గురువారం 04 జూన్ 2020
Karimnagar - Apr 12, 2020 , 03:05:28

పోలీస్‌ వలంటీర్స్‌

పోలీస్‌ వలంటీర్స్‌

  • పోలీస్‌శాఖ పిలుపుతో కరోనా కట్టడికి కదిలిన యువతీయువకులు 
  • కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో 252 మంది సేవలు
  • ప్రజల్లో చైతన్యం పెంపు కోసం ప్రయత్నం 
  • బహుళ ప్రయోజనాలను ఇస్తున్న ప్రయోగం 

ఒకరు లెక్చరర్‌.. మరొకరు ఫిజియోథెరపిస్ట్‌.. ఇంకొకరు అడ్వొకేట్‌.. ఇలా ఎవరెవరికీ సంబంధం లేదు. కానీ, వీరందరిలో ఒక సామాజిక బాధ్యత ఉన్నది. కరోనా పేరు వింటేనే బయటకు రావడానికి జంకుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్న తపన ఉన్నది. అందుకే పోలీసులు ఇచ్చిన అవకాశంతో వలంటీర్లుగా అవతారమెత్తారు. నిత్యం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు విధులు నిర్వర్తిస్తూ, ప్రజలను చైతన్యం చేస్తున్నారు. వైరస్‌ నియంత్రణలో తమ వంతు సేవలందిస్తూ అలుపెరగకుండా శ్రమిస్తున్న పోలీస్‌శాఖ కాస్త భారం తగ్గిస్తున్నారు.

-కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

యువతకు ఆహ్వానం

గత నెల 14న ఇండోనేషియాకు చెందిన పది మంది మత ప్రచారకులు.. కరీంనగర్‌ రావడం.. వారికి కరోనా సోకడం.. దీంతో కరీంనగర్‌లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించడం తెలిసిందే. ఆ తదుపరి దేశంలో, రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో ఇతరులను గుర్తించడం.. వారిని క్వారంటైన్‌కు పంపడం.. మళ్లీ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడం వంటి కార్యక్రమాల వల్ల పోలీసులపై భారం పెరిగింది. ఈ పరిస్థితుల్లో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం నడుస్తున్న కూరగాయల మార్కెట్లు, సూపర్‌ మార్కెట్లు, మెడికల్‌ దుకాణాలు, ఇతర ప్రాంతాల్లో రద్దీని నియంత్రించి సామాజిక దూరం పాటించే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఔత్సాహిక యువతీ యువకులను భాగస్వాములను చేయాలని భావించారు. ఆ మేరకు.. కొవిడ్‌-19 నిర్మూలన, కట్టడి కోసం స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు. ఇదే ప్రకటన నగరపాలక సంస్థ సైతం చేసింది. దీంతో 252 మందికి పైగా యువతీ యువకులు స్వచ్ఛందంగా సేవలందించడానికి ముందుకొచ్చారు. 

ప్రణాళికాబద్ధంగా సేవలు.. 

స్వచ్ఛందంగా సేవలందించడానికి ముందుకొచ్చిన వలంటీర్లకు ముందుగా ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కరోనా కట్టడికి అనుసరించాల్సిన నియమ నిబంధనలు ఏమిటి?, కూరగాయల మార్కెట్లు, సూపర్‌ మార్కెట్లు, మెడికల్‌ షాపులు, పార్కింగ్‌ స్థలాల వద్ద వాహనాల క్రమబద్ధీకరణ, ఇతర వ్యాపార ప్రాంతాల్లోకి వచ్చే ప్రజలను ఎలా కట్టడి చేయాలి?, వారికి ఇవ్వాల్సిన సూచనలు, సలహాలు ఏమిటి?, సామాజిక దూరం పాటించేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. శిక్షణ పొందిన వలంటీర్లకు ఒక ఐడీ కార్డు, విజిల్‌, టీషర్టులను అందించారు. లాక్‌డౌన్‌ పూర్తయిన తదుపరి వారి సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను ఇస్తామని చెప్పారు. ఆ మేరకు నగరంలోని వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లకు వలంటీర్లను కేటాయించారు. సంబంధిత ఠాణా పోలీసులు ప్రతి రోజూ వలంటీర్లకు వేర్వేరు ప్రాంతాల్లో డ్యూటీలు కేటాయిస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అంటే నాలుగు గంటల పాటు వలంటీర్లు విధులు నిర్వహించి వెళ్లిపోతారు. స్వచ్ఛందంగా విధులు నిర్వహించే వలంటీర్లకు అల్పాహారాన్ని పోలీసులు ఉదయం సమకూర్చుతున్నారు. 

బహుళ ప్రయోజనాలు 

ఈ నెల 2 నుంచి అమలవుతున్న వలంటీర్ల సేవలతో ఇటు ప్రజలకు, అటు పోలీసులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. సేవలందించాలన్న లక్ష్యంతో వచ్చిన వలంటీర్లు వారికి కేటాయించిన ప్రాంతాల్లో దాదాపు పోలీసులకు సరిసమానంగా సేవలందిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వచ్చే ప్రజలు.. సామాజిక దూరం పాటించడం. క్యూ పద్ధతిలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం.. కచ్చితంగా మాస్కులు, ఖర్చీఫ్‌లు ధరించేలా చూడడం.. మార్కెట్‌కు వచ్చిన వాహనాలను ఒక క్రమపద్ధతిలో పార్కింగ్‌ చేయించడం, వీటికి మించి కరోనా కట్టడి కోసం ఇంటితో పాటు బయటకు వెళ్లినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం.. ద్విచక్రవాహనంపై ఇద్దరు ప్రయాణించ డాన్ని నిరోధించడం వంటి కార్యక్రమాలను చేస్తున్నారు.  ఎక్కడైనా వలంటీర్ల చేతులు దాటే పరిస్థితి వస్తే పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. వీరి సేవల వల్ల పోలీసులకు కొంత భారం తగ్గుతున్నది. ఇతర పనులపై దృష్టి పెట్టే సమయం దొరకుతున్నది. ప్రస్తుతం అందుతున్న వలంటీర్ల సేవలను భవిష్యత్‌లో ఏదేని అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చన్న భరోసా  ఏర్పడింది. 

సేవలు అద్భుతం 

కరోనా కట్టడిలో ప్రజలను భాగస్వాములను చేయాలన్న ఆలోచనతో వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించాం. మేం ఊహించిన దానికన్నా చాలా మంది ఔత్సాహిక యువతీ, యువకులు సేవలందించడానికి ముందుకొచ్చారు. అంటే.. విపత్కర పరిస్థితుల్లో మన యువత స్వచ్ఛందంగా ప్రభుత్వం, అధికారులతో కలిసి సేవలందించడానికి ముందుకొస్తారని చెప్పడానికి ప్రస్తుతం వలంటీర్ల పనితీరు ఒక నిదర్శనం. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ప్రతి వలంటీర్‌కు ప్రత్యేక అభినందనలు. నిజానికి మేం అనుకున్న దానికన్నా సేవలు బాగా చేస్తున్నారు. వలంటీర్ల అందిస్తున్న సేవలపై ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది.

- వీబీ కమలాసన్‌రెడ్డి, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సీపీ 

గర్వంగా ఉంది 

కొవిడ్‌-19 నిర్మూలన కోసం ప్రజలకు సేవలందించే అవకాశం రావడం గర్వంగా ఉంది. నిత్యం నాలుగు గంటల పాటు సేవలందిస్తున్న నేను ఎన్నో అనుభవాలు నేర్చుకుంటున్నా. ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నా చాలా మందికి సామజిక దూరం పాటించాలనే అవగాహన రాలేదు. ఇటువంటి వారిని గుర్తించి వారికి అవగాహన కల్పిస్తున్నాం. విషయాన్ని అర్థం చేసుకుంటున్న ప్రజలు మాకు పరిపూర్ణంగా సహకరిస్తున్నారు.   

 - కొత్తకొండ అనిల్‌కుమార్‌, అడ్వొకేట్‌ 


నాపేరు మౌనిక.. నేను కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నా. ప్రస్తుతం సెలవులున్నాయి. పోలీసులు ఇచ్చిన పిలుపు మేరకు.. నావంతు బాధ్యతను పోషించాలని భావించా. స్వచ్ఛంద కార్యకర్తగా నిత్యం పోలీసులు అలాట్‌ చేసిన ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్నా. నాతోపాటు నా భర్త కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం.. చాలా అంశాల మీద ప్రచారం చేస్తున్నా. కొంత మందికి ఇంకా సామాజిక దూరం అంటే అర్థం కావడం లేదు. కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన లేదు. ఇటువంటి వారికి మార్కెట్‌, లేదా ఇతర ప్రాంతాల వద్ద అవగాహన కల్పిస్తున్నాం. దండం పెట్టి చెబుతున్నాం. ఇది ఒక సామాజిక బాధ్యతగా చేస్తున్నా. పోలీసుల కష్టాలను, కరోనా కట్టడికి ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరిస్తున్నా. 

     నా పేరు సాయి మౌనిక. నేను ఫిజియో థెరపిస్టును. పది మందికి సేవచేయాలనే భావన నాది. కరీంనగర్‌లో కరోనా అలజడి సృష్టించిన సమయంలో.. ఎలాగైనా ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నా. ఇలా పోలీసు శాఖ అవకాశం కల్పించింది. నిత్యం వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛంద కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నా. పోలీసులు ఎంతగా కష్టపడుతున్నారో కళ్లారా చూస్తున్నా. అందుకే వారి బాధ్యతల్లో నేను పాలు పంచుకుంటూనే.. ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్న తీరు సంతృప్తినిస్తున్నది. విపత్కర పరిస్థితుల్లో యువత సేవలదించాలన్న స్ఫూర్తి నా ద్వారా కొంత మందిలోనైనా వస్తుందని భావిస్తున్నా.  

      నా పేరు అమృతవర్షిణి. బీటెక్‌, ఎంబీఏ పూర్తి చేశా. అమెరికాలో సెటిల్‌ అయ్యాను. నేను కొద్ది రోజుల క్రితం కరీంనగర్‌లోని మా మమ్మీ దగ్గరికి వచ్చా. విదేశాలకు వెళ్లే విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. కొవిడ్‌-19 కట్టడిలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పోలీసులు ఇచ్చిన పిలుపు మేరకు.. ఎనిమిది రోజులుగా నా సోదరి అమూల్యతో కలిసి కార్యకర్తగా పని చేస్తున్నా. పోలీసు అధికారులు కేటాయించిన ప్రాంతాలు కూరగాయల మార్కెట్లు, సూపర్‌ మార్కెట్ల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా చైతన్యవంతుల్ని చేస్తున్నా. చేతులు శుభ్రం చేసుకోవడం గురించి వివరిస్తున్నా. ఒక విద్యావంతురాలిగా.. ఈ సేవలో నావంతు బాధ్యత నిర్వహిస్తున్న తీరు సంతృప్తినిస్తున్నది. పోలీసుల బాధ్యతల్లో భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉన్నది.logo