శనివారం 30 మే 2020
Karimnagar - Mar 17, 2020 , 02:39:15

కరోనా నివారణకు ముందు జాగ్రత్తలే మేలు

కరోనా నివారణకు ముందు జాగ్రత్తలే మేలు
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  • ప్రజలకు అవగాహన కల్పించాలి
  • శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచాలి
  • కలెక్టర్‌ శశాంక ఆదేశం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ నివారణకు ముందు జాగ్రత్తలే మేలని కలెక్టర్‌ శశాంక సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో  సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యాలయాల సిబ్బందికి కరోనాపై అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద చేతులు శుభ్రం చేసుకునేందుకు లిక్విడ్‌ సోప్స్‌, శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మార్కెట్లు, రైతు బజార్లలో లిక్విడ్‌ సోప్స్‌, నీళ్లు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా నివారణ జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలను రేషన్‌ డీలర్లకు, గ్రామ పంచాయతీలకు అందజేయాలని సూచించారు. నగరంలోని టవర్‌సర్కిల్‌, జ్యోతినగర్‌ లేబర్‌ అడ్డా వద్ద ఎక్కువ సంఖ్యలో కార్మికులుంటారని, వారికి కరోనాపై అవగాహన కల్పించడంతో పాటు డ్రమ్ముల్లో నీళ్లు, లిక్విడ్‌ సోప్స్‌ ఏర్పాటు చేయాలని కార్మికశాఖ అధికారులను ఆదేశించారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే వారు కార్యాలయాలకు రాకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా మెలగవద్దని, అనుమానిత వ్యక్తుల గురించి వైద్యశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తప్పనిసరిగా చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలని, తరచూ సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, జడ్పీ సీఈఓ వెంకటమాధవరావు, డీఆర్‌ఓ పవన్‌కుమార్‌, ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


logo