బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Mar 10, 2020 , 01:35:01

ఆనందోత్సాహాలతో హోలీ

ఆనందోత్సాహాలతో హోలీ

హుజూరాబాద్‌, నమస్తే తెలంగాణ: డివిజన్‌లో హోలీ వేడుకలను సోమవారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే యువకులు రోడ్డు మీదకి చేరుకొని కేరింతలు కొట్టారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.హుజూరాబాద్‌ టౌన్‌: పట్టణంలో హోలీ పండుగ సందర్భంగా యువకుల కోలాహలం కనిపించింది. రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. అలాగే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధికశ్రీనివాస్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మలశ్రీనివాస్‌, మాజీ చైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్‌, కౌన్సిలర్లు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు బల్దియా పాలకవర్గ సభ్యులు స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వేడుకలు జరుపుకున్నారు. ఆయా వేడుకల్లో టీఆర్‌ఎస్‌, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.

జమ్మికుంట: మున్సిపల్‌ పరిధిలో జరిగిన హోలీ వేడుకల్లో జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, పట్టణ సీఐ సృజన్‌రెడ్డి, జడ్పీటీసీ డాక్టర్‌ శ్రీరాం శ్యాం, తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో కలిశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజాప్రతినిధుల వెంట నాయకులు ఉన్నారు.

హుజూరాబాద్‌ రూరల్‌: రంగుల పండుగ హోలీ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో యువకులు రంగులు చల్లుకొని కేరింతలు కొట్టారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గ్రామంలో తిరుగుతూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఇల్లందకుంట:  మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. బూజూనూర్‌లో ఎంపీపీ సరిగొమ్ముల పావని హోలీ ఆడారు. హోలీ వేడుకల్లో ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసు బందోబస్తు చేశారు. అలాగే ఇల్లందకుంటలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో హోలీ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సుధాకర్‌, అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, నవీన్‌శర్మ, ఆలయ సిబ్బంది మోహన్‌, రవి, తదితరులు పాల్గొన్నారు.

సైదాపూర్‌: మండలం కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సోమవారం హోలీ వేడుకల్లో చిన్నా పెద్దా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిపై రంగులు చల్లుకుంటు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో సింగిల్‌విండో చైర్మన్‌ కొత్త తిరుపతిరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

వీణవంక: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో యువతతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు  రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, వైస్‌ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్‌, సింగిల్‌విండో చైర్మన్‌ మావురపు విజయభాస్కర్‌రెడ్డి, కోఆప్షన్‌ మెంబర్‌ హమీద్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు మారముల్ల కొమురయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట రూరల్‌: మండలంలోని అన్ని గ్రామాలల్లో సోమవారం హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, యువకులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగులు చల్లుకొని, స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


logo