శనివారం 06 జూన్ 2020
Karimnagar - Mar 17, 2020 , 02:24:28

పట్టణాల్లో స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌

పట్టణాల్లో స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌
  • జిల్లాలో 21 నిర్మించాలని నిర్ణయం
  • షీ టాయిలెట్లకు ప్రాధాన్యం
  • ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం
  • ఫుట్‌పాత్‌లు, బస్‌బేలపైనా ఏర్పాటుకు కసరత్తు
  • వైఫై, చార్జింగ్‌, ఇతర సదుపాయాలు

కరీంనగర్‌తో పాటు జిల్లాలోని నాలుగు పట్టణాల్లో 21 స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌ నిర్మాణం కానున్నాయి. ప్రభుత్వ స్థలాలు, ఫుట్‌పాత్‌లు, బస్‌బేలపై ఏర్పాటు కాబోతున్నాయి. ఈ రూమ్స్‌లలో షీ టాయిలెట్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. టాయిలెట్స్‌, యూరినల్స్‌, హ్యాండ్‌వాష్‌ సౌకర్యాలతో పాటు.. వైఫై, ఫోన్‌ చార్జింగ్‌, ఇతర సదుపాయాలు కల్పించి పూర్తి పరిశుభ్రతతో అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు.కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ‘పట్టణ ప్రగతి’లో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ మేరకు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో నిర్మించాలని, ముఖ్యంగా మహిళల కోసం అన్ని సదుపాయాలతో షీ టాయిలెట్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు చేసింది. దీనికి తోడు ప్రస్తుతం చేపట్టే టాయిలెట్లను పూర్తిస్థాయిలో స్మార్ట్‌వాష్‌ రూమ్స్‌గా తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిలో టాయిలెట్స్‌, యూరినల్స్‌, హ్యాండ్‌వాష్‌ సదుపాయాలతో పాటు.. వైఫై, ఫోన్‌ చార్జింగ్‌, ఇతర సదుపాయాలు కల్పిస్తూ అత్యంత పరిశుభ్రతతో తీర్చిదిద్దాలని సూచించింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ స్థలాల్లో చేపట్టాలని, స్థలం లేని ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌, బస్‌బేలపై వీటిని నిర్మించాలని తెలిపింది. ఇందుకు సంబంధించి మూడు డిజైన్లను కూడా ఇప్పటికే మున్సిపల్‌ అధికారులకు పంపించింది. ఆయా ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా ఈ డిజైన్లను వినియోగించుకోవాలని సూచించింది.

జిల్లాలో 21 నిర్మాణం

కరీంనగర్‌ నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్‌, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో 21 వాష్‌రూమ్స్‌ నిర్మించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ‘పట్టణప్రగతి’లో భాగంగా ఎక్కడెక్కడ నిర్మించాలో అధికారులు గుర్తించారు. కరీంనగర్‌లో 8, చొప్పదండి, కొత్తపల్లిలో 2 చొప్పున, హుజూరాబాద్‌లో 5, జమ్మికుంటలో 4 నిర్మించాలని నిర్ణయించారు. కాగా, బస్‌బే మొదటి అంతస్తులపై నిర్మించేందుకు మున్సిపల్‌ శాఖ డిజైన్‌ ఇవ్వడంతో అలా అవకాశం ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించనున్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు.

ప్రత్యేకతలు

స్మార్ట్‌ వాష్‌రూమ్స్‌లో వివిధ సదుపాయాలు కల్పించనున్నారు. పీపీపీ(ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం)తో నిర్మిస్తున్న ఈ భవనాల్లో ప్రచారబోర్డులు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు. ఫోన్‌ చార్జింగ్‌, వైఫై సదుపాయం కల్పించడంతో పాటు ఏటీఎం, కెఫే, జిరాక్స్‌ సెంటర్‌ పెట్టుకోవడానికి వీలు కల్పించారు. వీటి వల్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పబ్లిక్‌ టాయిలెట్స్‌ను కూడా పూర్తిస్థాయిలో స్మార్ట్‌ వాష్‌ రూమ్స్‌గా మార్చాలని కూడా ప్రభుత్వం సూచనలిచ్చింది. అలాగే బస్‌స్టాప్‌ల వద్ద బస్‌బే మొదటి అంతస్తుపై వాష్‌ రూమ్స్‌ నిర్మించే అవకాశం ఉండడంతో వ్యాపారులు కూడా ముందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. logo