బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Mar 08, 2020 , 01:47:55

ఘనంగా మహిళా దినోత్సవం

ఘనంగా మహిళా దినోత్సవం

సుభాష్‌నగర్‌/తెలంగాణ చౌక్‌/హౌసింగ్‌బోర్డు కాలనీ: మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ క్లబ్‌ మైదానంలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. జగదీశ్వర్‌ ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి మహిళా తమ హక్కులు-విధులను తెలుసుకుని, సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. నిర్ధేశిత లక్ష్యాన్ని ఎంచుకుని  విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం 42 ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు రిలే రన్‌, డాడ్జ్‌ బాల్‌, స్కిప్పింగ్‌, బెలూన్‌ బ్లాస్టింగ్‌, షాట్‌ఫుట్‌, పొటాటో రన్‌, మార్బుల్‌ స్పూన్‌, చెస్‌, క్యారమ్స్‌, తదితర ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఇక్కడ సంఘం కార్యదర్శి ఎం.కాళీచరణ్‌, ఉపాధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, సంఘ నాయకురాళ్లు శారద, సబిత, మాధవి, నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే రామస్వామి, కార్యదర్శి టీ నర్సయ్య, టీఎన్జీవోస్‌ బాధ్యులు, పీఈటీలు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, తదితరులున్నారు. 

ఫండస్‌ స్కూల్‌లో..

మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక కశ్మీర్‌గడ్డలోని ఫండస్‌ పాఠశాలలో విద్యార్థుల మాతృమూర్తులకు క్రీడా పోటీలను నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్‌ పద్మజ ప్రభాకర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా  పోటీలను ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, పరుగు పందెం, చెంచా పరుగు పోటీల్లో మాతృమూర్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.  కాగా, అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్‌భవన్‌లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. సమాజంలో మహిళల పాత్ర, సమస్యలపై చర్చించారు. సామాజిక సేవ చేసిన మహిళలు, విద్యార్థులకు శాలువా కప్పి, షీల్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళాలు, విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు. 

ఎక్సైజ్‌భవన్‌లో..

 ఎక్సైజ్‌భవన్‌లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎక్సైజ్‌ మహిళా అధికారులు, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. కరీంనగర్‌ ఎక్సైజ్‌ నోడల్‌ డీపీఈవో చంద్రశేఖర్‌, పెద్దపల్లి డీపీఈవో రవికుమార్‌, ఎక్సైజ్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు ఎంపీఆర్‌ చంద్రశేఖర్‌, తాతాజీ, ఎస్‌ఐల సంఘం బాధ్యుడు కిషన్‌, మినిస్ట్రీరియల్‌ సంఘం బాధ్యులు మనోహర్‌, శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు పులి నగేశ్‌గౌడ్‌, యుగంధర్‌, సుధాకర్‌, శ్రీకాంత్‌, అంజయ్య, మహిళా ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


logo