బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Apr 14, 2020 , 03:20:56

ఖాకీల చేతికి థర్మల్‌ స్కానర్‌

ఖాకీల చేతికి థర్మల్‌ స్కానర్‌

  • కరోనా కట్టడికి కమిషనరేట్‌ పరిధిలో సరికొత్త ప్రయోగం 
  • ఇక నుంచి మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో ర్యాండమ్‌గా స్క్రీనింగ్‌ టెస్టులు 
  • ఏమాత్రం అనుమానం వచ్చినా పూర్తి వివరాల సేకరణ 
  • వైద్యాధికారులతో కలిసి దవాఖానకు తరలింపు 
  • మొదటి రోజు కమాన్‌చౌరస్తా, రాజీవ్‌చౌక్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో పరీక్షలు 

కరోనా కట్టడికి కరీంనగర్‌ కమిషనరేట్‌లో మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వైరస్‌ ఇన్నాళ్లూ వైద్య బృందాలు మాత్రమే ఉపయోగించిన థర్మల్‌ స్కానర్‌ను, ఇక నుంచి పోలీసులు వినియోగించనున్నారు. మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు, రోడ్లపై వెళ్లే వాహనదారులకు ర్యాండమ్‌గా స్క్రీనింగ్‌ చేయనున్నారు. ఏమాత్రం డౌట్‌ వచ్చినా.. వెంటనే వైద్య బృందాలతో కలిసి, సదరు వ్యక్తులను ప్రభుత్వ దవాఖానకు పంపించనున్నారు. వారి కుటుంబాల పూర్తి వివరాలను ఆరా తీయనున్నారు. ఈ ప్రక్రియతో ప్రాథమిక దశలోనే కొవిడ్‌-19 నియంత్రణకు అడ్డుకట్ట వేసే అవకాశం ఏర్పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. 

- కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

అమల్లోకి కొత్త ప్రయోగం.. 

కరీంనగరంలో కరోనా కట్టడి చేసేందుకు పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ, అదుపులోకి తెచ్చేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారు. డ్రోన్‌ కెమెరాలు, మొబైల్‌ కమాండ్‌ కం ట్రోల్‌ వాహనం.. లాంటి సహాయంతో లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. తాజాగా మరో కొత్త ప్రయోగాని కి అంకురార్పణ చేశారు. కరోనా అనుమానితులను గుర్తించేందుకు ఏడు థర్మల్‌ స్కానర్స్‌ను తెప్పించారు. ఇప్పటికే వీటిపై కొంత మంది పోలీసులకు శిక్షణ ఇచ్చారు. వాటి ద్వారా ఎదు టి వ్యక్తి శరీర ఉష్ణోగ్రతను ఎలా గుర్తించాలి? థర్మల్‌ స్కానర్‌ స్క్రీన్‌పై వచ్చే కౌంటింగ్‌ ఎలా ఉంటుంది? ఎంత ఉష్ణోగ్రత వస్తే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలి? అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఆ మేరకు ఈ ప్రయోగాన్ని సోమవారం నుంచే అమల్లోకి తీసుకొచ్చారు. మొదటి రోజు కమాన్‌చౌరస్తా, రాజీవ్‌చౌక్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో పరీక్షలు చేశారు.  

ర్యాండమ్‌గా స్క్రీనింగ్‌.. 

కరోనా నేపథ్యంలో ఒక వ్యక్తి టెంపరేచర్‌ను కొలిచేందుకు గతంలో ఉన్న పరికరాలను వాడకుండా.. థర్మల్‌ స్కానర్‌ను తెరపైకి తెచ్చారు. ముందుగా ఎయిర్‌పోర్టులు, చెక్‌పోస్టుల వద్ద ఉంచారు. ప్రస్తుతం సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌లాంటి వాటిల్లో వినియోగిస్తున్నారు. మనిషికి కొంత దూరంగా ఉండి.. స్క్రీనింగ్‌ చేయడానికి ఇది  ఉపయోగపడుతుంది. తద్వారా అవతలి వ్యక్తికి కరోనా ఉన్నా.. స్క్రీనింగ్‌ చేసే వ్యక్తికి సోకకుండా ఉంటుంది. నిజానికి వీటిని కొంత కాలంగా వైద్య బృందాలు వినియోగిస్తున్నాయి. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో వీటి తో పరీక్షలు చేస్తున్నాయి. అయితే, రద్దీ అధికంగా ఉండే కూరగాయల మార్కెట్లలాంటి ప్రాంతాల్లోకి వచ్చే వ్యక్తుల ఆరోగ్య స్థితి గతులను గుర్తించేందుకు ప్రస్తుతం వీలు పడడం లేదు. ఇలాంటి ప్రాంతాల్లో పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్లు, మాల్స్‌, రద్దీ ఎక్కువగా ఉంటే ప్రాంతాలు, రోడ్లపైకి వచ్చే జనాలకు ర్యాండమ్‌గా వీటి ద్వారా పరీక్షలు చేస్తారు. దీని ద్వారా అన్ని ప్రాంతాల్లో చెక్‌ చే సినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఏ మాత్రం అనుమానం వచ్చినా.. సదరు వ్యక్తిని ముందుగా వై ద్యాధికారుల సహాయంతో ప్రభుత్వ దవాఖానకు తరలిస్తారు. జ్వరం రావడానికి గల కారణాలు?, అతను ఎవరినైనా కలిశాడా? లేదా? విదేశాలనుంచి వచ్చిన వారిలో ఎవరితోనైనా తిరిగాడా? కుటుంబ నేపథ్యం? లాంటి పూర్తి వివరాలను తీ సుకుంటారు. సాధారణ జ్వరం అయితే పంపిస్తారు. కరోనాలాంటి లక్షణాలు ఉంటే.. సంబంధిత కుటుంబంతో ఆ ప్రాం తాన్ని అప్రమత్తం చేస్తారు. ఈ పరీక్షలు ప్రాథమిక బహుళ రకాల కట్టడికి ఉపయోగ పడుతాయని భావిస్తున్నారు. 

ప్రజలు సహకరించాలి : సీపీ కమలాసన్‌రెడ్డి 

వైద్య ఆరోగ్యశాఖాధికారుల సహాయంతో థర్మల్‌ స్కానర్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నాం. సోమవారం నుంచి వీటిని ప్రారంభించాం. ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించడంవల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్నాం. అంతేకాదు, ఏమైనా అనుమానం వస్తే సదరు వ్యక్తికి వైద్య పరీక్షలు చేయించి, ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. సదరు వ్యక్తితోపాటు వారి కుటుంబానికి, ఆ ప్రాంతంలో నివాసముండే వ్యక్తులకు మేలు చేసినట్లు అవుతుంది. థర్మల్‌ స్కానర్‌ అనేది ఉష్ణోగ్రతను మాత్రమే తెలుపుతుంది. ఇదే సమయంలో వంద డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదైతే సదరు వ్యక్తులను వెంటనే దవాఖానకు తరలించేందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అయితే పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి. ర్యాండమ్‌గా చేసే ఈ పరీక్షల ద్వారా పలు రకాల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఏమైనా అనుమానాలుంటే ప్రాథమిక దశలోనే కొంత కట్టడి చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందన్నది ఇందులోని ప్రధాన ఉద్దేశం. 


logo