శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Mar 02, 2020 , 02:36:35

‘పది’లో ప్రథమ స్థానమే లక్ష్యం

 ‘పది’లో ప్రథమ స్థానమే లక్ష్యం

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని 150 ప్రభుత్వ ఉన్నత, 11 ఆదర్శ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక, జిల్లా విద్యాశాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి వార్షిక పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్‌ 6 వరకు రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 71 కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 6,769 మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 7,318 మంది చొప్పున మొత్తం 14,087 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. 


కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి

మరో వైపు పది ఫలితాల్లో జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కలెక్టర్‌ శశాంక జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు, ప్రత్యేక అధికారులతో పాటు మండల ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశాలను నిర్వహించారు. పదో తరగతి విద్యార్థుల్లో పరీక్ష పట్ల ఉన్న భయాన్ని వీడేందుకు ప్రేరణ (మోటివేషన్‌)తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. గతేడాది వచ్చిన పది ఫలితాలపై సమీక్ష సమావేశంలో ఆరాతీశారు. 80, 90 శాతాల కన్న తక్కువ వచ్చిన సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను వాటికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా దృష్టిని పెట్టాలని సూచించారు. సమష్టి నిర్ణయాలతో జిల్లాను అగ్రస్థానంలో నిలుపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు గ్రూపుల వారీగా తరగతులను నిర్వహించి హాజరు శాతాన్ని పెంచాలని డీఈఓను ఆదేశించారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించి సమాధాన పత్రాలపై ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. కాగా, కలెక్టర్‌ చొరవతో రెండు, మూడు పాఠశాలలకు కలిపి మోటివేషన్‌ తరగతులను ఇప్పటికే నిర్వహించారు. విద్యార్థులు మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరైతే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చునని ఈ తరగతుల సందర్భంగా కలెక్టర్‌ శశాంక పది విద్యార్థులకు విద్యార్థులకు సూచించారు. ఏ పరీక్ష అయినా 20-20 మ్యాచ్‌లాంటిదనీ, మనమీద మనకు ఆత్మవిశ్వాసంతో ఉంటేనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని ధైర్యం కల్పించారు. 


logo