బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Apr 12, 2020 , 03:09:15

కమలాకర్‌.. వెరీగుడ్‌

కమలాకర్‌.. వెరీగుడ్‌

  • కేబినెట్‌ సమావేశంలో గంగులను అభినందించిన సీఎం 
  • కరీంనగర్‌లో కరోనా కట్టడికి బాగా పనిచేశారని కితాబు 
  • కలెక్టర్‌, సీపీ, మేయర్‌, కమిషనర్‌, వైద్యాధికారులు, సిబ్బందికి అభినందలు 

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగాణ : కరీంనగర్‌లో కరోనాను కట్టడి చేయడంలో బాగా పనిచేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ మీటింగ్‌లో వివిధ అంశాలపై సమీక్షించడంతోపాటు కరోనాపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విషయం తెలిసిన వెంటనే.. యుద్ధప్రాతిపదికన కమలాకర్‌ స్పందించారని సభాముఖంగా కితాబు ఇచ్చారు. అంతేకాదు, కొంత మంది వైద్య పరీక్షలకు ముందుకు రాని సమయంలో... స్వయంగా మంత్రి సదరు కాలనీలకు వెళ్లి.. సముదాయించిన తీరు హర్షణీయమని పేర్కొన్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్న సమయంలో ఎవరైనా వెళ్లడానికి సంశయిస్తారని, కానీ, అందరినీ మెప్పించి వైద్య పరీక్షలు చేయించుకునేలా చైతన్యం చేసే విషయంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. “కమలాకర్‌.. వెరీగుడ్‌.. చాలా కీలకంగా పనిచేశారు. అధికారులతో పనులు చేయిస్తూనే ప్రజలనుంచి మంచి సహకారం తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన 150 వైద్య బృందాలను ఏర్పాటు చేసి రాపిడ్‌ ఫీవర్‌ సర్వే చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. తద్వారా కట్టడి చేయడం సాధ్యమైంది’ అంటూ అభినందించారు. ఇదేసమయంలో కరోనా కట్టడి కోసం కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌, వైద్యాధికారులు, ఇతర విభాగాల అధికారులు సమష్టిగా కృషిచేశారని వారందరికీ అభినందనలు తెలిపారు. 

రుణ పడి ఉంటాం : మంత్రి గంగుల కమలాకర్‌ 

కరోనాను కట్టడి చేసిన విషయంలో జిల్లా యంత్రాంగంతోపాటు.. తనను ముఖ్యమంత్రి సాక్షాత్తూ కేబినెట్‌ మీటింగ్‌లో ప్రత్యేకంగా అభినందించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. కట్టడి కోసం అనేక సూచనలు, సలహాలు ఇచ్చారని, వారి ఆదేశానుసారం అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేశామని, తద్వారా.. కంట్రోల్‌ చేయగలిగామని మంత్రి పేర్కొన్నారు. కరోనా నివారణ కోసం చేపట్టిన చర్యలకు ప్రజలు సంపూర్ణంగా సహకరించారని, అందుకు ప్రజలకు ప్రత్యేక అభినందలు తెలుపుతున్నట్లు ఫోన్‌ద్వారా ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. అంతేకాదు, పూర్తి స్థాయిలో నివారణ అయ్యేవరకు ప్రజల సహకారం ఇలాగే ఉండాలని కోరారు. కలెక్టర్‌, సీపీ, ఇతర అధికారులు నిర్విరామంగా కష్టపడుతున్నారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


logo