గురువారం 28 మే 2020
Karimnagar - Apr 14, 2020 , 03:24:05

గన్నీ సంచుల కొరత తీర్చండి..

గన్నీ సంచుల కొరత తీర్చండి..

  • ఇతర రాష్ర్టాల కూలీలను తెలంగాణకు వచ్చేలా చూడండి  
  • కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌కు మంత్రి గంగుల కమలాకర్‌ విజ్ఞప్తి 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణలో గన్నీ సంచుల కొరత తీవ్రంగా ఉందని, తక్షణమే రాష్ర్టానికి అవసరమైన సంచులను పంపించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌కు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ విజ్ఞప్తి చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆహార పంపిణీ విషయమై కేంద్ర మంత్రి సోమవారం సాయంత్రం అన్ని రాష్ర్టాల పౌర సరఫరాల శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరీంనగర్‌లోని ఎన్‌ఐసీ కేంద్రం నుంచి మంత్రి గంగుల హాజరయ్యారు. రాష్ట్రంలో వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించగా, బాగున్నాయని కేంద్రమంత్రి కితాబిచ్చారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ చొరవతో ఇప్పటికే ప్రతిపేదకు 12 కిలోల బియ్యం పంపిణీ చేశామనీ, రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ 1,500 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని గంగుల తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ధాన్యం కొంటున్నామని, రేషన్‌ బియ్యం కూడా పంపిణీ చేస్తున్నామని, ఈ కారణంగా గన్నీ సంచుల కొరత ఏర్పడి రేషన్‌ పంపిణీకి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని దృష్టికి తెచ్చారు. ఏటా తెలంగాణకు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి హమాలీలు వచ్చేవారని, లాక్‌డౌన్‌ కారణంగా వారు ఇక్కడికి రాలేక పోతున్నారని తెలిపారు. వారిని తెలంగాణకు వచ్చేలా చూడాలని కోరారు. ఇక్కడ గోదాంలలో ఆహార ధాన్యం నిల్వలు అన్ని నిండిపోయాయని, వీటిని వివిధ రాష్ర్టాలకు తరలించి గోదాంలను ఖాళీగా ఉండేలా చూడాలని విన్నవించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, జిల్లా రెవెన్యూ అధికారి పవన్‌కుమార్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేశ్‌, జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి గింజనూ కొంటాం..  

కరీంనగర్‌ రూరల్‌: సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. దుర్శేడ్‌లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి, 1,760 కనీస మద్దతు ధర పొందాలని సూచించారు. దుర్శేడ్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ బల్మూరి ఆనందరావు, ఎంపీపీ లక్ష్మయ్య, జడ్పీటీసీ లలిత, కరీంనగర్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, తదితరులున్నారు.  

స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలి 

లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు. కొత్తపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో కరీంనగర్‌ డెయిరీ లక్షతో సమకూర్చిన నిత్యావసరాలను 150 మంది ఆటో డ్రైవర్లు, 43 మంది మున్సిపల్‌ సిబ్బంది, ఏడుగురు ఆశ వర్కర్లకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, కమిషనర్‌ ఏ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బండ రాధ, తదితరులున్నారు.


logo