బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Mar 08, 2020 , 01:54:56

జయహో నారీ

జయహో నారీ

తల్లిగా.. తోబుట్టువుగా.. అర్ధాంగిగా కండ్ల్లు తెరిచినప్పటి నుంచి కండ్ల్లు మూసే వరకు ప్రతి మగాడి వెనుక నిలుస్తున్నది ఆమె! గృహిణిగా.. శ్రమజీవిగా.. ఉద్యోగిగా.. ప్రజాప్రతినిధిగా సకల బాధ్యతలు నిర్వర్తిస్తున్నది ఆమె! ఇంటా.. బయటా.. నింగీ నేలా.. అన్నింటా ముద్రవేస్తున్నది ఆమె!ఇప్పుడామె పురుషులకు మించి శక్తియుక్తులు చాటుతున్నది! ‘ఆమెకేం తెలుసు’ అన్న మాటల నుంచి ‘ఆమెకే అంతా తెలుసు’అనే స్థాయికి ఎదిగింది! అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ, ‘సరిలేరు ఆమెకెవ్వరు’ అన్న రీతిలో ఔరా అనిపిస్తున్నది! ఆకాశంలో సగమై, అవనిలో అర్ధభాగమై, విజయపథాన నడుస్తూ.. నడిపిస్తున్నది! జయహో జనయిత్రీ.. జయహో విజయనారీ.. 

రాజకీయాల్లో పాత్ర..

ప్రస్తుతం జిల్లా ముఖచిత్రంపై మహిళలు రాజకీయ ప్రతినిధులుగా, ఉన్నతాధికారులుగా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కరీంనగర్‌కు తొలి మహిళా జడ్పీ అధ్యక్షురాలిగా తుల ఉమ కాగా, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కనుమల్ల విజయ ఉన్నారు. జగిత్యాల, సిరిసిల్ల జడ్పీ చైర్‌ పర్సన్లు దావ వసంత, న్యాలకొండ అరుణ, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల ఆర్గనైజర్‌గా మూల విజయారెడ్డి, పెద్దపల్లి జడ్పీ వైస్‌ చైర్మన్‌ మండిగ రేణుక, కరీంనగర్‌ డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి, హుజూరాబాద్‌, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్లుగా గందె రాధిక, బోగ శ్రావణి, అన్నం లావణ్య, రాణవేని సుజాత, సంగి సత్తెమ్మ, జిందం కళ, రామతీర్థపు మాధవి, చిట్టిరెడ్డి మమతారెడ్డి, పుట్ట శైలజ, ముత్యం సునీత పాలనలో తమ ప్రత్యేకతను చాటుతున్నారు. కరీంనగర్‌ జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలకు 8 మంది, 15 ఎంపీపీ స్థానాలకు 10 మంది, 176 ఎంపీటీసీ స్థానాలకు 92 మంది, 60 డివిజన్లలో 32 మంది, 85 కౌన్సిల్‌ స్థానాల్లో 47 మంది కౌన్సిలర్లు, 313 మంది సర్పంచ్‌లకు 164 మంది మహిళా సర్పంచులు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. 


కొలువుల్లో తమదైన ముద్ర..

కరీంనగర్‌ జిల్లా నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, శిక్షణ ఐసీఎస్‌ నితికా పంత్‌ కరీంనగర్‌ డీఐఈఓ రాజ్యలక్ష్మి, మార్కెటింగ్‌ శాఖ డీడీ పద్మావతి, ఐసీడీఎస్‌ పీడీ శారద, డీఎంఅండ్‌హెచ్‌వో సుజాత, ఆత్మ సంస్థ పథక సంచాలకురాలు ఎన్‌ ప్రియదర్శిని, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్‌ డీ లక్ష్మి.. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, డీటీవో అఫ్రిన్‌ సిద్ధిఖీ.. జగిత్యాల జిల్లాలో ఎస్పీ సింధూశర్మ, డీఆర్డీఓ జల్ద అరుణశ్రీ.. ఇలా ఎంతో మంది కీలక శాఖల్లో ముఖ్య అధికారులుగా కొనసాగుతున్నారు. మరెందరో జిల్లా అధికారులుగా, తాసిల్దార్లుగా, ఎంపీడీవోలుగా, ఇతర అధికారులుగా, ఇంజినీర్లు, వైద్యులు, ఉద్యోగులుగా, ప్రొఫెసర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంకా ఎందరో ప్రజారక్షణలో కీలకమైన పోలీస్‌ శాఖలో చేరి స్ఫూర్తిగా నిలుస్తున్నరు. మరెందరో వైద్యులుగా, సామాజిక కార్యకర్తలుగా సేవలందిస్తున్నరు. 


అండగా రాష్ట్ర సర్కారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నది. పుట్టినప్పటి నుంచి అత్తారింటికి చేరేదాకా ఏదో రకంగా భరోసా ఇస్తున్నది. ఆడపిల్ల చదువు సమాజానికి వెలుగని భావించి, చదువుకు ప్రాధాన్యతనిస్తున్నది. బళ్లలో సకల వసతులు కల్పించడంతోపాటు రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేసింది. అన్నింటా ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. పోకిరీలు, ఆకతాయిల నుంచి రక్షణ కల్పించేందుకు షీటీంలను ఏర్పాటు చేసింది. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన, పథకాల సందేహాల నివృత్తి కోసం ‘181’ టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ రంగాల్లో రాణించే వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఆడపిల్ల పెళ్లికి సాయంగా లక్ష నూట పదహార్లు ఇస్తున్నది. పేదింట మాతృత్వం కూడా భారం కావద్దని కేసీఆర్‌ కిట్లు ఇస్తున్నది. ఉచిత కాన్పు చేసి, అబ్బాయి పుడితే 12 వేలు, అమ్మాయి అయితే మరో వెయ్యి అదనంగా ఇస్తున్నది. గర్భిణులను దవాఖానకు తరలించేందుకు 102 వాహనాలను తేవడంతోపాటు గర్భిణులకు పీహెచ్‌సీల్లోనే నెలనెలా ఉచిత స్కానింగ్‌ పరీక్షలు చేయిస్తున్నది. ఏతోడూ లేని ఒంటరి మహిళల బతుకులకు భరోసా ఇచ్చే లక్ష్యంతో జీవన భృతి కల్పిస్తున్నది. స్త్రీ నిధి ద్వారా ఆర్థిక చేయూతనిస్తున్నది. వ్యాపార రంగంలో రాణించే మహిళలను ప్రోత్సహిస్తున్నది. ఆడపిల్లలు, మహిళలపై జరిగే అకృత్యాలను నివారించేందుకు జిల్లాల్లో సఖీ కేంద్రాల (వన్‌ స్టాఫ్‌ సెంటర్లు) ను ఏర్పాటు చేసింది.


సేవామూర్తి.. కృష్ణవేణి

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సేవాకార్యక్రమాల్లో డాక్టర్‌ కొత్త కృష్ణవేణిది వినూత్న పంథా. కరీంనగర్‌ పట్టణానికి చెందిన ఆమె, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. సామాజిక కార్యక్రమాల్లో మిగిలిన వాళ్లకు భిన్నంగా ముందుకు సాగుతున్నారు. అభాగ్యులు, దివ్యాంగులు, అనాథలు, పేదలు, మహిళలు ఇలా అందరికీ సాయపడుతున్నారు. పేదలను చదువులకు సాయం అందించడంతోపాటు అనాథలకు పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. గుడిసె వాసులకు వర్షాకాలంలో టార్ఫాలిన్‌ షీట్లు, చలికాలంలో మురికివాడల్లో బ్లాంకెట్లు, పేద విద్యార్థులకు స్కూల్‌ పుస్తకాలు అందజేస్తున్నారు. నిత్యం దిన పత్రికల్లో వచ్చే మానవీయ కథనాలను చూసి చలించిపోతారు. వారి వద్దకు చేరుకొని, తనకు తోచిన సాయం చేస్తారు. వారి ధైర్యనిస్తారు. పండుగలు, పిల్లల పుట్టినరోజు వేడుకలను ఆమె భిన్నవర్గాల మధ్య జరుపుకుంటారు. ఆశ్రమాల్లోనే కాదు అవసరమైతే ఇంటికి పిలిచి వేడుక జరుపుతారు. తానే స్వయంగా వంట చేసి కడుపు నిండా భోజనం పెడుతారు. ‘పనివారు కాదు.. మనవారు’ అనే నినాదంతో గత కొన్నేళ్లుగా మహిళా దినోత్సవాన్ని కొత్తగా జరుపుతున్నారు. గతంలో పారిశుధ్య మహిళా కార్మికులను పిలిచి భోజనాలు పెట్టించారు. అంతకు ముందు వివిధ ఇండ్లలో పనిచేసే మహిళలను పిలిచి కడుపునిండా అన్నం పెట్టారు. గతేడాది దివ్యాంగులను బేగంపేటలోని తన ఇంటికి పిలిచి, ఆత్మీయంగా మాట్లాడి, కడుపునిండా భోజనాలు పెట్టించారు. దివ్యాంగులు తమ వస్తువులను బయటకు తీసుకేళ్లందుకు వీలుగా హ్యాండ్‌ బ్యాగులను బహూకరించారు. ఈ సారి రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఐదు రోజుల పాటు విభిన్న వర్గాల కళావృత్తులకు చెందిన మహిళలతో ‘సకల మహిళా దినోత్సవ’కార్యక్రమాలు చేశారు. మొదటి రోజు యాదాద్రి-భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం చిన్న కొండూరులో మహిళా రైతులతో దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. రెండో రోజు సూర్యాపేట పట్టణంలో భాగంగా ‘అఖిల భారత పట్టు వికలాంగుల సంఘం’ సూర్యాపేటకు చెందిన మహిళా సభ్యులతో, మూడో రోజు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన మహిళలతో, నాలుగో రోజు హైదరాబాద్‌లోని ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులతో, ఐదో మానకొండూర్‌లో పలు వృత్తుల పనివారితో నిర్వహించారు. ప్రతిభావంతులైన మహిళలను సత్కరించి, చీరలు పంపిణీ చేశారు. ఇలా తాను చేస్తున్న సేవకార్యక్రమాలకు కృష్ణవేణి ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందారు. నేషన్‌ ఎక్సలెన్సీ, తెలంగాణ శక్తి, పీవీ నర్సింహారావు ప్రతిభా పురస్కారం, ఏపీజే అబ్దుల్‌ కలాం ఎక్సలెన్సీ అవార్డు, అమ్మ అవార్డు, సేవామూర్తి పురస్కారం, ఇంటర్నేషనల్‌ ఎక్సలెన్సీ పురస్కారం అందుకున్నారు. దుబాయ్‌కి చెందిన ఇండియన్‌ పీస్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ కూడా పొందారు. మలేషియా తెలుగు సంఘం నుంచి మహిళా శిరోమణి అవార్డు అందుకున్నారు. తన భర్త కొత్త శ్రీనివాస్‌, పిల్లలు దీపక్‌ పటేల్‌, సోని పటేల్‌ సహకారంతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నాననీ, పది మందికి సాయపడాలంటే పదవులు, సంఘాలు, హోదాలు కాదు మంచి మనసుంటే చాలు ఆమె చెబుతున్నారు.


logo