గురువారం 04 జూన్ 2020
Karimnagar - Apr 16, 2020 , 03:58:48

ప్రతి గింజనూ కొంటాం

ప్రతి గింజనూ కొంటాం

  • రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రారంభోత్సవం

కోరుట్ల/కోరుట్లటౌన్‌/ధర్మారం : వరి ధాన్యాన్ని మొత్తంగా కొంటున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని, పండిన ప్రతి గింజనూ కొంటామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. కోరుట్ల మండలం మాదాపూర్‌లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి, లంబాడితండా (బీ) పెర్కపల్లి, మల్లాపూర్‌లో డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈశ్వర్‌ బుధవారం ప్రారంభించారు. ఆయా చోట్ల కొప్పుల మాట్లాడుతూ రైతులు కేంద్రాల్లోనే పంట విక్రయించి మద్దతు ధర పొందాలని, టోకెన్‌ పద్ధతిలో కేంద్రాలకు ధాన్యాన్ని తేవాలని, మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. కోరుట్ల మండలం కల్లూరును కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించడంతో మంత్రి అక్కడి పరిస్థితిపై సమీక్షించారు. గ్రామంలో జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య-రాజేశ్‌ దంపతులు అందించిన నిత్యావసర సరుకులను మంత్రి ఆశవర్కర్లకు అందజేసి శాలువాతో సన్మానించారు. కలకోట తిరుపతి వలసకూలీల కోసం రూ.10వేలు మంత్రి సమక్షంలో ఎమ్మెల్యేకు అందజేశారు. కోరుట్లలో కంటైన్‌మెంట్‌ ప్రాంతంగా గుర్తించిన కొత్త బస్టాండ్‌, భీమునిదుబ్బ ప్రాంతాలను పరిశీలించారు. అంతకుముందు మెట్‌పల్లి పట్టణానికి చెందిన దివ్యాంగురాలు, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్న కడప మాధురికి ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీని మంత్రి అందజేశారు. కాలనీలోని పలువురు మహిళలకు మాస్కులను పంపిణీ చేశారు. 

అన్నదాతలకు అభినందన  

కోరుట్ల పట్టణంలోని కాల్వగడ్డ ప్రాంతంలో నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని బుధవారం మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే కల్వకుంట్ల ప్రారంభించారు. కరోనా కట్టడికి శ్రమిస్తున్న వైద్య, ఆరోగ్య, మున్సిపల్‌, పారిశుధ్య సిబ్బంది నిత్యం సుమారు 400 మందికి టిఫిన్స్‌, 200 మందికి భోజనం సమకూరుస్తున్న రామ్‌ యువసేన సభ్యులను అభినందించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ రాజేశం, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఎంపీడీవోలు శ్రీనివాస్‌, నీరజ, ఎంపీపీ తోట శ్రీనివాస్‌, కోరుట్ల మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, తాసిల్దార్‌ సత్యనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ అయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo