బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Mar 28, 2020 , 02:33:41

ప్రజలెవరూ బయటకు రావద్దు

ప్రజలెవరూ బయటకు రావద్దు

  • నియంత్రణ చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
  • లాక్‌డౌన్‌ను స్వచ్ఛందంగా పాటించాలి
  • గల్ఫ్‌ నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలి
  • నియోజకవర్గంలో ఒక్క పాజిటివ్‌ కేసు లేదు
  • వదంతులు నమ్మద్దు
  • ‘నవోదయ’లో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు
  • ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  • వైద్యాధికారులు, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బందితో సమీక్ష

చొప్పదండి, నమస్తే తెలంగాణ: ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న కరోనా నివారణ చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అత్యవసరమైతే తప్ప మిగితా సమయాల్లో ప్రజలెవరూ గడప దాటిరావద్దని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ విజ్ఞప్తి చేశారు. చొప్పదండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం చొప్పదండి వైద్యాధికారు లు, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వైరస్‌ నివారణ జాగ్రత్తలు, లాక్‌డౌన్‌ అమలుపై తీసుకుంటు న్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని, కరోనాపై చేస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. 473 మంది గల్ఫ్‌ దేశాల నుంచి నియోజకవర్గానికి వచ్చారని, వారందరిని హోం క్వారంటైన్‌ చేశామని తెలిపారు. ఎవరైనా బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని, ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే సమయంలో సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా నవోదయ విద్యాలయం లో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేస్తున్నామని, 12 గదులలో 168 మందికి పరీక్షలు చేయవచ్చని తెలిపారు. అనంతరం స్థానిక పీహెచ్‌సీని సందర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలని సిబ్బందికి సూచించారు. ఆ తర్వాత రాష్ట్ర రహదారిపై లాక్‌డౌన్‌ అమలును పరిశీలించి, వాహనదారులకు అవగాహన కల్పించారు. వైరస్‌ నియంత్రణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట మున్సిపల్‌ అధ్యక్షురాలు గుర్రం నీరజ, సింగిల్‌ విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, వైద్యాధికారి అనిత, సీఐ రమేశ్‌, ఎస్‌ఐ చేరాలు, డిప్యూటీ తాసిల్దార్‌ విష్ణువర్ధన్‌, ఆర్‌ఐ సంతోష్‌ ఉన్నారు.


logo