊరట లభించినట్లు అయింది.

3 వేల పరిశ్రమలకు ఊరట

ప్రతినెలా కచ్చితంగా చెల్లించాల్సిన విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీల విషయంలో ప్రభుత్వం ఉదాసీనత చూపింది. లాక్‌డాన్‌ కారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ చార్జీలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. తదుపరి వాటిని వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చని ప్రకటించారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు 3 వేల నుంచి 3500 వరకు చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలకు ఊరట లభించనుంది. అంతేకాదు.. సకాలంలో బిల్లులు చెల్లిస్తే ఒక శాతం రిబేట్‌ కూడా ప్రకటించారు.

ఇంకా కట్టుదిట్టం..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో కరోనా పూర్తిస్థాయిలో కట్టడి అయ్యే అవకాశం ఉంది. గతంతో పోల్చి చూస్తే ఇప్పటికే పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. కేవలం మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారికి మాత్రమే కేసులు బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజా నిర్ణయం వల్ల పూర్తిస్థాయి కట్టడి జరిగే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయడం కూడా కలిసొచ్చే అవకాశం కింద చెప్పవచ్చు. వీటితోపాటు గతంలో మాదిరిగా వైద్యసిబ్బందికి, సఫాయి కార్మికులకు, వలస కూలీలకు, అదనపు ప్రోత్సాహకాలు, బియ్యం, రూ.1500 అందించనున్నారు. మరోవైపు రాబోయే రబీ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎరువుల కొరత నివారణకు ముందస్తుగా ఆలోచనలు చేయడం.. మే నెలలోనే ఎరువులు అందుబాటులోకి వస్తాయని ప్రకటించడంపై కర్షకలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.

ఆర్థిక భారం తగ్గుతది

వచ్చే విద్యా సంవత్సరానికి ఫీజులు పెంచద్దని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించడం విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరటనిచ్చే విషయం. లాక్‌డౌన్‌తో ఇప్పటికే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ తరువాత కూడా ఫీజులు కట్టలేని పరిస్థితే ఉంటుంది. దీనిని సీఎం కేసీఆర్‌ ముందుగానే గ్రహించి ట్యూషన్‌ ఫీజును నెలవారీగా చెల్లించే వెసులుబాటు ఇవ్వడం చాలా మంచి నిర్ణయం. 

- పీ శ్రీనివాస్‌, విద్యార్థి తండ్రి, కరీంనగర్‌ (కార్పొరేషన్‌) 

పోలీసుశాఖలో నూతనోత్సాహం

కరోనా నియంత్రణ కోసం వైద్య, పారిశుధ్య, పోలీసు విభాగాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. ఆ సేవలను గుర్తించి ప్రభుత్వం అదనపు నిధులు సమకూర్చడం ఆనందంగా ఉన్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్‌శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి అన్ని వసతులు కల్పిస్తున్నది. జీత భత్యాల్లో కోత లేకుండా ఇవ్వడమే కాకుండా అదనంగా పదిశాతం ఇవ్వాలని ప్రకటించడంతో పోలీస్‌శాఖలో ఉత్సాహం నెలకొంది.  

- మామిడాల సురేందర్‌, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు (కరీంనగర్‌ క్రైం) 

మా సేవలకు గుర్తింపు 

నేను కొడిమ్యాల మండలం పూడూరులో లైన్‌మన్‌గా పనిచేస్తా. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మా డిపార్ట్‌మెంట్‌ 24 గంటలపాటు ప్రజలకు సేవలు అందిస్తున్నది. విద్యుత్‌ సరఫరాతోపాటు సమస్యలు ఉంటే వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నం. గత నెలలో సర్కారు మాకు 50 శాతం జీతాలే చెల్లించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పనులు చేస్తున్న మాలాంటి వాళ్ల సేవలను సీఎం కేసీఆర్‌ గుర్తించిండు. ఇప్పుడు మాకు మొత్తం జీతం ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ప్రభుత్వానికి తగిన గుర్తింపు తెచ్చేలా పనిచేస్తాం. 

- వినుగుర్తి సత్యం, విద్యుత్‌ లైన్‌మన్‌, పూడూరు (జగిత్యాల)

మా కష్టాన్ని గుర్తించారు

కరోనా నివారణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వివిధశాఖలతో పాటు, అత్యవసర సేవలను అందిస్తున్న వాటిలో మా విద్యుత్‌ శాఖ కూడా ఉంది. మేం 24 గంటలు కష్టపడుతున్నం. మాకు మొత్తం వేతనం చెల్లించాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం ఆనందంగా ఉన్నది. మా కష్టాన్ని గుర్తించారు.

                             - ఆసిరి ప్రకాశ్‌, తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం నాయకుడు (కరీంనగర్‌ ప్రతినిధి)  

పరిశ్రమ వర్గాలకు ఊరట

పరిశ్రమల నుంచి విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీల వసూలును వాయిదా వేయడం చాలా మంచి నిర్ణయం. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూతబడి పారిశ్రామిక వేత్తలు కష్టాల్లో మునిగిపోయారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం పరిశ్రమ వర్గాలకు ఎంతో ఊరటనిస్తుంది. పరిశ్రమలను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.

- సుధాకర్‌రావు, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి(కరీంనగర్‌ ప్రతినిధి)

మూణ్నెళ్లు ఇబ్బంది ఉండదు

లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలల పాటు యజమానులు కిరాయిదారుల నుంచి ఇంటి అద్దె వసూలు చేయవద్దని మంత్రి వర్గం నిర్ణయించడంతో మాలాంటోళ్లకు ఇబ్బంది ఉండదు. నేను సంతోష్‌నగర్‌లో ఉంటూ అక్కడే లేడీస్‌ ఎంపోరియం నడుపుకుంటున్న. నెలకు రూ.6 వేల కిరాయి కడుతున్న. లాక్‌డౌన్‌తో నెల రోజుల నుంచి షాపు మూసి ఉంది. ఇప్పుడు కిరాయి కట్టడం ఇబ్బందవుతున్నది. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నిర్ణయం మాలాంటోళ్లకు కొంత ఉపశమనమే. మార్చి నుంచి మూడు నెలల పాటు కిరాయి వసూలు చేయవద్దని ఆదేశించడం మంచి నిర్ణయం. 

- ఐల శివరాం, సంతోష్‌నగర్‌, కిరాయిదారుడు (కరీంనగర్‌హెల్త్‌)


logo