శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Feb 28, 2020 , 02:02:19

‘పెస్టిసైడ్స్‌ దందా’ గుట్టురట్టు

‘పెస్టిసైడ్స్‌ దందా’ గుట్టురట్టు

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  అనుమతి లేని క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. నగర శివారులోని బొమ్మకల్‌లో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ దందా గురువారం వ్యవసాయ అధికారుల దాడుల్లో బహిర్గతమైంది. ఒక చోటికి లైసెన్స్‌ తీసుకుని మరో చోట నిర్వహిస్తూ గుట్టుగా విక్రయిస్తున్న దాదాపు 41.80 లక్షల విలువైన సరుకును అధికారులు పట్టుకున్నారు. రెవెన్యూ, పోలీస్‌ శాఖల సహాయంతో ఎరువుల దుకాణాన్ని సీజ్‌ చేశారు. అనుమతి లేని క్రిమిసంహారక మందులు విక్రయించడం, కరీంనగర్‌ అర్బన్‌లో లైసెన్స్‌ తీసుకొని రూరల్‌లో దుకాణం నడుపుతున్న గుంటూరు శ్రీనివాస్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

 గుజరాత్‌ టూ కరీంనగర్‌..

రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌ అనుమతి ఇవ్వని క్రిమిసంహారక మందులను కొందరు డీలర్లు అక్రమ పద్దతుల్లో నేరుగా తెప్పించుకుని విక్రయాలు సాగుతున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌ అనుమతి లేని క్రిమిసంహారక మందుల జాబితాలో ఉన్న ఫొరెట్‌-10 జీ క్రిమిసంహారక గులికలను బొమ్మకల్‌లోని ఓ గోదాంలో గుంటూరు శ్రీనివాస్‌ అనే వ్యక్తి అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న వ్యవసాయ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. అక్కడ సాగుతున్న దందాను చూసి అవాక్కయ్యారు. గాయత్రి ఆగ్రో ఏజెన్సీ పేరిట 2016లో స్థానిక నాకాచౌరస్తాలో నిర్వహించేందుకు లైసెన్స్‌ తీసుకున్న శ్రీనివాస్‌, బొమ్మకల్‌ బైపాస్‌ రోడ్డులోని ఓ గోదాంలో ఈ క్రిమిసంహారక గులికలను హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నడు. ఇతని వద్ద నుంచి రిటైల్‌ డీలర్లు, రైతులు కూడా కొనుగోలు చేస్తున్నట్లు తెలుసుకున్న కరీంనగర్‌ రూరల్‌ వ్యవసాయ అధికారి సత్యం తన సిబ్బందితో వెళ్లి తనిఖీ చేయగా 1,540 బస్తాల్లో సుమారు 38.05 టన్నుల అనుమతి లేని క్రిమిసంహారక గులికలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్‌ అక్కడికి వెళ్లి ఇన్‌వాయిస్‌లు, పర్మిట్లు పరిశీలించారు. ఈ క్రిమిసంహారక మందులు చాలామట్టుకు గుజరాత్‌తోని సర్దార్‌ పటేల్‌ కెమికల్‌ కంపెనీ నుంచి వస్తున్నట్లు, కొన్ని ఏపీలోని గుంటూరు నుంచి కూడా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల సహాయాన్ని తీసుకుని రెవెన్యూ అధికారులతో దుకాణాన్ని సీజ్‌ చేయించారు. 

 గుట్టుగా అమ్మకాలు..

గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి చాలా కాలంగా కరీంనగర్‌లో ఉంటూ ఎరువుల వ్యాపారం చేస్తున్నాడు. ఇతను కరీంనగర్‌లోని నాకాచౌరస్తాలో గాయత్రి ఆగ్రోస్‌ పేరిట 2016లో లైసెన్స్‌ తీసుకున్నారు. అప్పుడు 2018 వరకే అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఫర్టిలైజర్‌ దుకాణాలకు పర్మినెంట్‌ లైసెన్స్‌లు ఇస్తున్నప్పటికీ శ్రీనివాస్‌ తన లైసెన్స్‌ను కొత్త నిబంధనల ప్రకారం రెన్యువల్‌ చేయించుకోలేదు. పైగా అర్బన్‌ ఏరియాలోని లైసెన్స్‌ తీసుకున్న శ్రీనివాస్‌ బొమ్మకల్‌లోని బైపాస్‌ రోడ్డులోని ఓ గోదాంలో ఎలాంటి బోర్డులు లేకుండా యథేచ్ఛగా అనుమతి లేని క్రిమి సంహారక మందులు విక్రయిస్తున్నాడు. పలు కారణాలచేత రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని క్రిమి సంహారక మందుల విక్రయానికి అనుమతులు ఇవ్వలేదు. ఇలాంటి మందులను గుట్టుగా విక్రయిస్తూ శ్రీనివాస్‌ పెద్దఎత్తున అక్రమ దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. హోల్‌సేల్‌ విక్రయాలు చేస్తూ, ఇప్పటికే రిటైల్‌ దుకాణాలకు పెద్ద ఎత్తున సరఫరా చేసినట్లు సమాచారం. బైపాస్‌లోని ఓ గోదాములో రోడ్డు వైపుకు ఉన్న షటర్లకు ‘టు లెట్‌' అని బోర్డులు పెట్టి ఉన్నాయి. వెనక నుంచి మాత్రం ఈ అక్రమ దందా సాగుతున్నది. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు రైతులు అనుమానం వచ్చి వ్యవసాయ అధికారులకు సమాచారం అందించడంతో శ్రీనివాస్‌ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ దాడుల్లో ఏడీఏ అంజన, రూరల్‌ ఏఓ సత్యం, అర్బన్‌ ఏఓ హరిత తదితరులు పాల్గొన్నారు. కాగా అనుమతి లేని క్రిమి సంహారక మందులు విక్రయిస్తున్న శ్రీనివాస్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 


logo