శనివారం 30 మే 2020
Karimnagar - Mar 08, 2020 , 01:50:54

మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలి

మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలి

 సుభాష్‌నగర్‌/కరీంనగర్‌ హెల్త్‌: మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించినప్పుడే అన్ని రంగాల్లో రాణించగలుగుతారని జడ్పీ  చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు, పిల్లలు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్‌ కే శశాంకతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ, సమాజంలో మహిళలు, పురుషులు సమానమేనన్నారు.  కలెక్టర్‌ కే శశాంక మాట్లాడుతూ, ఆడపిల్లలను ఉన్నతంగా చదివించాలని, వారికి మంచి పోషకాహారం అందించాలని సూచించారు. మహిళలు స్వయం సమృద్ధి దిశగా పయనించాలని పేర్కొన్నారు. మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి నిఖితాపంత్‌, కమిషనర్‌ వల్లూరి క్రాంతి, కార్పొరేటర్లు గందె మాధవి, రాపర్తి విజయ మాట్లాడారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాడిన పాటలు, బాల కేంద్రం విద్యార్థినుల నృత్యాలు, అంధ బాలికలు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, కమిషనర్‌ క్రాంతి, ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ సభ్యురాలు శోభారాణి, ట్రైనీ ఐపీఎస్‌ అధికారి నిఖితాపంత్‌, మున్సిపల్‌ ఆడిట్‌ డీడీ రంజిత, కవయిత్రి శశి కిరణ్మయి, న్యూస్‌ రీడర్‌ సరసిజ, కార్మికురాలు పోశవ్వ, తదితరులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. జిల్లా ఇన్‌చార్జి సంక్షేమ అధికారి శారద, కార్పొరేటర్లు, డీఆర్డీవో ఏ వెంకటేశ్వర్లు, తదితరులున్నారు.


వైద్యరంగంలో కీలకం..

 మహిళలు వైద్యరంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కరీంనగర్‌ మెడికవర్‌ దవాఖానలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించగా, డీఎంహెచ్‌వో ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. నగరాన్ని ఆరోగ్యనగరంగా మార్చడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. దవాఖాన యాజమాన్యం డీఎంహెచ్‌ఓను ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేసింది. దవాఖాన అడ్మినిస్ట్రేటర్‌ గుర్రం కిరణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్‌ సుహాల, డాక్టర్‌ ప్రత్యూష, డాక్టర్‌ వినయ్‌కుమార్‌, డాక్టర్‌ మహేశ్‌, డాక్టర్‌ విద్యాసాగర్‌, డాక్టర్‌ సదాశివ్‌ బి తమగొండ, సిబ్బంది పాల్గొన్నారు. 


logo