బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 28, 2020 , 02:05:54

నాలుగో రోజూ ప్రగతి జోరు

నాలుగో రోజూ ప్రగతి జోరు

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):బల్దియాల్లో ‘పట్టణ ప్రగతి’ జోరుగా సాగుతున్నది. సోమవారం (ఈ నెల 24) మొదలైన ఈ కార్యక్రమం, నాలుగో రోజుకు చేరుకున్నది. గురువారం నగరంలోని 38వ డివిజన్‌లో కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్‌ కచ్చు రవితో కలిసి ఎంపీ బండి సంజయ్‌ పాదయాత్ర చేశారు. తుప్పుపట్టిన విద్యుత్తు స్తంభాలను తొలగించి కొత్తవి వేసే పనులను ప్రారంభించి, మాట్లాడారు. పార్టీలకతీతంగా ‘పట్టణ ప్రగతి’లో పాల్గొనాలనీ, ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా కృషి చేస్తేనే నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 24, 55వ డివిజన్లలో మేయర్‌ వై సునీల్‌ రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి పాదయాత్రలు చేసి, డివిజన్లలో సమస్యలను గుర్తించారు. వీటిని పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్లతో కలిసి మేయర్‌, కమిషనర్‌ మొక్కలు నాటారు. 55వ డివిజన్‌లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. కొత్తపల్లిలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌ పర్యటించారు. సంఘం చౌరస్తా నుంచి శశ్మాన వాటిక వరకు, అలాగే కరీంనగర్‌, జగిత్యాల ప్రధాన రహదారి వెంట పాదయాత్రలు చేశారు. రోడ్ల పక్కన ఉన్న చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగింయి, శుభ్రంగా మార్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.  

హుజూరాబాద్‌లో కలెక్టర్‌ కే శశాంక పర్యటించారు. రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. 27వ, 19వ వార్డుల్లో పాదయాత్ర చేశారు. స్థానిక హైస్కూల్‌ గ్రౌండ్‌లో వాకర్స్‌ అనుకూలంగా ట్రాక్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జమ్మికుంటలోనూ పర్యటించారు. 23, 24, 26, 27వ వార్డుల్లో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 27వ వార్డుకు చెందిన ఓ మహిళతో ఆప్యాయంగా మాట్లాడారు. యోగక్షేమాలు అడుగడంతోపాటు మున్సిపల్‌ సిబ్బంది పనితీరు గురించి తెలుసుకున్నారు. హుజూరాబాద్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. 4, 19, 27వ వార్డుల్లో రోడ్ల వెంట ఉన్న చెత్తా చెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించారు. 11వ వార్డులో రోడ్లకి ఇరువైపులా ఉన్న చెట్లను ప్రొక్లెయిన్‌ సహాయంతో తొలగించారు. 8వ వార్డులోని ప్రభుత్వ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. 23వ వార్డులో పిచ్చి మొక్కలు తొలగించారు. 20వ వార్డులో ఓ ఇంటి యజమాని పంజాల కుమారస్వామి తన పాత ఇంటిని సొంత ఖర్చులతో తొలగించుకోగా, చైర్‌పర్సన్‌ గందె రాధిక శాలువతో సన్మానించారు. 

చొప్పదండిలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గుర్రం నీరజతో కలిసి 1, 2వ వార్డుల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పాదయాత్ర చేశారు. స్థానికంగా గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఆయా వార్డుల ప్రజలను కోరారు. 


logo