గురువారం 04 జూన్ 2020
Karimnagar - Feb 29, 2020 , 01:25:11

నేర చరితులు సత్ప్రవర్తనతో మెదలాలి

 నేర చరితులు సత్ప్రవర్తనతో మెదలాలి

కరీంనగర్‌ క్రైం : నేర చరితులు సత్ప్రవర్తనతో మెదిలితే పోలీసు రికార్డుల నుంచి పేరు తొలగిస్తామని సీపీ కమలాసన్‌రెడ్డి స్పష్టం చేశారు. కమిషనరేట్‌ కేంద్రంలోని ఓపెన్‌ థియేటర్‌ ఆవరణలో శుక్రవారం కరీంనగర్‌ రూరల్‌ డివిజన్‌ హిస్టరీ షీటర్ల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వివిధ నేరాల్లో నిందితులుగా ఉండి, షీట్లు తెరిచిన నేర చరితులు సమాచారం ఇచ్చిన వెంటనే పోలీస్‌ స్టేషన్లకు రావాలనీ, లేనిపక్షంలో బైండోవర్‌ చేస్తామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నేరాలకు దూరంగా ఉండడంతో పాటు, వయసు పైబడి నేరాలు చేసే స్థితిలో లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండడం, ఇతర అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని వారిపై ఉన్న నేరచరిత్ర షీట్లను తొలగించనున్నట్లు వివరించారు. రౌడీ, హిస్టరీ, అనుమానాస్పద, మతపరమైన అల్లర్లలో ప్రమేయం ఉన్న వారిని ప్రతి శనివారం స్టేషన్లకు పిలిపించి వివరాలు సేకరిస్తామన్నారు. నేర చరిత్ర సమాజంలో మాయని మచ్చలాంటిదనీ, ఈ ప్రభావం పిల్లలపై పడి సమాజంలో చిన్న చూపు చూడడంతో పాటు వివాహాది శుభ కార్యాలకు ఆటంకంగా పరిణమిస్తుందన్నారు. పోలీస్‌ స్టేషన్లకు గైర్హాజరయ్యే నేర చరితులు ఇతర నేరాలకు పాల్పడుతున్నారేమోనని అనుమానం తలెత్తుతోందనీ, వారి కదలికలపై నిఘా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయసారథి, ఇన్‌స్పెక్టర్లు తుల శ్రీనివాస్‌రావు, మహేశ్‌గౌడ్‌, సంతోశ్‌కుమార్‌, రమేశ్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 


logo