శనివారం 30 మే 2020
Karimnagar - Mar 13, 2020 , 14:41:42

హరితహారం స్ఫూర్తితో పాఠశాల ఆవరణలో కిచెన్‌ గార్డెన్‌

హరితహారం స్ఫూర్తితో పాఠశాల ఆవరణలో కిచెన్‌ గార్డెన్‌

పాఠశాల కిచెన్‌ గార్డెన్‌లో పండించిన కూరగాయలతో విద్యార్థులు, ఉపాధ్యాయుడు 

  • కూరగాయల సాగులో చిన్నారులు
  • మధ్యాహ్న భోజనానికి వినియోగం
  • హరితహారం స్ఫూర్తితో పండ్ల మొక్కల పెంపకం 
  • వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారీ
  • స్ఫూర్తినిస్తున్న దట్నూరు పాఠశాల 
హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకొని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూరు మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడి విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయుడు సుదర్శన్‌ ప్రత్యేక చొరవ తీసుకొని బొప్పాయి, జామ, అల్ల నేరేడు, నిమ్మ మొక్కలు కొనుగోలు చేసి పాఠశాల ఆవరణలో నాటించారు. ఉపాధి హామీ ద్వారా వేప, సీతాఫలం, నీడనిచ్చే మొక్కలను నాటించి వాటికి రక్షణ కంచెలను ఏర్పాటు చేశారు. 

పాఠశాల ఆవరణలో కిచెన్‌ గార్డెన్‌.. 

పాఠశాల అవసరాలు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం పాఠశాల ఆవరణలోనే కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశారు. అందులో టమాటా, వంగ, ఆకు కూరలను సాగు చేస్తున్నారు. వాటిని పశువులు, మేకలు మేయకుండా రక్షణ కంచెను ఏర్పాటు చేసి రోజూ విద్యార్థులు, ఉపాధ్యాయులు నీరు పడుతూ కలుపు తీస్తున్నారు. కూరగాయలు చేతికి వస్తుండడంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వాడుతున్నారు. విద్యార్థులు తినే ఆహారంలో వేస్టేజీని, పేపర్లను కంపోస్టు ఎరువుగా చేసి మొక్కలకు అందిస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనం అందుతున్నది. హరితవనంగా మారిన పాఠశాలలో విద్యార్థులు సొంతంగా కూరగాయలు పండించుకుంటూ మధ్యాహ్న భోజనానికి వినియోగించుకోవడం ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.

హరితహారం స్ఫూర్తితో..

హరితహారం స్ఫూర్తితో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాం. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నా. పాఠశాలలో కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశాం. సేంద్రియ ఎరువులతో మొక్కలు సాగు చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన పౌష్టికాహారం అందిస్తున్నాం. మొక్కలు నాటినందుకు రాష్ట్ర ప్రభుత్వం నాకు హరితమిత్ర అవార్డు అందజేసింది. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సైతం అందుకున్నా. పాఠ్యాంశంలోని పరిసరాల విజ్ఞానంలో ‘మన ఆహారం - మన ఆరోగ్యం’ గురించి ప్రత్యక్షంగా పరిశీలింపజేసి, విద్యార్థులకు బోధిస్తూ చైతన్య పరుస్తున్నాం. -జూపాక సుదర్శన్‌, ఉపాధ్యాయుడు, రాష్ట్ర హరితమిత్ర అవార్డు గ్రహీత (దట్నూరు పాఠశాల)logo