బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Apr 09, 2020 , 02:52:46

కరోనా అనుమానామా.. ఫోన్‌ చేయండి!

కరోనా అనుమానామా.. ఫోన్‌ చేయండి!

దగ్గు, జలుబు, జ్వర పీడితుల కోసం.. 8331865100  

మానసిక రోగుల చికిత్స కోసం.. 18004254731 
 • ప్రజల భయాందోళనలు తొలగించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
 • కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో అందుబాటులోకి ‘టెలీమెడిసిన్‌', ‘భరోసా చేయూత’ కేంద్రాలు 
 • డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు
 • ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు
 • ఆడియో లేదా వీడియోకాల్‌ ద్వారా వైద్యనిపుణుల సలహాలు, సూచనలు 
 • మొదటి రోజు 27 మందికి వైద్య సాయం
 • సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్‌ శశాంక 

మీ ఇంట్లో ఎవరైనా దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతోంటే హైరానా పడకండి.. దవాఖానలు లేవని ఆందోళన చెందకండి.. కరోనా కావచ్చేమోనని అనవసరంగా భయపడకండి.. ఎందుకంటే, అది సీజన్‌ వల్ల వచ్చిన వ్యాధో లేక మరేంటిదో ఇంట్లోనే ఉండి తెలుసుకోండి. అందుకోసమే జిల్లా యంత్రాంగం తాజాగా టెలీమెడిసన్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒక్క ఫోన్‌, వాట్సాప్‌ కాల్‌చేస్తే.. వైద్య నిపుణులతో మీ లక్షణాలను పరిశీలించి వైద్య సలహాలు, సూచనలను అందించనున్నది. ఇదే కాదు, మద్యం, సిగరేట్‌, గుట్కా, పాన్‌పరాగ్‌ లాంటివి దొరక్క విచిత్రంగా ప్రవర్తిస్తున్న వారికి సైతం బాసటగా నిలిచేందుకు చేయూత (సైక్రియాటిక్‌ హెల్ప్‌లైన్‌) కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కరీంనగర్‌ హెల్త్‌: ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లౌక్‌డౌన్‌ కొనసాగుతున్నది. దవాఖానలన్నీ బంద్‌ ఉన్నాయి. మెజార్టీ ప్రైవేట్‌ డాక్టర్లు ఓపీ కూ డా చూడడం లేదు. మరోవైపు ప్రజలను కొవిడ్‌ భయం వెంటాడుతున్నది. ఏ ఇంట్లోనైనా దగ్గు, జలుబు, జ్వరం వంటివి వస్తే చాలు, కంగారు పడిపోయి హాస్పిటళ్లకు తీసుకెళ్లాలని హైరానా పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొంత మంది మెడికల్‌ షాపులకు వెళ్లి నేరుగా మందులు తెచ్చి వాడుతున్నారు. ఇటువంటి ఇబ్బందులను తొలగించి, నిపుణులైన వైద్యులతో సూచనలు, సలహాలు అందించేందుకు వీలుగా కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ శంశాక టెలీమెడిసన్‌, చేయూత కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు.

టెలీమెడిసిన్‌, భరోసా చేయూత కేంద్రాలు ప్రారంభం..

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో టెలీ మెడిసిన్‌ సెంటర్‌, మానసిక రోగుల చికిత్స కోసం భరోసా చేయూత కేంద్రాన్ని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, కమిషనర్‌ క్రాంతి, వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాతతో కలిసి కలెక్టర్‌ శశాంక ప్రారంభించారు. మొదటి రోజు టెలీమెడిసిన్‌ ద్వారా 17 మంది, చేయూత కేంద్రం ద్వారా 10 మంది వైద్య సహాయం పొందినట్లు తెలిపారు. జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు వసంత్‌రావు, రాష్ట్ర ఈసీ సభ్యుడు జగన్‌మోహన్‌రావు, బీఎన్‌ రావు, డీసీ తిరుపతి, సీనియర్‌ సైక్రియాటిస్ట్‌, డీటీసీవో కేవీ రవీందర్‌రెడ్డి, రమాదేవి, కల్యాణ్‌ సుమన్‌ ఉన్నారు. 

భరోసా చేయూత కేంద్రం.. (సైకియాట్రిక్‌ హెల్ప్‌లైన్‌) 

 • ఎక్కడ : ఇది కూడా వైద్య,ఆరోగ్యశాఖ కార్యాలయంలోనే ఏర్పాటు  
 • పనిచేసే సమయం : ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలవరకు.. 
 • ఎవరు వినియోగించుకోవచ్చు: వ్యసనాలకు బానిసలై మానసిక రుగ్మతలకు లోనవుతున్నవారు. ఉదాహరణకు మద్యం, పాన్‌పరాగ్‌, గుట్కా వంటి మత్తు పదార్థాలు అలవాటున్న వారు, అవి దొరకని సమయంలో కొంత మంది విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కొంత మంది మానసిక ఒత్తిడికి లోనై ఇబ్బంది పడతారు. కొంత మంది కరోనా భయంతో తమకు ఎదో జరిగిపోతుందనే భయంతో ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి వారంతా ఫోన్‌ చేయవచ్చు. 
 • ఎలా సంప్రదించాలి : 18004254731 ఈ నెంబర్‌కు నేరుగా ఫోన్‌ చేస్తే, వైద్యులు తగు సూచలు, సలహాలు అందజేస్తారు. అవసరమైతే కేంద్రంలో ఉండే వైద్యులే కాకుండా ఇతర మానసిక వైద్య నిపుణులకు కాన్ఫరెన్స్‌ కలిపి ఫోన్‌ ద్వారానే కౌన్సెలింగ్‌ ఇస్తారు. 
 • అందుబాటులో ఉండే మానసిక వైద్య నిపుణులు: ప్రవీణ్‌కుమార్‌, సంజయ్‌కుమార్‌, వర్షీ, పృథ్వీరెడ్డి, ప్రీతి, శివకుమార్‌ ఉం టారు. మున్ముందు మరికొంత మంది వైద్యులు సైతం సేవలందించేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. 
 • ప్రయోజనాలు : లౌక్‌డౌన్‌తో అన్నీ బంద్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మత్తు పదార్థాలు ఎక్కడా దొరకడం లేదు. వాటికి బానిసైన చాలా మంది విచిత్రంగా ప్రవరిస్తున్నారు. వారిని ఏ దవాఖానకు తీసుకెళ్లాలో తెలియక కుటుంబసభ్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో భరోసా చేయూత కేంద్రానికి కాల్‌ చేస్తే, రోగి మానసిక ప్రవర్తనను బట్టి వైద్య సలహాలు, సూచనలు అందిస్తారు. అవసరమైతే ఏ దవాఖానకు తీసుకెళ్లాలో.. ఎవరిని కలువాలో.. వివరిస్తారు. ఇంకా అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. 

సేవలు వినియోగించుకోవాలి.. 

కరోనా కట్టడితోపాటు ప్రజలకు వైద్య సలహాలు, సూచనలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఈ రెండు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఎటువంటి సమస్యకైనా ముందుగా సరైన వైద్య నిర్దారణ సూచనలు అవసరం. రోగి, సదరు కుటుంబాలకు సకాలంలో సలహాలు అందితే.. వారు అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ప్రజలెవరూ ఆందోళన చెందకుండా ఈ సేవలను వినియోగించకోవాలి. కేంద్రాల నిర్వహణకు సహకరిస్తున్న ప్రైవేట్‌ వైద్యులకు అభినందనలు తెలుపుతున్నాం. వైరస్‌ నియంత్రణకు కలిసికట్టుగా పోరాడడమే కాదు, సమష్టి సహకారం కూడా అవసరమే.

- కే శశాంక, కరీంనగర్‌ కలెక్టర్‌

టెలీమెడిసన్‌ కేంద్రం.. 

 • ఎక్కడ : జిల్లా కేంద్రంలోని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు  
 • పని వేళలు : ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు.. 
 • ఎవరు వినియోగించుకోవచ్చు : దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, కరోనా లక్షణాలు, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. 
 • ఎలా సంప్రదించాలి : 8331865100ను ప్రత్యేకంగా కేటాయించారు. సంబంధిత కుటుంబ సభ్యులు లేదా బాధితులు ఈ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. వ్యాధి లక్షణాలను గమనించే విధంగా ఉండడానికి వాట్సాప్‌ కాల్‌ చేయవచ్చు. మీ వివరాలు పంపి, సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. 
 • అందుబాటులో ఉండే ఫిజీషియన్లు : రమాదేవి, కల్యాణ్‌ సుమన్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నుంచి శేషశైలజ, సురేశ్‌, వెంకటరెడ్డి, అజయ్‌ ఖండల్‌, తిరుపతిరావు సేవలందిస్తారు. వీరితోపాటు మరికొంత మంది వైద్యులు సైతం సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఆయా వైద్యులు వారికి కేటాయించిన సమయాన్ని బట్టి ఉంటారు. ఒక వేళ ఎవరైనా వైద్యులు కాల్‌ సెంటర్‌లో అందుబాటులో లేకపోతే.. కాన్ఫరెన్స్‌ కలిపి రోగికి సూచనలు, సలహాలు అందేలా చూస్తారు. 
 • ప్రయోజనాలు : మీరు ఇంటి నుంచి బయటకు రాకుండానే వైద్య సూచనలు, సలహాలు పొందవచ్చు. మీరు వైద్యులకు ఇచ్చే సమాచారాన్ని బట్టి.. సదరు వ్యక్తికి కరోనా లక్షణాలున్నాయో? లేదో? తెలుసుకోవచ్చు. అంతేకాదు, రోగి వివరాలను బట్టి తక్షణం వైద్య సలహాలు తీసుకోవచ్చు. ఒక వేళ కొవిడ్‌ లక్షణాలుంటే.. సదరు వ్యక్తులు వెంటనే ఏ దవాఖానకు వెళ్లాలో.. ఎవరిని కలువాలో.. వివరిస్తారు. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు వంటివి అయితే ఏ మందులు వాడాలో సూచిస్తారు. అడ్మిట్‌ కావాల్సిన పరిస్థితి ఉంటే ఆ వివరాలు చెబుతారు. 


logo