బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Mar 16, 2020 , 02:51:19

గల్లీ రోడ్లు మంచిగైతున్నయ్‌..

గల్లీ రోడ్లు మంచిగైతున్నయ్‌..

ఇదొక్క రోడ్డే కాదు, ఇప్పుడు నగరంలోని లింకు రోడ్లన్నీ అభివృద్ధి బాట పడుతున్నాయి. రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా అత్యధికంగా నిధులు ఇస్తుండడంతో మూడేళ్ల నుంచి సమూల మార్పులు కనిపిస్తున్నాయి. కరీంనగర్‌ నగరపాలక సంస్థకు మూడు విడతల్లో 350 కోట్లు విడుదల చేయగా, 566 అభివృద్ధి పనులు మొదలయ్యా. ఇందులో 259 పనులు పూర్తి కాగా, మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయి.

  • నగరంలో మారుతున్న లింకు రోడ్లు n రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధికి ‘బాట’లు
  • వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు n కాలనీల్లో తీరుతున్న కష్టాలు

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఏళ్ల తరబడిగా అధ్వానంగా ఉన్న లింకు రోడ్లన్నీ నాలుగేళ్ల కాలంలో అభివృద్ధి బాట పట్టాయి. నగరంలోని ప్రధాన రహదారులతోపాటు లింకు రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.వంద కోట్లు కేటాయిస్తున్నది. ఇలా మూడేళ్ల కాలంలో ఇతర నిధులు కలుపుకొని సుమారు రూ.350 కోట్లు వచ్చాయి. వీటి నుంచి నగరంలోని అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కేటాయించి, పనులు వేగంగా చేపడుతున్నారు. 

అన్ని వాడల్లోనూ అభివృద్ధి పనులు 

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిధుల కొరతను గుర్తించిన సీఎం కేసీఆర్‌ గత రాష్ట్ర బడ్జెట్‌లోనే నగరపాలక సంస్థకు ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు కరీంనగర్‌ నగరపాలక సంస్థకు విడతల వారీగా రూ.350 కోట్ల నిధులు వచ్చాయి. మొదటి విడతలో విడుదలైన రూ. వంద కోట్లతో నగరంలోని వివిధ లింకు రోడ్లను అభివృద్ధి చేయాలని గత పాలకవర్గం భావించింది. ఈ మేరకు 71 రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. కాగా, ఇందులో ఇప్పటికే 64 రోడ్ల పనులు పూర్తి కాగా, మరో 7 రోడ్ల పనులు తుదిదశలో ఉన్నాయి. రెండో విడతలో రూ.147 కోట్లు మంజూరు కాగా, వీటితో 233 పనులు చేపట్టారు. ఇందులో ఇప్పటికే 177 పనులు పూర్తి కాగా, మరో 56 అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మూడో విడతలో రూ.100 కోట్లు మంజూరు కాగా, 262 రోడ్లు, మురుగు కాలువలు, పైపులైన్ల పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 18 పనులు ఇప్పటికే పూర్తి కాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. వీటికి తోడు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం ద్వారా నగరపాలక సంస్థకు రూ.40 కోట్ల మేర నిధులు రాగా, వీటితో డివిజన్లలోని అంతర్గత రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. కాగా, పనుల విషయంలో మంత్రి గంగుల కమలాకర్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో వేగంగా జరుగుతున్నాయి.

ఏళ్ల తరబడి సమస్యలకు పరిష్కారం

నగరంలో ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల సమస్యలు ఈసారి పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గతంలో శ్రీహరినగర్‌ కాలనీలోని అనేక రహదారులు మట్టి రోడ్లే కాగా.. ఇటీవల వచ్చిన నిధులతో ఆరింటిని సీసీలుగా మార్చారు. అలాగే జ్యోతినగర్‌ మీదుగా భాగ్యనగర్‌ వరకు ఉన్న లింకు రోడ్డు అభివృద్ధికి నోచుకుంది. సంతోష్‌నగర్‌ లింకు రోడ్డు ఏళ్ల తరబడిగా గుంతలు పడి ఉండగా.. ఇప్పుడు సీసీ రోడ్డుతో అందంగా ముస్తాబైంది. అలాగే సుభాష్‌నగర్‌, అశోక్‌నగర్‌, రాంనగర్‌, సప్తగిరికాలనీల్లోని అనేక రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిధులతో కొత్త రూపును సంతరించుకున్నాయి. ఇలా నగరంలోని అన్ని డివిజన్లలో గల్లీల రోడ్లన్నీ అభివృద్ధికి నోచుకున్నాయి. logo