గురువారం 28 మే 2020
Karimnagar - Mar 17, 2020 , 02:40:36

ఇక డబుల్‌ స్పీడ్‌

ఇక డబుల్‌ స్పీడ్‌

పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర సర్కారు వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే వేల సంఖ్యలో ‘డబుల్‌ బెడ్రూం ఇండ్ల’ నిర్మాణాలు కొనసాగుతుండగా, ఈ నెల 8న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో గృహాల కోసం భారీగా 11,917 కోట్లను కేటాయించింది. ఇక ముందు నిర్మాణాలు మరింత వేగవంతం కానుండగా, తాజా బడ్జెట్‌ ప్రతిపాదనలను చూస్తే ఉమ్మడి జిల్లాకు సుమారు వెయ్యి కోట్ల వరకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపు సొంత స్థలంలో డబుల్‌ ఇల్లు కట్టుకునే వారికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

 • పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర సర్కారు వడివడిగా అడుగులు
 • తాజా బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు
 • ఉమ్మడి జిల్లాకు రూ. వెయ్యి కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశాలు
 • కొత్తగా సొంత స్థలంలో కట్టుకునే వారికి ఆర్థిక సాయం
 • ఇప్పటికే జిల్లాలో జోరుగా ఇండ్ల నిర్మాణాలు
 • మరింత పుంజుకోనున్న వేగం
 • పేద, మధ్యతరగతి వర్గాల్లో హర్షం

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పేదల సొంతింటి కలను నిజం చేసి.. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. గతంలో కేటాయించిన ఇండ్ల నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణాలకు మరింత ఊపును ఇచ్చేందుకు తాజా బడ్జెట్‌లో భారీగా నిధులను ప్రతిపాదించింది. ఇటీవల బడ్జెట్‌లో గృహ నిర్మాణాల కోసం రూ.11,917 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా.. సొంత స్థలం ఉన్న వాళ్లు నిర్మాణం చేసుకునేందుకు వీలుగా వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష మందికి చేయూతనివ్వనున్నట్లుగా తాజా బడ్జెట్‌ సమావేశంలో ప్రకటించారు. ఒకవైపు ప్రభుత్వం నిర్మాణాలు చేయడమే కాదు.. మరోవైపు.. సొంత స్థలం ఉండీ ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతానికి భిన్నంగా ఈసారి బడ్జెట్‌ అధికంగా కేటాయించడం.. పేదల సొంతింటి కలను నెరవేర్చడంపై ప్రభుత్వం ప్రధాన దృష్టి సారించిందని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తున్నది. తాజా బడ్జెట్‌ ప్రకారం చూస్తే.. పూర్వ కరీంనగర్‌ జిల్లాకు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వేగంగా నిర్మాణాలు 

జిల్లాలో ప్రస్తుతం డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి. మండలాలు, గ్రామాల పరిధిలో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎక్కడికక్కడ పనులు జెట్‌స్పీడ్‌తో కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 6,494 ఇండ్లు మంజూరు కాగా.. ఇందులో 6,231 ఇండ్లకు టెండర్లు పిలిచారు. ఆ మేరకు 4,907 ఇండ్లకు సంబంధిత కాంట్రాక్టు సంస్థలతో అగ్రిమెంట్‌ పూర్తి చేశారు. దీంతో ఆయా సంస్థలు ఇండ్లను పూర్తి చేస్తున్నాయి. అలాగే కరీంనగర్‌లో జీప్లస్‌ 5తో 660 ఇండ్ల నిర్మాణం చేస్తున్నారు. వారం పది రోజుల్లో ఇవి పూర్తికానున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లోనూ నిర్మాణాలు సాగుతున్నాయి. కాగా.. ఇప్పటికే 743 ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. అలాగే చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలో 243 ఇండ్లు నిర్మాణం  చేయడంతో పాటు లబ్ధిదారులకు అందించారు. 

ప్రత్యేక దృష్టి 

భూముల సేకరణతో పాటు.. డబుల్‌ బెడ్రూం నిర్మాణాలకు ముందుగా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఆరంభంలో నిర్మాణాల విషయంలో కొంత ఆలస్యం జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం పలు ఆదేశాలను జారీ చేసింది. నిర్మాణాల కోసం.. నిర్మాణ సంస్థలకు కొన్ని అవకాశాలు కల్పించింది. దీంతో టెండర్లలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఫలితంగా నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు ప్రస్తుతం మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. దీంతో మెజార్టీ శాతం ఇండ్లు దాదాపు 95 శాతం వరకు పూర్తయ్యాయి. సదరు ఇండ్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించి.. లబ్ధిదారులకు కేటాయించేందుకు కావాల్సిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తోంది. అంతేకాదు జిల్లా కలెక్టర్ల స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిర్మాణాల్లో ఎక్కడ జాప్యం జరిగినా కారణాలు తెలుసుకొని.. సదరు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డబుల్‌ నిర్మాణాలు జెట్‌స్పీడ్‌తో పూర్తిచేసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

జిల్లాలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల వివరాలు 

 •  మొత్తం మంజూరైన ఇండ్లు : 6,494
 •  పరిపాలన మంజూరైన ఇండ్లు : 6,494
 •  టెండర్‌ పిలిచిన ఇండ్ల సంఖ్య : 6,231
 •  ఆగ్రిమెంట్‌ పూర్తయిన ఇండ్ల సంఖ్య : 4,907
 •  నిర్మాణం పూర్తయిన ఇండ్లు : 743
 •  లబ్ధిదారులకు అందించిన ఇండ్లు : 243
 •  95 శాతం పూర్తయిన ఇండ్లు : 2,726
 •  వివిధ దశల్లో ఉన్న ఇండ్లు: 2,181


logo