బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Apr 14, 2020 , 03:22:36

గ్రామాలను కాపాడుకోవాలి

గ్రామాలను కాపాడుకోవాలి

  • కరోనా కట్టడిలో సర్పంచులదే బాధ్యత
  • వైరస్‌ నియంత్రణలో రాష్ట్రం దేశానికే ఆదర్శం
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ది కీలకపాత్ర 
  • ప్రజల భాగస్వామ్యం అభినందనీయం
  • అధికారుల పాత్ర ప్రశంసనీయం
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌
  • ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కోటి మాస్కుల పంపిణీ
  • జేఎన్టీయూ, పొలాస క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాల పరిశీలన
  • మల్యాల, కొడిమ్యాలలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

కరీంనగర్‌ ప్రతినిధి/ జగిత్యాల ప్రతినిధి/ చొప్పదండి, నమస్తే తెలంగాణ/మల్యాల, కొడిమ్యాల : కరోనా నుంచి గ్రామాలను కాపాడుకునే బాధ్యత సర్పంచులదేనని, ప్రతిమ ఫౌండేషన్‌ అందిస్తున్న ఉచిత మాస్కులను ఆయా వర్గాలకు అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ సూచించారు. ప్రస్తుతం ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న వారికి వీటి అవసరం ఎక్కువగా ఉంటుందని, నిర్వాహకులు మాస్కులు ధరించడం వల్ల కరోనా నుంచే కాకుండా దుమ్మూ ధూళి నుంచి కూడా రక్షణ పొందవచ్చవని చెప్పారు. వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, లాక్‌డౌన్‌లో ప్రజల భాగస్వామ్యం బాగుందని ప్రశంసించారు. వైద్య, పోలీస్‌, మున్సిపల్‌ సిబ్బంది, పంచాయతీ పారిశుధ్య కార్మికులు, అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం కరీంనగర్‌ రూరల్‌ నగునూర్‌లోని ప్రతిమ మెడికల్‌ కళాశాలలో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, సుల్తానాబాద్‌, బోయినపల్లి మండలాల నుంచి వచ్చిన సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులకు మాస్కులను అందించి మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కోటి మాస్కులు ఉచితంగా పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతిమ ఫౌండేషన్‌ను, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బోయినపల్లి శ్రీనివాస్‌ను అభినందించారు. పట్టణ ప్రాంతాల్లో మాస్కులు విరివిగా లభిస్తున్నాయని, గ్రామీణులకు కూడా వీటిని అందించి వైరస్‌ను అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. కొవిడ్‌ తగ్గిపోయిందని ప్రజలు నిశ్చింతగా ఉండవద్దని, ఏడాదిపాటు జాగ్రత్తగా ఉండాలని, రోజువారీగా ధరించే దుస్తుల్లాగానే మాస్కులు ధరించాలని సూచించారు. ఎన్‌ 92, ఎన్‌ 95 మోడల్‌ మాస్కులు అయితేనే కరోనాను కట్టడి చేయవచ్చనే అభిప్రాయం ఉందని, అయితే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నిబంధనల ప్రకారం ప్రతిమ ఫౌండేషన్‌ ఈ మాస్కులు రూపొందించిందని అన్నారు. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్లతోపాటు ఆదిలాబాద్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తున్నామన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా జన్నారం మండలం బాదంపల్లిలో కూడా ఈ రోజు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్‌ను తక్కువ అంచనా వేయవద్దని, వచ్చే కొద్ది రోజులు అత్యంత కీలకమైనవిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. వినోద్‌కుమార్‌ 1918లో వచ్చిన స్పానిష్‌ వైరస్‌ గురించి వివరిస్తూ అప్పట్లో రైలు మార్గంలో ఉన్న గ్రామాల్లో ఈ వైరస్‌ విస్తరించిందని, భారత దేశంలో కోటి మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడి మరణించారని అన్నారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాగ్రత్త చర్యల కారణంగా వైరస్‌ నియంత్రణదిశగా సాగుతోందన్నారు. అనంతరం చొప్పదండిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కాలేజీ, పొలాస వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాల్లోని వసతులను పరిశీలించారు. ఈ కేంద్రాలు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని, వీటిని ఏర్పాటు చేసిన కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధూశర్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తదుపరి మల్యాలతోపాటు 19 గ్రామాల్లోని 300 మంది ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి మల్యాల ఎక్స్‌రోడ్డు చౌరస్తాలో నిత్యావసర వస్తువులను, నాచుపల్లిలో కొడిమ్యాల సింగిల్‌ విండో చైర్మెన్‌ మేన్నేని రాజనర్సింగరావు ఆధ్వర్యంలో 10 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతిమలో జరిగిన కార్యక్రమంలో ప్రతిమ మెడికల్‌ కళాశాల డీన్‌ వివేకానంద, సీఏవో రాంచందర్‌రావు, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రవీందర్‌ రావు, డాక్టర్‌ చెన్నాడి  అమిత్‌కుమార్‌, డాక్టర్‌ వికాస్‌, తదితరులు పాల్గొన్నారు. పలుచోట్ల ఆయన వెంట జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌,  రవి శంకర్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, తదితరులున్నారు. 


logo