గురువారం 28 మే 2020
Karimnagar - Mar 07, 2020 , 01:20:43

సామాజిక కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న బీర్‌పూర్‌ యువకులు

సామాజిక కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న బీర్‌పూర్‌ యువకులు

సారంగాపూర్‌ : పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన వచ్చిన ఓ పూర్వ విద్యార్థి, అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టాడు. తనతో చదివిన వారిని, గ్రామం నుంచి విదేశాల్లో స్థిరపడిన వారిని సామాజిక మాధ్యమం వాట్సాప్‌ ద్వారా ఒకటి చేశాడు. గ్రామాభివృద్ధికి దోహదపడుతూ పలు సామాసాజిక కార్యక్రమాలు చేపడుతూ గ్రామస్తులకు ‘మేమున్నా’మనే భరోసానిస్తూ బీర్‌పూర్‌ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

బీర్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2015 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు వివిధ ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడిపోయారు. పూర్వ విద్యార్థులో ఒకరైన చిట్నేని విజయ్‌ కుమార్‌, గ్రామాభివృద్ధికి ఎంతో కొంత సేవ చేయాలనే సంకల్పంతో పాఠశాలలో చదువుకున్న వారందరినీ ఒక దగ్గరకు చేర్చేందుకు సామాజిక మాధ్యమం వాట్సాప్‌ ద్వారా గ్రూపును ఏర్పాటు చేశారు. గ్రామంలో ఏ ఆవసరం ఉన్నా సమాచారాన్ని విజయ్‌ కుమార్‌ వాట్సప్‌ గ్రూపులో పోస్ట్‌ చేసేవాడు. అందులో ఉన్న వారంతా స్పందిస్తూ తమకు తోచినంత సహకారం చేస్తుండడంతో గ్రామంలో నాలుగేళ్లుగా పలు అభివృద్ధి, వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వారిని గుర్తించి సహకారం అందిస్తున్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థులు తాగునీటికి పడుతున్న ఇబ్బందులను గుర్తించి పాఠశాల ఆవరణలో రూ, 85వేలతో 10వేల లీటర్ల సామర్థ్యం గల మంచి నీటి ట్యాంక్‌ను నిర్మించారు. ఏటా పదో తరగతిలో ప్రతిభ చూపుతున్న ఇద్దరు విద్యార్థులను గుర్తించి నగదు ప్రోత్సాహం అందిస్తున్నారు. అనాథ పిల్లాలకు ఒక్కొక్కరికి 1000, 1500చొప్పున అందించారు. పేద విద్యార్థులకు ఏటా పుస్తకాలు, నోట్‌బుక్కులు, పెన్నులు, సామగ్రిని ఉచితంగా అందిస్తున్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఏటా వేల సంఖ్యలో వచ్చే భక్తులకు తాగునీటి సమస్య ఉండకుండా ఉచితంగా మినరల్‌ వాటర్‌ను అందిస్తున్నారు. కొండపైన ఈ సంవత్సరం జరిగిన బ్రహ్మోత్సవాలకు మినరల్‌ వాటర్‌ అందించేందుకు రూ.90వేలతో షెడ్డు నిర్మించారు. భక్తులు కూర్చునేందుకు సిమెంట్‌ బెంచీలు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీకి రూ.60వేలతో బాడీ ఫ్రీజర్‌ను సైతం అందజేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆనంద నిలయంలో చదువుతున్న అనాథ విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్వెటర్లు పంపిణీ చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు ఆర్థికంగా తమవంతు సహకారం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ సేవలందిస్తున్నారు. హరితహారంలో భాగంగా పలు ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటి స్ఫూర్తినింపారు.  


logo