ఆదివారం 31 మే 2020
Karimnagar - Mar 05, 2020 , 02:21:34

ఒకటి నుంచి ప్రతిరోజూ తాగునీరు

ఒకటి నుంచి ప్రతిరోజూ తాగునీరు

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌లో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రతిరోజూ మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ శశాంకతో కలిసి అర్బన్‌ మిషన్‌ భగీరథ నీటి సరఫరాపై మున్సిపల్‌, వాటర్‌ గ్రిడ్‌, పబ్లిక్‌ హెల్త్‌, ఎల్‌అండ్‌టీ ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మిషన్‌ భగీరథ కింద పూర్తికాని రిజర్వాయర్లు, మంచినీటి పైపులైన్‌, పైపులైన్లకు ఇవ్వాల్సిన ఇంటర్‌ కనెక్షన్‌ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ నెల 15 నుంచి వారంపాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ, వాటర్‌గ్రిడ్‌, మున్సిపల్‌, మిషన్‌ భగీరథ ఇంజినీరింగ్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని, ప్రెషర్‌ తక్కువగా ఉన్న పైపులైన్లను సరి చేయాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న పైపులైన్లకు ఇంటర్‌ కనెక్షన్లు, ప్రతి ఇంటికీ భగీరథ కనెక్షన్లు ఇవ్వాలని, అక్రమంగా ఉన్న నల్లాలను క్రమబద్ధ్దీకరించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ వై. సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, ఎస్‌ఈ భద్రయ్య, మిషన్‌ భగీరథ, వాటర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ ఇంజినీరింగ్‌ అధికారులు, డీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.


చెక్కుల పంపిణీ..

కలెక్టరేట్‌ ఆడిటోరియంలో 45 మంది లబ్ధిదారులకు మంత్రి గంగుల కమలాకర్‌ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 5 వేల మందికి చెక్కులు అందజేశామన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌  సునీల్‌రావు, జడ్పీటీసీ పీ కరుణ, ఎంపీపీ శ్రీలత, మహేశ్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు సాబీర్‌పాషా, కార్పొరేటర్లు, కొత్తపల్లి, కరీంనగర్‌ తాసిల్దార్లు పాల్గొన్నారు. కరోనా అలర్ట్‌


కరీంనగర్‌ హెల్త్‌/ లీగల్‌/ కమాన్‌ చౌరస్తా/ హుజూరాబాద్‌ టౌన్‌ : చైనా నుంచి విజృంభించిన కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నది. ప్రజా జీవనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నది. విదేశాల నుంచి వస్తున్న వారిలో అనుమానితులుండడం ఆందోళన కలిగిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ఈ మేరకు అందిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగింది. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి, వ్యాధి వ్యాప్తి, లక్షణాలు, నివారణపై ప్రజలకు చేరేలా విస్తృత ప్రచారం చేస్తున్నది. ఇదే సమయంలో ఆయా శాఖల వారీగా ముందస్తు చర్యలు చేపడుతున్నది. జిల్లాకు గ్రానైట్‌తో చైనా దేశానికి సంబంధాలుండడంతో వైద్య ఆరోగ్యశాఖ జాగ్రత్తలు చేపట్టింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. 


జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌, ఆర్‌ఎంవో శౌరయ్య, డీఎంఅండ్‌హెచ్‌వో సుజాత జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఫిజీషియన్‌, పల్మొనాలజీ, స్టాఫ్‌నర్స్‌, సిబ్బందిని నియమించారు. డ్రగ్స్‌, మాస్క్‌లు అందుబాటులో ఉంచారు. డీఎంఅండ్‌హెచ్‌వో సుజాత మాట్లాడుతూ, కరోనా వదంతులకు భయపడాల్సిన అవసరం లేదని, జిల్లాలో అలాంటి కేసులు ఇంతవరకు రాలేదని చెప్పారు. ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చే వారికి ఎయిర్‌ పోర్టులోనే పూర్తిస్థాయిలో పరీక్షలు చేస్తున్నారని, అనుమానితులుంటే 28 రోజుల పాటు ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ కింద (ప్రత్యేక రూం)లో పెడుతున్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించలేదని పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. 

 

ఆర్టీసీ బస్టాండ్లలో ముందస్తు చర్యలు..

రద్దీ ఉండే ప్రాంతాల నుంచే వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముండగా ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న పది డిపోల మేనేజర్లు, సిబ్బందిని ఇప్పటికే ఆర్‌ఎం జీవన్‌ ప్రసాద్‌ అప్రమత్తం చేశారు. ఈ మేరకు  బుధవారం సాయం త్రం తర్వాత అన్ని బస్టాండ్లలో కుర్చీలను, ఏసీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌, ఎ క్స్‌ప్రెస్‌తోపాటు అన్ని బస్సుల సీట్లను ప్రత్యేక లిక్విడ్‌తో శుభ్రం చేస్తున్నారు. బస్సుల్లో స్ప్రే చేయడంతోపాటు ప్రయాణికులు నిల్చున్నప్పుడు పట్టుకునే పైపులను కూడా క్లీన్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తగా మాస్క్‌లు ధరించాలన్నారు.  


కోర్టు ఆవరణల్లో జాగ్రత్తలు..

జిల్లా కేంద్రంతో పాటు ఇతర కోర్టుల ఆవరణలో కరోనా వైరస్‌ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కోర్టు ఆవరణలో కరోనా వైరస్‌ ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటేషన్‌ పనులపై తక్షణ చర్యలు చేపట్టాలని, వాటిలో సబ్బులు, హ్యాండ్‌వాష్‌లు అందుబాటులో ఉంచాలని, న్యాయమూర్తులకు కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు కక్షిదారులకు మాస్క్‌లు అందించాలని అందులో సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి సహకారంతో కోర్టు ఆవరణలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని, వైరస్‌ రాకుండా హోమియో మందులు అందించాలని, వైరస్‌ అనుమానంపై కాల్‌ చేస్తే మెడికల్‌ టీం త్వరగా కోర్టు ఆవరణకు చేరేలా చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. logo