శనివారం 06 జూన్ 2020
Karimnagar - Mar 16, 2020 , 03:04:53

కరోనాపై అలర్ట్‌

కరోనాపై అలర్ట్‌

కరోనా కట్టడికి జిల్లా అధికార యంత్రాంగం మరింత అలర్ట్‌ అయింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పకడ్బందీగా అమలు చేస్తున్నది. ఈ మేరకు ఆదివారం కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, బార్లు, వివిధ క్లబ్‌లు, జిమ్‌ సెంటర్లు, ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్టేడియం, స్విమ్మింగ్‌ఫూళ్లు, పార్కులు, మ్యూజియాలు మూతపడగా, నేడు నిర్వహించే ప్రజావాణి, డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాలను రద్దు చేశారు. ఇటు భారీ జనసందోహం ఉండే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

  • జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తం
  • ప్రభుత్వ ఆదేశాలు పకడ్బందీగా అమలు
  • మూతపడ్డ విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, బార్లు, పార్కులు, జిమ్‌ సెంటర్లు, క్లబ్బులు
  • ఉత్తర్వులు బేఖాతరు చేస్తే కఠిన చర్యలు
  • సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు
  • యథావిధిగా ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలు
  • వివిధ శాఖలతో సమావేశమైన కలెక్టర్‌, సీపీ

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను జిల్లా అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అన్ని సినిమా హాళ్లతో పాటు బార్లు, స్టేడియం, మ్యూజియం, పార్కులను మూసివేశారు. అలాగే జిల్లాలోని హుజూరాబాద్‌, చొప్పదండి, జమ్మికుంట, తదితర మండలాల్లోని థియేటర్లతో పాటు బార్లను మూసివేశారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు తల్లిదండ్రులకు సందేశాలు పంపిస్తున్నాయి. ప్రభుత్వ ఉత్త ర్వులు కచ్చితంగా అమలు చేయాలంటూ ఇప్పటికే అన్ని మండలాల అధికారులకు కలెక్టర్‌ శశాంక ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులు పాటించకుండా ఎవరైనా సంస్థలను తెరిస్తే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికి లాడ్జ్‌లో గదులు అద్దెకు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే జిల్లా కేంద్ర దవాఖానలో 50 పడకల ఐసోలేషన్‌ వార్డును సిద్ధం చేయడంతో పాటు 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 

ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్‌

కరోనాపై ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌ నుంచి అన్ని మండలాల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించాలన్నారు. మండల కేంద్రాల్లోని బస్టాండ్లలో శుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలని, కరోనా వైరస్‌ గురించి పోస్టర్లు వేసి అవగాహన కల్పించాలన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని, అధికారులెవరూ కరోనాపై మీడియా సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించారు. 

నేటి ప్రజావాణి, డీవైసీ రద్దు

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి, డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ శశాంక ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రద్దు చేశామని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. 

పరిశుభ్రత కోసం చర్యలు : మేయర్‌

కరీంనగర్‌లో జన సందోహం ఉండే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. నగరంలో ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. టవర్‌సర్కిల్‌ ప్రాంతంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 

పది పరీక్షా కేంద్రాల సిబ్బంది రిపోర్టు చేయాలి

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌: పదో తరగతి పరీక్షా కేంద్రాల సిబ్బంది, డిపార్టుమెంట్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు ఈ నెల 18న సంబంధిత పరీక్షా కేంద్రాల్లో  కలెక్టర్‌ ఆదేశాల మేరకు రిపోర్టు చేయాలని డీఈవో దుర్గాప్రసాద్‌ తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీ సిబ్బంది సంబంధిత అధికారుల అనుమతి లేకుండా కేంద్రస్థానాల నుంచి వెళ్లకూడదని పేర్కొన్నారు.

ఆందోళనలు అవసరం లేదు: కలెక్టర్‌ శశాంక

కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ శశాంక సూచించారు. ఆదివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సీపీ కమలాసన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇంటర్మీడియెట్‌, పదో తరగతి పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఆర్‌టీసీ బస్సులు నడుస్తాయని, బస్సుల్లో శానిటేషన్‌ పనులు పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫంక్షన్‌ హాళ్లలో వివాహాలకు ఈ నెల 31 వరకు అనుమతి ఉందని, హాల్‌ నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలన్నారు. సాంఘిక సంక్షేమ, మైనార్టీ గురుకులాల్లో పరీక్షలు రాసేవారు వసతిగృహాల్లో ఉండవచ్చునని, మిగితా విద్యార్థులను ఇళ్లకు పంపించాలని ఆదేశించారు. పెళ్లి ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించవద్దన్నారు. ప్రైమరీ నుంచి పీజీ వరకు, ఫార్మసీ, నర్సింగ్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలు, వైద్య కళాశాలలు కూడా మూసివేయాలన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కొవాలన్నారు. నగరంలో పారిశుధ్య కార్మికులు శుభ్రత పాటించాలని సూచించారు. దగ్గు, జలుబు ఉన్నవారు ఇళ్లలోనే విశ్రాంతి తీసుకోవాలని, ఎక్కువ ఉంటే దవాఖానల్లో ప్రత్యేక చికిత్స లభిస్తుందని చెప్పారు.

అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు : సీపీ

సోషల్‌ మీడియాలో కొందరు కరోనాపై ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. మన రాష్ట్రంలో కరోనా లేదని, విదేశాల నుంచి వచ్చే వారితోనే వస్తుందని, వారికి విమానాశ్రయంలోనే పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. పాజిటివ్‌గా వచ్చే కేసులను గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. కరోనాపై వచ్చే అసత్యపు వార్తలను నమ్మవద్దని సూచించారు. కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మాస్క్‌లు, శానిటైజర్స్‌ ఎంఆర్‌పీకే విక్రయించాలని, ఎక్కువ ధరలు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయాలని, బ్యాండ్‌లు వాయించే వారిని పిలిపించి ఎలాంటి ఊరేగింపులకూ వెళ్లకుండా సూచనలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, నగర కమిషనర్‌ క్రాంతి, డీఆర్‌వో పవన్‌కుమార్‌, ఆర్‌డీవో ఆనంద్‌కుమార్‌, డీఎంహెచ్‌వో సుజాత, ఆర్‌టీసీ ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్‌ పాల్గొన్నారు. 


logo