గురువారం 28 మే 2020
Karimnagar - Mar 05, 2020 , 02:16:49

ఒకటి నుంచి ప్రతిరోజూ తాగునీరు

ఒకటి నుంచి ప్రతిరోజూ తాగునీరు

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌లో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రతిరోజూ మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ శశాంకతో కలిసి అర్బన్‌ మిషన్‌ భగీరథ నీటి సరఫరాపై మున్సిపల్‌, వాటర్‌ గ్రిడ్‌, పబ్లిక్‌ హెల్త్‌, ఎల్‌అండ్‌టీ ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మిషన్‌ భగీరథ కింద పూర్తికాని రిజర్వాయర్లు, మంచినీటి పైపులైన్‌, పైపులైన్లకు ఇవ్వాల్సిన ఇంటర్‌ కనెక్షన్‌ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ నెల 15 నుంచి వారంపాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ, వాటర్‌గ్రిడ్‌, మున్సిపల్‌, మిషన్‌ భగీరథ ఇంజినీరింగ్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని, ప్రెషర్‌ తక్కువగా ఉన్న పైపులైన్లను సరి చేయాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న పైపులైన్లకు ఇంటర్‌ కనెక్షన్లు, ప్రతి ఇంటికీ భగీరథ కనెక్షన్లు ఇవ్వాలని, అక్రమంగా ఉన్న నల్లాలను క్రమబద్ధ్దీకరించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ వై. సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, ఎస్‌ఈ భద్రయ్య, మిషన్‌ భగీరథ, వాటర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ ఇంజినీరింగ్‌ అధికారులు, డీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.


చెక్కుల పంపిణీ..

కలెక్టరేట్‌ ఆడిటోరియంలో 45 మంది లబ్ధిదారులకు మంత్రి గంగుల కమలాకర్‌ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 5 వేల మందికి చెక్కులు అందజేశామన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌  సునీల్‌రావు, జడ్పీటీసీ పీ కరుణ, ఎంపీపీ శ్రీలత, మహేశ్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు సాబీర్‌పాషా, కార్పొరేటర్లు, కొత్తపల్లి, కరీంనగర్‌ తాసిల్దార్లు పాల్గొన్నారు. 


logo