శనివారం 06 జూన్ 2020
Karimnagar - Apr 09, 2020 , 02:57:44

కోట్ల ఆస్తిపై నజర్‌

కోట్ల ఆస్తిపై నజర్‌

  • మాదంటే మాదంటూ ఇరువర్గాల ఫిర్యాదులు 
  • భూ అక్రమణ చట్టం కింద కేసు నమోదు nపోలీసుల సీరియస్‌

కరీంనగర్‌ ప్రధానప్రతినిధి,నమస్తే తెలంగాణ: బొమ్మకల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని కరీంనగర్‌ బైపాస్‌ రోడ్డును అనుకొని ఉన్న రూ. కోట్లు విలువజేసే అస్తి ప్రస్తుతం వివాదానికి కేంద్రబిందువుగా మారుతున్నది. ఆ భూమి మాదంటే మా దంటూ ఇరువర్గాలు కరీంనగర రూరల్‌ పోలీసుస్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ మేరకు ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఈ విషయాన్ని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అంతేకాదు, లౌక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో సదరు స్థలం వద్ద కార్మికులతో పనులు చేయించిన విషయంతో పాటు గా.. ఆ భూమి వివాదం తెరవెనక పలువురి మాఫియా హస్తం ఉందన్న ఫిర్యాదులు వెల్లువెత్తుండడంతో పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. 

పరస్పర ఫిర్యాదులు..

బొమ్మకల్‌ శివారులోని సర్వే నంబర్‌ 724/డీలోని 4.20ఎకరాల భూమిని కొంతమంది దౌర్జన్యంగా అక్రమిస్తున్నారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 3న మాజీ ఎమ్మెల్యే నలుమాచు కొండయ్య కూతురు అంజని  కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే నలుమాచు కొండయ్యకు బొమ్మకల్‌ గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 724/డిలో 4.20 ఎకరాల భూమి ఉందని, 2009లో తమ తండ్రి కొండయ్య మరణించిన తదుపరి కూతుళ్లమైన తాను, తన చెల్లి జ్యోతి కబ్జాలో భూమి ఉన్నదని వివరించింది. అయితే ఆ సర్వే నంబర్‌కు అనుకొని ఉన్న మరో సర్వే నం బర్‌కు చెందిన కొందరు తమ భూమిని ఆక్రమించుకుంటున్నారంటూ ఫిర్యాదు చేశారు. సదరు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు పోలీసులు కొంత మందిపై కేసు నమోదు చేశారు. ఆ తదుపరి సదరు ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. మాజీ ఎమ్మె ల్యే కూతురు ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా అవాస్తవమని, సదరు వ్యక్తులు కొంత మందితో కలిసి తమ భూమినే అక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మహ్మద్‌ అబ్దుల్‌ ఫజల్‌ జుల్ఫుకర్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశా రు. బొమ్మకల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని 723 సర్వే నంబర్‌లోని ఆరెకరాలు, 724-సీసర్వే నంబర్‌లోని ఎకరం భూమి మొత్తం ఏడెకరాల భూమి 1975 నుంచి తమ కుటుంబం ఆధీనంలో ఉందని జుల్ఫుకర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం యాకుబ్‌ ఖాన్‌, దావూద్‌ ఖాన్‌, మహబూబ్‌ఖాన్‌ల పేరిట ఉన్న ఆ ఏడెకరాల భూమికి సంబంధించి పంటలు పండించుకోవడంతోపాటు రైతుబంధు, ప్రధా ని కిసాన్‌ యోజన కింద ఆర్థిక సహాయం పొం దుతున్నట్లుగా వివరించాడు. ఆ స్థలానికి సం బంధించి 1975లోనే కోర్టు డిక్రీ ఇచ్చిందని అప్పటి నుంచి 45 ఏళ్లుగా తామే ఆ భూమి కబ్జాలో ఉన్నామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే లౌక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో కొంత మంది వ్యక్తులు ఆ భూమిని అక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఈ వ్యవహారం వెనుక భూ మాఫియా దాగి ఉంటూ ఇరువురు పరస్పరం ఫిర్యాదు చేశారు. జుల్ఫుకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కరీంనగర్‌ రూరల్‌ సీఐ తుల శ్రీనివాసరావు ఐదుగురిపై భూ అక్రమణ చట్టం 1982 సెక్షన్‌ 5 (ఎ)తో పాటుగా ఐపీసీ 447, 427, 506, రెడ్‌ విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతకు ముందు సోమవారం మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఈనెల 3న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిదిపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ తెలిపారు. ఈ వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆ భూమి విషయంలో తేలాల్సిం ది మాఫియా ఎవరన్నది.. గత కొంత కాలంగా భూ మాఫియాపై సీపీ కమలాసన్‌రెడ్డి ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు లోతుగా విచారణ చేస్తే వాస్తవాలు బయ ట పడే అవకాశాలున్నాయి. 


logo