మంగళవారం 07 జూలై 2020
Karimnagar - Mar 22, 2020 , 03:23:48

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

  • మూడో రోజూ 51,114 మందికి స్క్రీనింగ్‌ టెస్టులు 
  • గడిచిన మూడు రోజుల్లో 1,27,245 మందికి.. ముమ్మరంగా పారిశుధ్య పనులు 
  • ప్రభుత్వ దవాఖానలో కొత్తగా వంద పడకల ఐసోలేషన్‌వార్డు 
  • అనుమానాల నివృత్తి కోసం కొత్తగా హెల్ప్‌ డెస్క్‌  7893024375 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచన

కరోనా కట్టడికి కరీం‘నగరం’లో నివారణ చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా నడుస్తున్నాయి. శనివారం ఆధునిక యంత్రాలతో స్ప్రే చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ప్రభుత్వ దవాఖానలో కొత్తగా వంద పడకల ఐసోలేషన్‌ వార్డును అందుబాటులోకి తేవడంతోపాటు హెల్ప్‌ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేశారు. అనుమానితుల రక్తనమూనాలు ఇక్కడే సేకరించి, గాంధీ దవాఖానకు పంపించి, 24 గంటల్లో రిపోర్టు తెప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటు యథావిధిగా వంద వైద్య బృందాలు పర్యటించాయి. ఈ ఒక్కరోజే 13,863 గృహాల్లోని 51,114 మందికి స్క్రీనింగ్‌ టెస్టులు చేశాయి.

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కరీంనగర్‌ హెల్త్‌ : కరోనాపై ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నది. ఈ మేరకు అందిన ఆదేశాలతో జిల్లాయంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన పది మందికి కరోనా సోకినట్లు తేలడంతో నివారణ చర్యలు చేపడుతున్నది. ఎప్పటికప్పుడు అనుమానితులను గుర్తించి, పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సేవలను మరింతగా పెంచుతున్నారు. ప్రభుత్వ దవాఖానలో ఇప్పటి వరకు 20 బెడ్‌లతో ఐసోలేషన్‌ వార్డు ఉండగా, శనివారం నుంచి వంద పడకలతో అందుబాటులోకి తెచ్చారు. ఇదే సమయంలో ఇక్కడే హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోవడంతోపాటు అందుకు తగిన ప్రాథమిక పరీక్షలు చేసే సౌకర్యం కల్పించారు. ఇందులో భాగంగా ట్రై ఏజీ వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇందులో వ్యాధి ఏస్టేజీలో ఉందో ముందుగా తెలుసుకునే వీలు కల్పించారు. ఐసోలేషన్‌ వార్డుతోపాటు ఐసోలేషన్‌ ఐసీయూ, నాలుగు వెంటిలేటర్లు కూడా సిద్ధంగా ఉంచారు. హెల్ప్‌ డెస్క్‌కు ప్రత్యేకంగా 7893024375 నంబర్‌ కేటాయించారు. ఏమైనా అనుమానాటుంటే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు. ఈ వార్డు మొత్తం ప్రభుత్వ దవాఖానలోని రెండో అంతస్థులో ఏర్పాటు చేశారు. రక్తనమూనాలను ఇక్కడే సేకరించి.. గాంధీ దవాఖానకు పంపిస్తున్నారు. 24 గంటల్లో రిపోర్టు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఐసోలేషన్‌ వార్డులో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. 

కొనసాగుతున్న స్క్రీనింగ్‌ టెస్టులు.. 

మరోవైపు నగరంలో స్క్రీనింగ్‌ టెస్టులు జరుగుతున్నాయి. శనివారం కూడా వంద వైద్య బృందాలు పలు ప్రాంతాల్లో పర్యటించాయి. ఆ మేరకు 13,863 ఇండ్లలోని 51,114 మందికి పరీక్షలు చేశాయి. ఆరోగ్య స్థితిగతులపై పూర్తిగా ఆరా తీశాయి. అనుమానం ఉన్న కొంత మందిని దవాఖానకు తరలించాయి. మరోవైపు పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేయి మందితో శానిటేషన్‌ కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తగా హైపో క్లోరైడ్‌ స్ప్రే చేసేందుకు రెండు ట్రాక్టర్లను వినియోగించారు. మరిన్ని ట్రాక్టర్లను సిద్ధంగా ఉంచారు. 

1,27,245 మందికి స్క్రీనింగ్‌ టెస్టులు : మంత్రి గంగుల

గడిచిన మూడు రోజుల్లో 33,435 గృహాల్లో మొత్తం 1,27,245 మందిని స్క్రీనింగ్‌ చేశారని, ప్రాథమిక అంచనాల ప్రకారం ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడో రోజు స్క్రీనింగ్‌లో భాగంగా కొంత మంది అనుమానుతులను మాత్రం హోం క్వారంటైన్‌ చేశామని చెప్పారు. ఇండోనేషియా వాసులతో సన్నిహితంగా మెదిలినట్లు శనివారం గుర్తించిన వారిలో 37 మంది అనుమానితులు ఉన్నారని, వీరందరి రక్త నమూనాలు కరీంనగర్‌లోనే సేకరించి గాంధీ దవాఖానకు పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ తర్వాత మన వైద్యులే మొదటిసారిగా ఈ రక్తనమూనాలు సేకరించారని, ఇది సాహసోపేతమైన చర్య అని పేర్కొన్నారు. ప్రతి రక్తనమూనాకు ఒక షూట్‌ మార్చాల్సి ఉంటుందన్నారు. థాయ్‌లాండ్‌ నుంచి వచ్చిన ఒకరికి, ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరికి సంబంధించిన నమూనాలను తీసుకున్నట్లు తెలిపారు. వీరితోపాటు రామగుండం నుంచి ఒక మహిళా దగ్గు, దమ్ముతో వచ్చి నగరంలోని ఒక దవాఖానలో చేరగా శనివారం అమెచనిపోయిందని, ఈ నేపథ్యంలో కారణాలు తెలుసుకునేందుకు అమె రక్త నమూనాలు కూడా సేకరించి గాంధీకి పంపినట్లు చెప్పారు. ఈ నెల 31 వరకు రోజుకు వంద వైద్య బృందాలతో స్క్రీనింగ్‌ కొనసాగిస్తామని వెల్లడించారు. 


logo