బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Mar 10, 2020 , 01:41:46

885 ఎకరాల్లో నష్టం

885 ఎకరాల్లో నష్టం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులతో కూడిన వర్షం రైతుల కంట నీరు తెప్పించింది. జిల్లాలోని మానకొండూర్‌, కొత్తపల్లి, కరీంనగర్‌ రూరల్‌, చొప్పదండి, రామడుగు, గంగాధర, శంకరపట్నం, తిమ్మాపూర్‌, ఇల్లందకుంట మండలాల్లో పంటలను దెబ్బతీసింది. ఈ ప్రాంతాల్లోని మక్క పంట నేలకొరుగగా... వరి పంటకు కూడ నష్టం వాటిల్లింది. జిల్లాలో 765 ఎకరాల్లో మక్క, 120 ఎకరాల్లో వరి పంట అకాల వర్షానికి దెబ్బతింది. ఈ మేరకు వ్యవసాయ అధికారులు అంచనాలు సిద్ధం చేస్తుండగా, నష్టం మరింత పెరుగనున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో కురిసిన వర్షానికి  గంగాధర మండలంలో 81 ఎకరాల్లో, రామడుగులో 213 ఎకరాల్లో,  చొప్పదండిలో 70 ఎకరాల్లో, శంకరపట్నంలో 42 ఎకరాల్లో, తిమ్మాపూర్‌లో 101 ఎకరాల్లో, ఇల్లందకుంటలో 30 ఎకరాల్లో, కరీంనగర్‌ రూరల్‌లో 200 ఎకరాల్లో, కొత్తపల్లిలో 28 ఎకరాల్లో మక్క పంటకు నష్టం జరిగింది. అలాగే శంకరపట్నం మండలంలో 120 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. చొప్పదండి మండలం రుక్మాపూర్‌, గంగాధర మండలం వెంకంపల్లి గ్రామాల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పర్యటించి దెబ్బతిన్న మక్క పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. మానకొండూర్‌ మండలంలోని గట్టుదుద్దెనపల్లి, చెంజర్ల గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పరిశీలించారు. పలు ప్రాంతాల్లో ఇండ్లు కూడ దెబ్బతినడంతో బాధితులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా మరోవైపు వ్యవసాయ అధికారులు ఆదివారం వర్షం మూలంగా జిల్లాలో ఏ మేరకు పంట నష్టం జరిగిందన్న విషయంలో అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారని, అనంతరం పూర్తిస్థాయి అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలిపారు. 


logo