గురువారం 04 జూన్ 2020
Karimnagar - Mar 21, 2020 , 01:50:23

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలి

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలి

  • వారి ఎడమ చేతి మణికట్టుపై స్టాంప్‌ వేయాలి
  • అనుమానితులకు వైద్య పరీక్షలు చేయాలి
  • కలెక్టర్‌ శశాంక ఆదేశం
  • అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌
  • నరంలో 144 సెక్షన్‌ అమలులో లేదని వెల్లడి
  • చల్మెడ దవాఖానలో సీపీతో కలిసి పరిశీలన

కరీంనగర్‌ ప్రధానప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కరీంనగర్‌ హెల్త్‌ : కరోనా వైరస్‌ ప్రభావిత దేశాలే కాకుండా ఇతర దేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించి, స్టాంపింగ్‌ చేయాలని కలెక్టర్‌ శశాంక మండల ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని మండలాల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్‌హెచ్‌వోలు, ఎంపీవోలు, సర్పంచులతో కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నుంచి జిల్లాకు 371 మంది ప్రయాణికులు వచ్చారని, వారిలో అత్యధికంగా గంగాధర మండలంలో 58, రామడుగులో 48, చొప్పదండిలో 39 మంది ఉన్నారని, మిగతా మండలాల్లో తక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. వీరిని వెంటనే గుర్తించి, వారి ఎడమ చేతి మణికట్టుపై ఇండిబుల్‌ ఇంక్‌తో స్టాంప్‌ వేయాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇంటికే పరిమితమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారిపై కమ్యూనిటీ వాచ్‌ ఉండేలా చూడాలని సూచించారు. పోలీసు అధికారులు ప్రతిరోజూ పెట్రోలింగ్‌ చేస్తూ తనిఖీ చేయాలని, వారు బయటికి రాకుండా జియో ట్యాగింగ్‌ చేయాలని చెప్పారు. ఈ నెల 31న జరగనున్న వివాహాలకు సంబంధించి ఫంక్షన్‌హాళ్లలో వంద మందికి మించకుండా అతిథులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉగాది, శ్రీరామనవమి పండుగలను ప్రజలు ఇండ్లలోనే నిరాడంబరంగా జరుపుకోవాలన్నారు. జిల్లాలో కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో సూపర్‌ మార్కెట్లు, దుకాణదారులు, నిత్యావసర సరుకులు బ్లాక్‌ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయని, అటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, డీఆర్వో పవన్‌కుమార్‌, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, డీపీవో రఘువరన్‌, పోలీసు అధికారులు, అన్ని మండలాల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎస్‌హెచ్‌వోలు, సర్పంచ్‌లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు

కరోనా అనుమానితులను గుర్తించి కచ్చితమైన నిర్ధారణ పరీక్షలు చేయాలని కలెక్టర్‌ శశాంక వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు తిరిగిన మసీదులు, సంచరించిన ప్రాంతాల్లోని నివాసితులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వారికి ముందుగా జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డులో పరీక్షలు నిర్వహించి, చల్మెడ దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులను హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించాలని సూచించారు. అనుమానితుల సెల్‌ఫోన్‌ నెంబర్లు, వారి చిరునామా రికార్డు చేయాలన్నారు. దగ్గు, జ్వరం, శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్న వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో సీపీ, మున్సిపల్‌ కమిషనర్‌తోపాటు ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, వైద్యులు అలీం, జ్యోతి, శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

వైద్య బృందాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నగరంలో వైద్య బృందాలు పరిశీలిస్తున్న క్రమాన్ని కలెక్టర్‌ శశాంక, పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతితో కలిసి తనిఖీ చేశారు. మంకమ్మతోట 36వ డివిజన్‌లోని గృహాల యజమానులతో కలెక్టర్‌ మాట్లాడారు. జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే వెంటనే పరీక్షలు చేయించుకోలని సూచించారు. అనంతరం మంచిర్యాల చౌరస్తాలోని మసీదు-ఏ మహమ్మదీయ వద్ద మత పెద్దలతో మాట్లాడారు. ప్రార్థనా సమయంలో మాస్క్‌లు ధరించాలని, గుంపులుగా ఉండవద్దని, నిలబడి ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. 

చల్మెడ దవాఖానలో పరిశీలన 

చల్మెడ దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డులను కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి పరిశీలించారు. వార్డుల్లో బెడ్స్‌, ఏర్పాటు చేసిన సదుపాయాలు గురించి తెలుసుకున్నారు. వార్డుల శుభ్రత కోసం బ్లీచింగ్‌, క్లీనింగ్‌ లిక్విడ్‌ అందజేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతికి సూచించారు. అలాగే ఐసోలేషన్‌ వార్డులకు ఇతర వార్డుల వారు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది షిప్టుల వారీగా 24 గంటల పాటు విధులు నిర్వహించాలని, ఐసోలేషన్‌ వార్డుల్లో ఉండే అనుమానితుల కోసం టీవీ, వైఫై ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


logo