శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Mar 04, 2020 , 03:17:12

‘ప్రగతి’ జోరు

‘ప్రగతి’ జోరు
  • తొమ్మిదో రోజుకు ‘పట్టణ ప్రగతి’
  • బల్దియాల్లో జోరుగా పారిశుధ్య పనులు
  • కరీంనగర్‌లో పాల్గొన్న మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌
  • హుజూరాబాద్‌, జమ్మికుంటలో ప్రత్యేకాధికారులతో కలెక్టర్‌ సమీక్ష
  • చొప్పదండిలో పాల్గొన్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  • వాడల్లో లూజు వైర్లు తొలగించినవిద్యుత్‌ సిబ్బంది

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ :  పట్టణ ప్రగతి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతున్నది. తొమ్మిదో రోజైన మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ వై సునీల్‌రావు కరీంనగర్‌లోని 16వ డివిజన్‌లో పాదయాత్ర నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్‌లో చేపట్టనున్న వివిధ అభివృద్ధికి పనులకు శంకుస్థాపన చేశారు. హుజురాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీలకు చెందిన వార్డుల ప్రత్యేకాధికారులతో జిల్లా కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్డుల్లో గుర్తించిన సమస్యల పరిష్కరానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదించాలని ఆదేశించారు. అంతకు ముందు మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు పాల్గొని మొక్కలు నాటారు.


 స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. చొప్పదండి మున్సిపాలిటీలోని 11వ వార్డులో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పాదయాత్ర ద్వారా ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. కొత్తపల్లిలో చైర్మన్‌ రుద్రరాజు 10వ వార్డులో పాల్గొని పాదయాత్ర చేపట్టారు. హుజురాబాద్‌ మున్సిపాలిటీలో 16, 17, 26, 27, 28 వార్డుల్లో చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల పాదయాత్ర నిర్వహించి సమస్యలు గుర్తించారు. మైదానాల్లోని చెత్తను తొలగించారు. పబ్లిక్‌ నల్లాలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించారు.


logo