బుధవారం 15 జూలై 2020
Karimnagar - Mar 22, 2020 , 03:22:52

ఇండ్లలోనే ఉండండహో

ఇండ్లలోనే ఉండండహో

  • నేటి ఉదయం 6గంటల నుంచి రేపటి ఉదయం 6గంటల దాకా జనతా కర్ఫ్యూ 
  • ముఖ్యమంత్రి పిలుపును స్వాగతిద్దాం.. 
  • 24గంటలపాటు ఇళ్లలోనే ఉందాం.. కరోనాను నియంత్రిద్దాం..
  • చప్పట్లు కొడదాం.. ఐక్యతను చాటుదాం.. 
  • జిల్లాలో యంత్రాంగం విస్తృత ప్రచారం
  • ప్రభుత్వ ఆదేశాలతో మరింత అప్రమత్తం

భయం వద్దు, నిర్లక్ష్యమూ వద్దు.. కరోనా కట్టడికి స్వచ్ఛందంగా కదులుదాం.. పీఎం, సీఎం ఇచ్చిన పిలుపును స్వాగతిద్దాం.. నేటి ఉదయం 6గంటల నుంచి 24గంటల పాటు స్వీయ నిర్బంధం పాటించి, జనతా కర్ఫ్యూలో పాల్గొందాం.. కొవిడ్‌-19ను నియంత్రించి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకుందాం..  

- కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి/ పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ


రెండు నెలలుగా కరోనా వైరస్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. అయితే వైరస్‌కు.. ప్రజలకు మధ్యన సేవకులున్నారు. కరోనా వచ్చినా.. రాకున్నా వారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్నారు. వారిని ఎంకరేజ్‌ చేసే బాధ్యత మనందరిపైనా ఉన్నది. అందులో వైద్యులు, పోలీసులు, అధికారులు, సిబ్బంది, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు, కర్మచారులు, ఎయిర్‌లైన్స్‌, రైల్వే, బస్సు, ఆటో డైవర్లు, సిబ్బంది, హోమ్‌ డెలివరీ, పలు సంస్థల నిర్వాహకులు, సభ్యులు, మీడియా, తదితరులకు ధన్యవాదాలు తెలిపే రోజు ఇది. జనతా కర్ఫ్యూలో ఉండగానే సాయంత్రం 5 గంటలకు అందరూ ఇళ్ల ముందుకు, బాల్కనీల్లోకి రావాలి. కిటికీల్లోంచి చూడాలి. 5 నిమిషాలపాటు చప్పట్లు కొట్టాలి. డోర్‌బెల్స్‌ మోగించాలి. అవసరమైతే ఏదో ఒక చప్పుడుతో కృతజ్ఞతలు తెలియజేయాలి. 

ఇదీ ఉద్దేశ్యం..

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాకుండా ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపునిస్తున్నాయి. కర్ఫ్యూ ఎందుకంటే.. కరోనా వైరస్‌ కొన్ని చోట్ల, ప్రదేశాల్లో కొన్ని గంటలు, రోజులు మాత్రమే ఉంటుంది. వైరస్‌ కేవలం 12 గంటలు మాత్రమే సంబంధిత ప్రదేశాల్లో ఉంటుందని, ఆ తర్వాత నశిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో 24గంటలు జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిస్తున్నది. ఈ నేపథ్యంలో అందరూ స్వీయ నిర్బంధం పాటించాలి. అందరూ కర్ఫ్యూ దిశగా సాగాలి. కరోనాను నియంత్రించాలి. బయట, గుంపుల్లో తిరగకపోవడం, ఇతరులను కలవకపోవడం వల్ల లింకులను ఛేదించినవారమవుతాం. వైరస్‌ వాప్తిని అడ్డుకుంటాం. 

జనతా కర్ఫ్యూ..

ప్రజల కోసం.. ప్రజల చేత.. ప్రజల ద్వారా.. ప్రజలే విధించుకునే స్వీయ నిర్బంధమే జనతా కర్ఫ్యూ. నేటి ఉదయం 6 గంటల నుంచి రేపటి (సోమవారం) ఉదయం 6 గంటల వరకు ప్రజలంతా బయటకు రావద్దు. పక్కింటికి కూడా పోవద్దు. ఇళ్లలోనే ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వీయ నియంత్రణ పాటించడం. 24గంటలు కర్ఫ్యూలో ఉండాలని సీఎం కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఒక ఆదేశం కాదని, ఒక బాధ్యత అని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది, పోలీసులు, మీడియా, ఫైర్‌ సర్వీసులు, రెవెన్యూ, సామాజిక కార్యకర్తలు, సంఘాలు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, తదితర స్వచ్ఛంద, సంస్థల వాటికి మాత్రమే మినహాయింపులున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప.. అస్సలు బయటకు రావద్దు. ఇక ఇళ్లన్నీ శుభ్రం చేసుకోవాలి. బట్టలన్నీ పిండుకోవాలి. చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులను అసలే బయట తిరుగనివ్వద్దు. అత్యవసరమైతే తప్ప రేపటి వరకు బయటకు రాకుండా ఉంటే మరీ మంచిది.  

“మన కుటుంబం కోసం.. రాష్ట్రం కోసం.. మన దేశం కోసం.. మన ప్రపంచం కోసం అందరం జనతా కర్ఫ్యూలో పాల్గొందాం. 12గంటలు కాకుండా 24 గంటలపాటు పాటించి, దేశానికే ఆదర్శంగా నిలుద్దాం. ఇవాళ(ఆదివారం) ఉదయం ఆరు గంటల నుంచి రేపు(సోమవారం) ఉదయం ఆరు గంటల వరకూ ఇండ్లలోనే ఉందాం. స్వీయ నియంత్రణ పాటిద్దాం, కరోనాను తరుముదాం.”

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


స్వీయ నిర్బంధం.. సామాజిక బాధ్యత..

ఇది దేశానికి వచ్చిన విపత్తు లాంటిది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 14 గంటల జనతా కర్ఫ్యూను సీఎం కేసీఆర్‌ 24గంటలకు పెంచారు. ఇది చాలా గొప్ప నిర్ణయం. విపత్కర పరిస్థితుల్లో తీసుకున్న ఇలాంటి నిర్ణయాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. అవసరమైతే కర్ఫ్యూ సమయాన్ని పెంచేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నది. అత్యవసర, నిత్యావసర సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఇంకేవైనా సేవలు అసరమైతే అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎవరూ భయాందోళనలకు గురికావద్దు. ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాం. బయటి నుంచి వచ్చిన వారితోనే ఆందోళన. అందుకే స్వీయ నిర్బంధం అవసరం. దీన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. ప్రజలంతా 24గంటల పాటు జనతా కర్ఫ్యూకు సహరించాలి. 

- కొప్పుల ఈశ్వర్‌,  రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి 

ప్రతి ఒక్కరూ సహకరించాలి..

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు జనతా కర్ఫ్యూకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఆదివారం ప్రజలెవరూ ఇండ్లల్లోంచి బయటికి రాకూడదు. బహుముఖ ప్రజయోజనాలతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. జిల్లాలో విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలి. ‘కొవిడ్‌-19’ వైరస్‌ ఒక చోట 12గంటల పాటే జీవించి ఉంటుంది. ప్రజలు 24గంటల పాటు ఇండ్లల్లోనే ఉంటే, బయట ఉన్న వైరస్‌ అంతా అంతరించిపోతుంది. తద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అత్యవసర సర్వీసులు, నిత్యావసర సరుకుల సేవలు యథావిధిగా కొనసాగుతాయి.

- సిక్తా పట్నాయక్‌, కలెక్టర్‌ 

ఏకతాటిపైకి రావాలి..

కరోనా వైరస్‌ను తరిమి కొట్టేందుకు చేపడుతున్న జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి పాల్గొనాలి. భారత దేశం ఎన్నో విషయాల్లో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. ఆదివారం ఉదయం నుంచి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రుల కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సాయంత్రం 5 గంటలకు ఇంటి గడప, కిటికీల వద్దకు వచ్చి చప్పుట్లు, గంట నాదాలతో అండగా నిలవాలి. వైరస్‌ను తరిమికొట్టే విధంగా ఈ కార్యక్రమం సాగాలి.

- బండి సంజయ్‌కుమార్‌, కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 

విజయవంతం చేద్దాం..

జనతా కర్ప్యూలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి. దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలిచి ఉన్నామని చెప్పడానికి ఇదొక అవకాశం. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలూ చేపడుతున్నాయి. ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఎవరు కూడా ఆదివారం ఉదయం నుంచి బయటకు రావద్దు. ఈ విపత్తు నుంచి బయట పడేందుకు సహకరించాలి. ఇది ఎవరి కోసమో చేపట్టిన కార్యక్రమం కాదు. మన ప్రాణాల కోసం తీసుకునే చర్య. ప్రభుత్వం అందించే సూచనలు పూర్తిస్థాయిలో పాటించాలి. మెడికల్‌షాపులు తప్ప మిగిలిన అన్ని షాపులు కూడా బంద్‌ పాటించాలి.

- వై సునీల్‌రావు, కరీంనగర్‌ మేయర్‌  


ఎవరూ బయటకు రావద్దు

ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజలందరూ ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూను పాటించాలి. ఉదయం నుంచి ఎవరూ బయటకు రావద్దు. ఎక్కడా బయట తిరగవద్దు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వైరస్‌ విస్తరించకుండా అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం 5 గంటలకు ఇళ్ల గుమ్మాల వద్దకు వచ్చి అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతగా చప్పట్లు కొట్టాలి.    

- క్రాంతి, నగరపాలక సంస్థ కమిషనర్‌ 


‘పది’ పరీక్షలు వాయిదా..

రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఆదేశానుసారం ఈ నెల 23 నుంచి 30 వరకు జరిగే పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నాం. తదుపరి పరీక్ష తేదీలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకటిస్తాం. పది పరీక్షలు నిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో విధులకు హాజరుకావాలి. సిట్టింగ్‌ స్కాడ్స్‌, ఏఎన్‌ఏంలు, పోలీస్‌ సిబ్బంది, తమ తమ శాఖల్లో రిపోర్టు చేయాలి. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఎలాంటి తరగతులూ నిర్వహించద్దు.

      - ఎన్వీ దుర్గాప్రసాద్‌, కరీంనగర్‌ డీఈవో  


స్వీయ నిర్బంధంలో ఉండాలి

కరోనా వైరస్‌ నిరోధక చర్యల్లో భాగంగా ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూలో అన్ని వర్గాల ప్రజలు విధిగా పాల్గొనాలి. అన్ని వర్గాల వారు బయటికి రాకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలి. విధి నిర్వహణలో ఉండే పోలీసులు, ఇతర శాఖల అధికారుల విధులకు ఆటంకం కల్గించవద్దు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారయంత్రాంగం చేపడుతున్న చర్యల్లో భాగస్వాములు కావాలి. 

- కమలాసన్‌రెడ్డి, సీపీ (కరీంనగర్‌ క్రైం)logo