బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Apr 16, 2020 , 03:57:47

ఆపత్కాలంలో ఆసరా

ఆపత్కాలంలో ఆసరా

  • నిరుపేదలకు రాష్ట్ర సర్కారు ఆపన్నహస్తం  
  • లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడకుండా బియ్యం, నగదు సాయం
  • తాజాగా తెల్ల రేషన్‌కార్డు కుటుంబాలకు 1500 చొప్పున ఖాతాల్లో జమ 
  • డబ్బులు డ్రా చేసుకుంటూ లబ్ధిదారుల హర్షం 
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు 

కరీంనగర్‌ ప్రతినిధి, నమసే తెలంగాణ: కరోనా నేపథ్యంలో రెక్కాడితే గానీ, డొక్కాడని నిరుపేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కష్టజీవులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలస కూలీలకు ఉచితంగా బియ్యం, నగదు అందిస్తూనే తెల్లరేషన్‌ కార్డుదారులకు ఆసరా అవుతున్నారు. ఒక్కో వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యం ఇచ్చారు. ఈ ప్రక్రియ 90శాతానికిపైగా పూర్తి కాగా, ప్రస్తుతం రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ 1,500 చొప్పున ఖాతాల్లో వేస్తున్నారు. ఆధార్‌ కార్డు లింక్‌ అయిన అకౌంట్లలో ఈ మొత్తాన్ని జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. హైదరాబాద్‌లోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్‌ నుంచి పంపిణీ ప్రక్రియపై పర్యవేక్షణ జరుగుతున్నది. ప్రస్తుతం మే3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పేదలకు ఎంతో ఉపయోగపడే అవకాశమున్నది. నగదు జమైన కార్డుదారుల మొబైల్‌ ఫోన్లకు వెంటవెంటనే మెసేజ్‌లు వస్తుండగా, సమాచారాన్ని అందుకుంటున్న మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నగదు విడిపించుకుంటున్న వారంతా, తమకు అవసరమైన ఉప్పు, పప్పులు, మంచి నూనె తదితర నిత్యావసర సరుకులు తెచ్చుకుంటున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెబుతున్నారు. 

కరీంనగర్‌ జిల్లా..

జిల్లాలో 2,74,620 కుటుంబాలకు తెల్లరేషన్‌ కార్డులున్నాయి. ఇందులో 8,17,313 మంది సభ్యులున్నారు. వీరికి 98,07,765 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ 90 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కుటుంబానికి 1,500 చొప్పున ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది నిరుపేదలు ఈ మొత్తాన్ని విడిపించుకున్నారు. మొత్తంగా జిల్లాకు సుమారు 41.19 కోట్ల లబ్ధి చేకూరనున్నది. 

పెద్దపల్లి జిల్లా..

జిల్లాలో 2,16,678 రేషన్‌ కార్డులు ఉండగా, ఇప్పటివరకు 90శాతం బియ్యం పంపిణీ పూర్తయింది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోలుకు 1500 జమ చేస్తుండగా, జిల్లాకు 32కోట్ల 50లక్షల 17వేలు అందించనున్నారు. బుధవారం వరకు జిల్లాలో 1,85,440 మంది ఖాతాల్లో 27.80కోట్లు జమ చేశారు. మిగతావారికి నేడు, రేపు జమ చేయన్నుట్లు అధికారులు చెప్పారు.

జగిత్యాల జిల్లా..

జిల్లాలో 3లక్షల 3వేల మంది ఆహార భద్రతా కార్డుదారులకు సంబంధించి, 6లక్షల 36వేల కిలోల బియ్యం పంపిణీ కొనసాగుతున్నది. ప్రస్తుతం 1500 చొప్పున నగదు జమచేసే ప్రక్రియ మొదలైంది. వీరికి మొత్తంగా 45.45కోట్లు అందనున్నాయి. 

రాజన్న సిరిసిల్ల జిల్లా..

జిల్లాలో తెల్ల రేషన్‌కార్డులు 1,73,065 ఉండగా, 5,04,786 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ ఈ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు, 6 టన్నుల బియ్యాన్ని జిల్లాలోని 344 దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. ప్రస్తుతం కుటుంబానికి 1500 చొప్పున జమ చేస్తున్నారు. 

మంచిర్యాల జిల్లా.. 

జిల్లాలో 2,14,759 తెల్లరేషన్‌ కార్డులు ఉండగా, 1,91,686 రేషన్‌ కార్డుదారులకు బియ్యం పంపిణీ పూర్తయ్యింది. జిల్లాకు 73,846 మెట్రిక్‌ టన్నుల బియ్యం కాగా, ఇప్పటివరకు 72,061 మెట్రిక్‌ టన్నులు(89శాతం) పంపిణీ చేశారు. మిగతావి రెండు రోజుల్లో పూర్తిచేయనున్నారు. అలాగే కుటుంబానికి 1500 చొప్పున 1,82,414 కార్డుదారుల ఖాతాల్లో 27.36 కోట్లు వేశారు.    

ఆసిఫాబాద్‌ జిల్లా..

జిల్లాలో లక్షా 37, 487 మంది తెల్ల రేషన్‌ కార్డుదారులుండగా, ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున 5,800 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. ప్రస్తుతం కుటుంబానికి  1500 చొప్పున జిల్లాలో 20కోట్లా 62లక్షల 30వేల 500 వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. జమ చేసే ప్రక్రియ మరో 5 శాతం మాత్రమే మిగిలి ఉందని అదనపు కలెక్టర్‌ రాంబాబు తెలిపారు. 

మా పాణం కాపాడిండు.. 

కరోనా రోగమస్తాంది ఎవ్వలు బయటకు రావద్దు.. పనికి పోవద్దు అంటే గుండెల బండవడ్డట్లయింది. పూట గడుసుడు, ఉప్పు, పప్పు ఎట్ల అని భయమైంది. అడుక్కు తింటే మానం పోద్ది. తినకుంటే పాణం పోద్ది. గిసోంటి టైంల మా అసోంటోళ్ల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు 12కిలోల బియ్యం, ఇప్పుడు 1500 ఇచ్చిండు. బియ్యం, పైసలిచ్చి మా పాణం కాపాడిండు. 

- అన్నమ్మ, వెల్దుర్తి, జగిత్యాల మండలం 

సారు సల్లగుండాలె

లాక్‌డౌన్‌ చేయవట్టి ఏ పనీ లేదు. అందరం ఇంట్లోనే ఉంటున్నం. మా ఇంట్ల ఉన్న నలుగురికి సర్కారు 12 కిలోల చొప్పున మొత్తం 48కిలోల బియ్యం ఇచ్చింది. ఇప్పుడు 1500 రూపాయలు సైతం ఖాతాలో వేయడం మా కుటుంబానికి ఎంతో ఆసరా అయింది. ఈ పైసలతో ఇంట్లోకి అవసరమైన సామాను కొనుక్కుంటం. పేదల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ సారు సల్లగుండాలె. మాలాంటి వాళ్లను ఎప్పుడూ ఆయన ఆదుకుంటడు.

- బొల్లి పద్మ, దుద్దనపల్లి (సైదాపూర్‌) 

కట్టగాలంల ఆదుకున్నడు..

పనులు లేక పస్తులుంటున్న ఈ కట్టగాలంల కేసీఆర్‌ సారు ఆదుకున్నడు. మనిషికి 12 కిలోల బియ్యం ఇచ్చిండు. వాటితో పాటు బ్యాంకు ఖాతాల వేయించిన రూ.1500 ఆపత్కాలంలో మంచిగ ఆసరా అయితున్నయ్‌. ఉచితంగా బియ్యంతో పాటు నగదు అందించిన సీఎం సారుకు రుణపడి ఉంటం.

- పెరుమాండ్ల ఎల్లక్క, ఇందారం (జైపూర్‌ మండలం)


బతికినంత కాలం రుణపడి ఉంటం.. 

మేం ఉన్న ఊళ్లో సైకిల్‌ రిపేరింగ్‌ దుకాణం పెట్టుకొని బతుకుతున్నం. నాలుగేళ్ల సంది పింఛన్‌ వస్తున్నది. నెల రోజుల సంది విషపురుగు సోకుతోందని ఊరోళ్లందరూ ఆగమైతుండ్రు. మా షాపు గూడ తెరవడం లేదు. బతుకుడు మత్తు కట్టమైతున్నది. ఇసోంటి కట్టగాలంల కేసీఆర్‌ సారు పెద్దకొడుకోలె ఆదుకుంటున్నడు. మాకు మొన్ననే 24 కిలోల బియ్యం ఇచ్చిండు. ఇప్పుడు పెద్ద మనసుతో మా బ్యాంకు ఖాతల 1500 ఏసిండు. ఈ పైసలతో ఉప్పు, పప్పు, కూరగాయలు కొనుక్కుంటం. ప్రాణాలు పొతున్న టైంల మమ్మల్ని ఆదుకున్న కేసీఆర్‌ సారుకు బతికినంత కాలం రుణపడి ఉంటం. 

- సూర్యమ్మ-లక్ష్మీరాజం (నారాయణపూర్‌-గంగాధర)logo