ఆదివారం 24 మే 2020
Karimnagar - Mar 21, 2020 , 02:08:19

ఆసరా.. మరింతభరోసా

ఆసరా.. మరింతభరోసా

  • వయోపరిమితి 57 ఏళ్లకు తగ్గడంతో మరో 12,571 మందికి లబ్ధి 
  • జిల్లాకు అదనంగా రూ.2.53 కోట్లు  n ఇప్పటికే 45,916 మందికి పింఛన్లు  
  • లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు

ఆసరా పింఛన్ల అర్హత వయసును 64 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో మరింత మందికి లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే జిల్లాలో 45,916 మంది ప్రతి నెలా పింఛన్లు అందుకుంటుండగా, వీరికి రూ.9.25 కోట్లకు పైగా చెల్లిస్తున్నారు. కొత్తగా 12,571 మంది తీసుకోనుండగా, వీరికి రూ.2.53 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.  

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంతి కేసీఆర్‌ ఆసరా పింఛన్ల వయోపరిమితి 64 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో అనేక మందికి ఆసరా అందనున్నది. ఇటీవల బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించడంతో పాటు.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో 57 ఏళ్లు నిండిన వారిని గుర్తించడంతోపాటు అర్హుల కోసం సర్వేలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరమే జిల్లాలో ఎంత మంది ఉంటారన్న విషయంలో లెక్కలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు 2018 నవంబర్‌లోనే జిల్లా అధికారులు ఓటరు జాబితా అనుసరించి 57 ఏళ్లు ఉన్నవారిని గుర్తించారు. ఇందులో 61,110 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో పింఛన్‌ పొందే అర్హత ఎవరికి ఉందన్న విషయంలో ఆయా ప్రాంతాల వారీగా విచారణ చేసి 14,494 మంది ఉన్నట్లు తేల్చారు. వీరిలోనూ ఇప్పటికే వివిధ రకాల పింఛన్‌ పొందుతున్న వారు... ఆ ఇళ్లలో ఇప్పటికే పింఛన్‌ తీసుకుంటున్న వారిని పరిగణలోకి తీసుకొని మరోసారి విచారణ చేశారు. దీంతో అర్హులు 12,571 మంది ఉన్నట్లు తేల్చారు. దీనికి సంబంధించి నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందించారు. 

మండలాల వారీగా అర్హుల లెక్కలు

ఆసరా పింఛన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించడంతో మండలాల వారీగా అర్హుల జాబితాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. పట్టణాల్లో 1923 మంది అర్హులు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. వీరిలో కరీంనగర్‌ పరిధిలో 753, చొప్పదండిలో 311, హుజూరాబాద్‌లో 91, జమ్మికుంటలో 753, కొత్తపల్లిలో 171 మంది ఉన్నారు. అలాగే మండలాల్లో 10,648 మంది అర్హులను తేల్చారు. చిగురుమామిడి మండలంలో 624, చొప్పదండిలో 806, ఇల్లందకుంటలో 244, గంగాధరలో 1060, గన్నేరువరంలో 469, హుజూరాబాద్‌లో 422, జమ్మికుంటలో 404లో, కరీంనగర్‌ రూరల్‌లో 645, కొత్తపల్లిలో 561, మానకొండూర్‌లో 1287, రామడుగులో 1073, సైదాపూర్‌లో 388, శంకరపట్నంలో 707, తిమ్మాపూర్‌లో 1179, వీణవంకలో 779 మంది లబ్ధిదారులు ఉన్నట్లు తేల్చారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదని డీఆర్‌డీఓ అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

మాలాంటోళ్లకు ఎంతో ఆసరా

రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల వయసును 57 ఏళ్లకు తగ్గించి మాలాంటోళ్లకు ఎంతో అండగా నిలుస్తున్నది. నిజంగా ఈ పథకం ఎందరో వృద్ధులకు ధైర్యాన్ని పెంచుతుంది. వయసు తగ్గించడం వల్ల మరింత మందికి ఆసరా దక్కుతుంది. ప్రభుత్వం ఇచ్చే ఈ పింఛన్‌ కుటుంబానికి ఆసరా నిలుస్తుంది. 

-చిప్ప మల్లేశం, చింతకుంట 

సంతోషంగా ఉన్నది

చిన్నా చితకా పనులు చేసుకునే మాలాంటోళ్లకు ఈ పథకం ద్వారా నెలకు రూ.రెండు వేలు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వం గతంలో లేదు. నిజంగా సీఎం కేసీఆర్‌ మాలాంటి వారికి ఆసరాగా నిలుస్తున్నరు.  

- చిరుత యాదగిరి, కట్టరాంపూర్‌ logo