సోమవారం 25 మే 2020
Karimnagar - Mar 23, 2020 , 01:47:11

జయహో జనతా

జయహో జనతా

  • జిల్లాలో కర్ఫ్యూ విజయవంతం
  • ఉదయం నుంచే నిర్మానుష్యంగా కరీం‘నగరం’
  • పల్లెల్లోనూ అదే వాతావరణం
  • పోలీసులు తప్ప రోడ్లపై కనిపించని జనం
  • ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌  పిలుపునకు విశేష స్పందన
  • స్వచ్ఛందంగా పాల్గొన్న జిల్లాప్రజలు
  • సాయంత్రం వేళ వైద్య ఆరోగ్య సిబ్బందికి సంఘీభావ సంకేతంగా చప్పట్లు 
  • స్వీయ నిర్బంధంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
  • ఇళ్లలోనే మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌..
  • నగరంలో పర్యవేక్షించిన కలెక్టర్‌, సీపీ

వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే నగర ప్రధాన దారులు ఆదివారం బోసిబోయాయి.. బస్టాండ్‌ ఏరియా, టవర్‌సర్కిల్‌, తెలంగాణచౌక్‌, కోర్టు చౌరస్తా, డాక్టర్స్‌ స్ట్రీట్‌ ఇలా అన్ని ప్రాంతాలూ వెలవెలబోయాయి.. దవాఖానలు, మెడికల్‌షాపులు, మార్కెట్లు, వ్యాపారసముదాయాలు అన్నీ మూతపడ్డాయి.. మండల కేంద్రాలు, పల్లెల్లోనూ అవే దృశ్యాలు కనిపించాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునివ్వగా, జిల్లా ప్రజానీకం స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమైంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నిర్మానుష్య వాతావరణం నెలకొనగా, జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. సాయంత్రం వేళ ప్రజలు ఇంటి ముంగిళ్లలో నిలబడి వైద్య ఆరోగ్య సిబ్బందికి సంఘీభావ సంకేతంగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తమ ఇళ్లలోనే కుటుంబసభ్యులతో గడిపారు. కలెక్టర్‌ కే శశాంక, సీపీ కమలాసన్‌ రెడ్డి నగరంలో పర్యటించి కర్ఫ్యూను పర్యవేక్షించారు.  

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేశారు. సోమవారం ఉదయం నుంచే కరీంనగర్‌లో ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలను మూసివేశాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రముఖ వ్యాపార కూడలి టవర్‌సర్కిల్‌ బోసిబోయింది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు లేక ప్రధాన బస్టేషన్‌ వెలవెలబోయింది. నగరంలోని ఏ ప్రాంతం చూసినా నిర్మానుష్యంగా కనిపించింది. అక్కడక్కడా విధులు నిర్వహించిన పోలీసులు మినహా సాధారణ జనం కనిపించ లేదు. కలెక్టర్‌ కే శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు, పోలీసులకు పలు సూచనలు చేశారు. రాజీవ్‌ రహదారి బైపాస్‌ నుంచి అడపాదడపా వచ్చిన వాహనాలను పోలీసులు అడ్డుకుని నగరంలోకి ప్రవేశించనీయ లేదు.

మిగతా చోట్లా స్వచ్ఛంద బంద్‌..

మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ నిర్మానుష్య వాతవారణమే కనిపించింది. ఎక్కడా చూసినా జనసంచారం కనిపించలేదు. కొత్తపల్లిలో వస్త్ర దుకాణాలన్నీ మూతపడ్డాయి. నిత్యం కిటకిటలాడే సంఘం చౌరస్తా, అంగడి బజారు బోసిబోయాయి. హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి పట్టణాలు, మండలాల్లో వ్యాపార సంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. హైవేను ఆనుకొని ఉన్న తిమ్మాపూర్‌ కూడా బోసిబోయింది. రాజీవ్‌ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ దారిని ఆనుకుని ఉన్న గన్నేరువరం మండలం గుండ్లపల్లి, తిమ్మాపూర్‌ మండలం రేణికుంట, కొత్తపల్లి, నుస్తులాపూర్‌, తిమ్మాపూర్‌, అల్గునూర్‌లో ఎక్కడ చూసినా వాహనాలు కనిపించ లేదు. రహదారిపై పోలీసుల పహారా కొనసాగింది. ఇక వరంగల్‌ ప్రధాన రహదారిపై ఉన్న మానకొండూర్‌, శంకరపట్నం, హుజూరాబాద్‌ మండలాల పరిధిలోనూ వాహనాలు కనిపించ లేదు.

మారుమోగిన చప్పట్లు.. 

కరోనా వైరస్‌ సోకిన వారిని రక్షించేందుకు సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, వివిధ శాఖల ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు సంఘీభావం తెలపాలని ప్రధాని, సీఎం పిలుపు మేరకు జిల్లాప్రజలు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టారు. ఎవరి ఇండ్లలో వారు ఉండి కొందరు, మరి కొందరు వీధుల్లోకి వచ్చి, ఇంకొందరు గ్రామాల్లోని చౌరస్తాలు, ప్రధాన కూడళ్లల్లోకి వచ్చి చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. 

స్వీయ నిర్బంధంలో మంత్రి గంగుల..

నగరంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు అధికారులతో కలిసి శ్రమిస్తున్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ ఆదివారం తన ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపారు. భార్యా పిల్లలలో కలిసి టీవీ చూశారు. సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. ఇటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి చొప్పదండిలోని క్యాంపు కార్యాలయంలో గడిపారు. సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

ప్రజలకు సీపీ అభినందనలు

కరీంనగర్‌ క్రైం: జనతా కర్ఫ్యూకు సానుకూలంగా స్పందించి, స్వీయ నిర్బంధంలో ఉండడం అభినదంనీయమని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన కమిషనరేట్‌ వ్యాప్తంగా ఆదివారం ఏర్పాటు చేసిన బందోబస్తును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు సైతం జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వీయ నిర్బంధంలో ఉండి కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో తమవంతు బాధ్యతను నిర్వర్తించడం చైతన్యానికి నిదర్శనమన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. అత్యంత అవసరమైన విధులు కొనసాగిస్తున్న పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, వైద్య శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలియజేసేందుకు సాయంత్రం అన్ని వర్గాల ప్రజలు స్వీయ నిర్బంధంలోనే ఉంటూ బాల్కని, అపార్టుమెంట్లపైకి వచ్చి చప్పట్లు కొట్టడం అభినందనీయమన్నారు. 


logo