బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Mar 02, 2020 , 02:03:48

వ్యాయామంతో ఆత్మవిశ్వాసం

వ్యాయామంతో ఆత్మవిశ్వాసం

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: విద్యార్థులు, యువతలో ఆత్మవిశ్వాసానికి వ్యాయామం, క్రీడలు దోహదం చేస్తాయని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు అన్నారు. నగర శివారులోని మానేరు డ్యాం సమీపంలో ట్రస్మా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ‘రన్‌ ఫర్‌ ఇండియా’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు హాజరై రన్‌ ఫర్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వ్యాయామం, వాకింగ్‌ చేయడంతో అనారోగ్య సమస్యలు తలెత్తవనీ, ఆత్మవిశ్వాసం సైతం పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు గంటపాటు వ్యాయామం చేయాలన్నారు. విద్యార్థులు వ్యాయామం, ఔట్‌ డోర్‌ గేమ్స్‌ ద్వారా శారీరక, మానసిక ధృడత్వం పెంపొందించుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎరోబిక్స్‌ షో ఆకట్టుకుంది. విద్యార్థులతో పాటు నగరవాసులు  రన్‌ ఫర్‌ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు. మానేరు తీరంపై 2కే, 3కే, 5కే రన్‌ను నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ట్రస్మా జిల్లా కార్యదర్శి దాసరి శ్రీపాల్‌రెడ్డి, టౌన్‌ కార్యదర్శి నరేశ్‌, కోశాధికారి శ్రీనివాస్‌గౌడ్‌, నగర అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర సభ్యులు ముస్తాక్‌ అలీఖాన్‌, శ్రీకాంత్‌, సుజిత్‌, మహేశ్‌, చిన్నప్ప, చరణ్‌, పాఠశాలల కరస్పాండెంట్లు ప్రసాద్‌రావు, కొమురయ్య, రమణారావు, తదితరులున్నారు.


logo